శ్రీ శంకరాచార్యులు ‘బ్రహ్మ సత్యం, జగన్మిధ్య’ అని బోధించారు. యత్ పశ్యతి తన్నశ్యతి (కంటికి కనిపించేదంతా నశించేదే) అని అంటారు. సామాన్యంగా. వినగానే అది నిజమే అనిపిస్తుంది. కాని అది యదార్థం కాదు. సృష్టికి నాశనం లేదు (conservation of Mass/Energy) అని Science ఋజువు చేసింది; Matter can neither be created nor destroyed పదార్ధాన్ని మనం – సృష్టించలేము, నాశనం చేయలేము అని వివరించింది. పరీక్ష నాళిక ద్వారా ప్రయోగశాలలో కనిపించే దంతా నశ్వరము, అశాశ్వతమూ అని అంటే అమ్మ, “సృష్టి పరిణామశీలం కలది. సృష్టికి నాశనం (annihilation) లేదు. పరిణామం సత్యం, నాన్నా!” అని తిరుగులేని సందేశాన్ని అందించింది. సృష్టి స్థితి లయాలు కూడా సృష్టికి సహజ ధర్మాలై అమ్మ పరిణామ సిద్ధాంతాన్ని యధాశక్తి వివరిస్తున్నాయి.
ఆధ్యాత్మిక మహోన్నత శిఖరాన్ని అవలీలగా అధిరోహించి అమ్మ “సృష్టేదైవం” అని ప్రప్రథమంగా ఎలుగెత్తి చాటింది. దైవం చీమలో దోమలో ఉన్నాడంటే, “చీమగా దోమగా ఉన్నాడు” అని వాస్తవాన్ని సంపూర్ణత్వాన్ని చాటింది. ‘పిపీలికాది బ్రహ్మ పర్యంతం’ అని అంటే “పిపీలిక (చీమ) బ్రహ్మ కాకపోతే కదా!” అనే అమ్మ నిశ్చితాభిప్రాయం అచ్చమైన దర్శనాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరమసత్యాన్ని వేదాలు ఎన్నో విధాలుగా విశదపరచాయి. ‘తత్ సృష్ట్యా తదేవానుప్రావిశత్; విజ్ఞానంచా విజ్ఞానం, సత్యంచానృతం చ సత్య మభవత్-‘ అని. పండితులకే కాదు పామరులకు సైతం సులభంగా అర్థం అయ్యే విధంగా అమ్మ “జగన్మాత అంటే జగత్తే” అని సృష్టికీ, సృష్టికర్తకీ అభేదత్వాన్ని చాటి అద్వైత తత్త్వామృతరసాన్ని తరతమభేదం లేక సర్వులకు పంచింది. కనుకనే ‘నువ్వు రాజరాజేశ్వరివి, అమ్మా!” అని అంటే, “మీరు కానిది నేనేదీ కాను. మీలో నన్ను చూసుకోనప్పుడు కదా చిక్కు” అనీ స్పష్టం చేసింది.
ఒకసారి ఇజ్రాయెల్ నుంచి ఒక క్రైస్తవ సోదరుడు అమ్మ సన్నిధికి వచ్చాడు. అమ్మ సన్నిధి ఆనంద రసోదధి వలె ఎప్పటిలాగే పరమప్రశాంతంగా ఉంది. అమ్మ కడిగిన ముత్యంలా, కుందనపు బొమ్మలా, అనుగ్రహదేవతలా, ప్రేమైకరసరూపిణిలా దర్శనం ఇస్తోంది. ఆ నిశ్శబ్ద శాంతి సాగరంలో కల్లోలిత తరంగంలా అతడు అమ్మను ప్రశ్నించాడు. ‘అమ్మా! మేము క్రీస్తును దేవుడు అని కొలుస్తాం. కానీ ఆయన దేవుని కుమారుడనని చెప్పారు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?’ అని. దరహాస భాసురవదన అమ్మ మూడు వాక్యాల్లో అసలు సంగతిని విడమర్చి చెప్పింది.
