దుర్గపిన్ని మా తల్లి. ఈ రోజు మా అమ్మగురించి నాలుగుమాటలు చెప్పాలన్నా వ్రాయాలన్నా ఏం చెప్పాలి ఏం వ్రాయాలి అని ఆలోచనలు – కానీ ఎప్పుడైతే జిల్లెళ్ళమూడి అమ్మ మా అమ్మని ‘దుర్గపిన్ని’గా ప్రపంచానికి పరిచయంచేసిందో, అప్పటినుంచి మా అమ్మ లోకానికి పిన్ని అయింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచి 1970 లో మేము విజయవాడలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఎవరో ఒకరు జిల్ళెళ్ళమూడి అన్నయ్యో, అక్కయ్యో వచ్చేవారు. మా ఇంట ఆతిధ్యం స్వీకరించేవారు. మాకున్నదే నలుగురికీ పెట్టేవాళ్ళం. అది ఉంది, ఇదిలేదు అన్న ఆలోచన లేకుండా మా అమ్మ వచ్చినవారికి ఆదరంగా అన్నంపెట్టేది. ”నీకున్నది తృప్తిగా తిని నలుగురికి ఆదరంగా పెట్టుకో” అనే అమ్మమాటను తు.చ. తప్పకుండా పాటించేది.
నాకు బాగా జ్ఞాపకం – ఒకసారి మా అమ్మ జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు అందరమ్మతో తనకు ఆస్తులు లేవని … ఏవో తన కష్టాలు చెప్పుకుంటే, ”నీ పిల్లలే నీ ఆస్తి” అని భరోసానిచ్చింది అమ్మ. అదే రీతిగా కడదాకా మా అమ్మ మాతో సంతోషంగా ఉన్నదని భావిస్తాను. ఆ విధంగా జిల్లెళ్ళమూడి అమ్మ మమ్మల్నందరినీ దీవించింది.
1980 – 81 ప్రాంతంలో నేను C.A మరియు I.C.W.A Pass అయిన సందర్భంలో ఆజీబిబీశిరిబీలి కి వెళ్ళాలా? ఉద్యోగంలో చేరాలా? అన్న సందేహాన్ని వెలిబుచ్చాను. అపుడు అమ్మ ”నాన్నా! నీకు ఏది బాగుంటే అదిచెయ్యి” అనిచెప్పింది. సాధారణంగా అందరికీ ఇచ్చే సందేశమే అది. ఇదమిత్ధంగా ఏమి చెప్పలేదు. Tata Steel Company లో ఉద్యోగానికి వెళ్ళాను.
చిత్రం! మా అమ్మ జిల్లెళ్ళమూడి వెళ్ళి ఎప్పుడు అందరమ్మను కలిసినా ”ఎందుకే వాడు జీతం తీసుకుని ఒకడి దగ్గర పనిచేస్తాడు? వాడు పదిమందికి అన్నంపెడతాడుకదా!” అని అంటూండేది. ఆ మాటవిని మా అమ్మకి tension వచ్చేది – ”వీడు అమ్మమాట వినకుండా దూరంగా ఉద్యోగానికి పోయాడు” అని. నాలుగు చివాట్లు పెడుతూ నాకు పెద్దపెద్ద ఉత్తరాలు వ్రాసేది. ఆ రోజుల్లో విజయవాడలో Practice పెట్టడానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో C.A. లకు Income tax work తప్ప ఏమి ఉండేదికాదు.ICWA వాళ్ళకి Statutory Recognition లేదు. అందుకని విజయవాడలో Practice పెట్టడం నాకు ఇష్టంలేదు. కానీ ‘అమ్మ’కి అన్నీ తెలుసు. ఏవో మాటల సందర్భంగా నాతో ”నాన్నా!Practice ఎందుకు పెట్టకూడదు?” అని నన్ను అడుగుతూండేది.