– ప్రప్రథమంగా, “నాపైన ఎవరో ఉన్నారని నేను అనుకోవటం లేదు” అన్నది. ‘మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి, ధనుంజయ’ అనే గీతా తాత్పర్యానికి ఆ వాక్యం దర్పణం పడుతోంది. అమ్మ సర్వోత్కృష్టమైన సర్వోన్నతమైన శక్తి. జగన్మాత అమ్మకంటె ఉన్నతమైనదెలా ఉంటుంది?
– క్షణం ఆగి, “నా కంటె క్రింద ఎవరో ఉన్నారని నేను అనుకోవటం లేదు” అన్నది క్రింద అంటే దిగువన, తక్కువగా అని. ఆంగ్లభాషలో look down upon అనే phrasal verb ఉన్నది. అంటే హీనంగా, నీచంగా చూడటం అని అర్థం.
మరొక క్షణం ఆగి, “మీరు నా కంటె భిన్నంగా ఉన్నారని అనుకోవటం లేదు” అన్నది; విశ్వజనని అమ్మ సృష్టికీ తనకీ గల అవిభక్తమైన అవిభాజ్యమైన అద్వైతతత్త్వాన్ని సహస్రకోణాల చాటింది.
త్రివిక్రమావతారంలో వామనమూర్తిగా వచ్చిన విష్ణుమూర్తి ఒక పాదంతో నభోంతరాళాన్ని విస్తరించి ఆక్రమించి నపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని గంగాజలంతో శ్రీ మహావిష్ణువు పాదాన్ని కడిగి ఆ సాలగ్రామ తీర్థాన్ని గ్రోలి ‘ధన్యోస్మి’ అని పరవశించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సో॥ విఠాల శ్రీరామచంద్రమూర్తిగారు ‘అమ్మా! బ్రహ్మకడిగిన పాదం ఇదే కదా?’ అంటూ అమ్మ శ్రీచరణాలకు శిరస్సు వంచి నమస్కరించారు. వెంటనే అమ్మ, “అవును నాన్నా! మీరు రోజూ కడుగుతూనే ఉన్నారు కదా! మీరు బ్రహ్మలే కదా!” అన్నది. “అవును” అనటంలో ‘విష్ణునా విధృతే భూమీ అన్నట్లు తాను సాక్షాత్ శ్రీమన్నారాయణుడననే సత్యాన్ని అంగీకరించింది. ఇది చాలా సున్నితమైన సూక్ష్మమైన మహత్తర భావనా విశేషం. అమ్మ వద్ద అరమరికలు లేవు. దాపరికం లేదు. “మీరు రోజూ కడుగుతున్నారు కదా! మీరు బ్రహ్మలే కదా!” అనే సత్యాన్నీ “నా దృష్టిలో మీరంతా కోదండ పాణులే” అని మరొక సందర్భంలో స్పష్టం చేసింది. సకల సృష్టి దైవం యొక్క రూపాంతరమే. కావున జీవకోటి అజ్ఞానాంధకారంలో పడి అలమటిస్తోందని వారికి తన జ్ఞానబోధ అవసరం అనీ అమ్మకి అనిపించదు.
గంగరాజు పున్నయ్యగారు, గుండేలురావుగారు, లక్ష్మణాచార్యులు, రాజమ్మగారు వంటి కొందరు పుణ్యమూర్తులు అమ్మలో వారి వారి ఇష్టదైవాలను దర్శించారు. కాని అందరూ అమ్మలోని అతిలోక విశ్వజనీన మాతృత్వ మహిమకి దాసోహం అన్నారు. మాధుర్యానికి ‘ధన్యోస్మి’ అని పరవశించారు. ఒకసారి అమ్మ వల్లూరి పార్థసారధిగార్కి, వల్లూరి రామమూర్తిగార్కి కాఫీ తెప్పించి ఇచ్చింది. అంతటవారు దానిని మమకార రూప అమ్మ ప్రసాదంగా ఎంచి ‘ఇది మా అదృష్టం, మా భాగ్యం’ అని సంబరపడితే అమ్మ, “కాదు, నాన్నా! ఆ అదృష్టం, భాగ్యం మీవి కావు, నావి” అన్నది తృప్తిగా ఆనందంగా. “మీరే నాఆరాధ్యమూర్తులు” అని ప్రకటించిన అమ్మకు రోజూ స్వయంగా కొందరికైనా అన్నం గోరుముద్దలు చేసి ప్రేమానురాగాల్ని ఆదరణ ఆప్యాయతల్ని రంగరించి బిడ్డలకు పెట్టుకుంటేనే గానీ తృప్తి ఉండదు.
ముముక్షుజన పీఠాధిపతులు, శ్రీ లక్ష్మణ యతీంద్రులవారు, కొందరు యతులు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మకి అది ఒక పర్వడి; పర్వదినం. అమ్మ హృదయంలో ఎవరి స్థానం వారిదే. వారి రాక తెలిసి ముందుగానే వారు ఏరంగు బట్టలు వేసుకుంటారో, పదార్థాలు తింటారో వివరంగా కనుక్కొని తెప్పించమని కోరింది. వారందరికీ కొత్త గుడ్డలు పెట్టి అమ్మ స్వయంగా వడ్డించింది. ఆ మాతృవాత్సల్య రసరూప కృపావృష్టిలో వారంతా పుష్కరస్నానం చేశారు. వరలక్ష్మీవ్రతంనాడు వారు అమ్మ శ్రీచరణ సన్నిధిలో ఆసీనులై, ‘అమ్మయే లలిత లలితయే అమ్మ. అమ్మ యొక్క మరో రూపమే హైమ. ఒక 1000 క్యాండిల్ విద్యుత్ బల్బు క్రింద వది మంది కూర్చుని చదువుకుంటున్నారనుకోండి. మరి పది మంది అక్కడికి చేరితే, కాంతిని వాడుకుంటే అది తరిగిపోతుందా? దాని ప్రభావం తగ్గి పోతుందా? పోదు. అమ్మ శక్తి మహోజ్వలమైనది. అమ్మ హృదయం, వడి అంత విశాలమైనవి. ఎందరైనా రావచ్చు. విశ్రమించవచ్చు -‘ అంటూ అమ్మ అపార మమకార మహత్మ్యాన్ని వేనోళ్ళ చాటారు.
శ్రీశైలం, పూర్ణానంద స్వామీజీ కూడా అంతే. వారి ఆశ్రమమే మరొక జిల్లెళ్ళమూడి. ‘AMMA is the Tower of Power’ – అని అమ్మను శక్తి కేంద్రంగా అభివర్ణించారు. శ్రీశైలం, హటకేశ్వరం గుహల్లో ఏళ్ళతరబడి నిరాహారులై తపస్సు చేసిన పరమయోగివారు. The Motherless Siva finally found his mother ఆద్యంతరహితుడైన శివుడు తన తల్లిని కనుగొన్నాడు’ అని అమ్మ దివ్యమాతృప్రేమకు పరవశించారు.
ఒకసారి ఏలూరు సోదరులు శ్రీ టి.టి. అప్పారావుగార్కి అమ్మ స్వయంగా అన్నం తినిపిస్తోంది. ‘అమ్మా! నువ్వు పెడుతూంటే ఎంతో హాయిగా ఉందమ్మా” – అని వారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంటనే అమ్మ, “తినే వారికే ఇంత హాయిగా ఉంటే, పెట్టే వారికి ఎంత హాయిగా ఉంటుందో!” అన్నది; పెట్టుకోవటం అనేది మాతృత్వధర్మం అని గుర్తింప చేసింది; (త్యాగేనైకే అమృతత్వమానశుః) త్యాగమే అమృతత్వాన్ని సిద్ధింప చేస్తుంది అనే వేదవాక్యాన్ని తలపింప చేసింది.
కొందరు అమ్మలోని దైవత్వాన్ని వీక్షించగలిగితే అందరూ అమ్మలోని దివ్యమాతృప్రేమకు కరిగి పోయారు. కనుకనే శ్రీ రాజుబావగారుః
‘అందరికి అమ్మలా కనిపించి
కొందరికి బ్రహ్మలా అనిపించి,
అమ్మయే సత్యమని, బ్రహ్మయే మిథ్యయని
నమ్ము జ్ఞానుల కెల్ల దీర్ఘాయురస్తని… దీవించుమమ్మా!!
శ్రీరస్తనీ, శుభమస్తనీ…’ అని అమ్మను అభ్యర్థించారు.
మాన్యసోదరులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు ‘నేను “అమ్మ”ను’ అనే వ్యాసంలో – అమ్మ ఒక అలౌకికశక్తి సంపన్న, ప్రవక్త, అవతారమూర్తి, రాజరాజేశ్వరి.. అనే భావాలు వ్యక్తి గతమైనవి. కానీ ఆమె ‘అందరి అమ్మ’ అనీ, ‘మూర్తిభవించిన ప్రేమ’ అనీ అంటే ముక్తకంఠంతో అంతా అవును అంటారు. దైవం అగ్రాహ్యమైనది. అలాగే అమ్మ కూడా అని అన్నారు.
అవ్యాజకరుణా రసామృతమూర్తి అమ్మని దర్శించిన వారు పదే పదే ఆ చరణ రాజీవాలను అర్చించుకోవాలని, ఆశ్రయించాలని అనేక జన్మల పుణ్యఫలంగా లభించిన ఆ భాగ్యాన్ని పదిమందికి పంచాలని ఆరాటపడు తుంటారు. కనుకనే
‘ఎప్పుడైనను నీవు స్పర్శించినావె
అర్కపురి లోని అమ్మ పాదాంబుజములు
నేడు గాంతువు నీ జన్మ నెగడు ఫలము
నడచి రావోయి నిండు మనస్సుతోడ’
– అని ఆర్ద్రతతో సహృదయసోదరీ సోదరులను సాదరంగా ఆహ్వానిస్తారు డా॥ ప్రసాదరాయ కులపతి (ప్రస్తుత శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు). అపరిమితమైన శక్తి పరిమితమైన ఆకారంతో అమ్మగా అవతరించిన తరుణాన సాధకుల పంట పండినట్లే; సాధన పరాకాష్ఠ స్థితిని పొందినట్లే; ఆ పావనమూర్తి దర్శన, స్పర్శన, సంసేవనం ద్వారా వాంఛితార్థం కరతలామలకమే.
న్యాయస్థానాల్లో విచారణ సమయంలోనూ, రాజ్యాంగాన్ని అనుసరించి పదవీబాధ్యతల్ని స్వీకరించే తరుణంలోనూ వ్యక్తులచేత ప్రమాణ స్వీకరణ (Oath-taking) చేయించు సమయంలో భగవంతుని సాక్షిగా లేక ఆత్మసాక్షిగా అని చెప్పిస్తారు. ఒకనాడు నిర్గుణుడైన బ్రహ్మ నేడు సృష్టిగా ఆవిర్భవించి సగుణమూర్తి అయినాడు; రెండూ అయి ఉన్నాడు. కనుకనే అమ్మ, “నన్ను నమ్ముకో, నిన్ను నమ్ముకో. ఏదైనా ఒకటే. విశ్వాసమే భగవంతుడు” అని వివరించింది.
‘జన్మ కర్మచ మే దివ్యం’ అన్నారు కృష్ణపరమాత్మ. అమ్మలో సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తి మత్వ దైవలక్షణాలు అత్యంత సహజంగాను దినచర్యలో భాగంగా, అయత్నకృతంగా, చిరకాల మధురస్మృతులుగా నిలబడే సంఘటనలు కోకొల్లలు. అనుగ్రహైక స్వరూపిణి అవతారమూర్తి అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణల్లో సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య అనుభవాలతో అచంచల భక్తి విశ్వాసాలతో నవవిధ భక్తిమార్గాల అమ్మను ఆరాధ్యమూర్తిగా కొలిచే పని ఏమి? అవాజ్మానసగోచరమైన నిర్గుణ పరబ్రహ్మతత్వం గురించి ఆలోచన, ఆవేదన ఏల?
సకలసృష్టిని కని, పెంచే, కనిపించే అమ్మే బ్రహ్మ.
అమ్మే సత్యం. కనిపించని బ్రహ్మే మిధ్య.