‘అమ్మ’ద్వారా మార్గదర్శనం పొంది నేను వెళ్ళి ఉద్యోగానికి Resign చేసివచ్చాను. ‘అమ్మ’ది తోలునోరు కాదు, తాలుమాట రాదు. ఏవీ ప్రత్యక్షంగా చెప్పేదికాదు, పరోక్షంగా చెప్పేది. ‘అమ్మ’ మాటలు అర్థంచేసుకోవటం, ఆచరణలో పెట్టడం సాధారణంగా సాధ్యంకాదు. మా విశ్వాసం ఆధారంగా నేను అమ్మ మాటలు ఆచరణలో పెట్టాను. అది నా జీవనయానంలో ఒక గొప్ప మలుపు. ఒక విధంగా సమాజానికి మరొక విధంగా నా Profession కి ప్రయోజనకారి అయింది.
1990 లో మేము హైదరాబాద్ రావటం. తర్వాత కాలంలో క్రమేణ నా అభివృద్ధి, Profession లో గుర్తింపు అన్నీ అందరికీ తెలిసిందే. మేము హైదరాబాద్ వచ్చాక – ఎక్కడ ఏ అన్నయ్యకి కష్టంవచ్చినా మా అమ్మ తరచుగా (నా కారు తీసుకుని) వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. ఆదరించి బట్టలు పెడుతుండేది. క్రమం తప్పకుండా అందరికీ ఫోన్లుచేసి యోగక్షేమాలు విచారిస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ‘అమ్మ’ కుంకం – బట్టలు తీసికెళ్ళి అందించేది. అలా అందరినీ ప్రేమగా పలకరిస్తూ అందరినీ కలుపుకుంటూ అందరికీ బాగా దగ్గరైంది.
ధాన్యాభిషేకం కోసం మా అమ్మ ఎంతగట్టిగా కృషిచేసేదో! అది తనadministrative ability కి ఒక ఉదాహరణ. అందరినీ ప్రోత్సహించి విరాళాలు సేకరించేది. మా నాన్నగారు ఆ విరాళాల్ని SVJP సంస్థకి పంపి అక్కడినుంచి వచ్చిన రశీదులు – ప్రసాదాన్ని, వారందరికీ Post ద్వారా పంపేవారు. ఇదంతా ఒక పద్దతిగా మా అమ్మ నాన్నగారలు కలసి చేస్తుండేవారు. అదొక మరపురాని ఘట్టం ఏటా. ఇదంతా ఒక ఎత్తు అయితే 1961 మార్చి మొదలు తన చివరిక్షణంవరకు మా అమ్మ అందరి ‘అమ్మ’మిద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో నిలబడింది. ఇటీవలకాలంలో – మా నాన్నగారు ముందుగా నిష్క్రమించిన కారణం వలన, తన అనారోగ్యరీత్యా శారీరక బాధలు భరించలేక తనను త్వరగా తీసుకువెళ్ళమని అమ్మతో తరచుగా పోట్లాడేది.
అటువంటి మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ లోటు భర్తీ చేయలేనిది. అనుదినం అనుక్షణం అమ్మ ధ్యాసలో ఉంటూ చివరకు అమ్మలోనే ఐక్యమైంది.
రవి అన్నయ్య, సుబ్బారావు అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, PSR అన్నయ్య, రాజుబావ … అందరూ మా ఇంటికి వచ్చేవారు, వారి దుర్గపిన్ని ఉంది కాబట్టి. రాజుబావ తను వ్రాసిన పాటల నేపధ్యాన్ని వివరిస్తూ C.D లు చేశారని విని, ”రాజూ! నీ మాటలు నేను వినాలి, పంపించవా!’ అని అడిగింది. వెంటనే ఆయన తన C.D లకు కాపీలు తీయించి మాకు పంపారు. ఎ.వి.ఆర్.అన్నయ్య తరచు మా ఇంటికి వస్తుంటారు. ఒకసారి వారిని మా అమ్మ అడిగింది, ”ఎప్పుడూ ఒక్కడివే వస్తావు. మా కోడలిని తీసుకు రావే?” అని. ఎక్కడిదీ మమకారం? అది అందరమ్మ ఇచ్చిన పెద్దరికం – ఒక ఆత్మీయతా ప్రపూర్ణరాగబంధం. ఇలా చెప్పుకుపోతే జిల్లెళ్ళమూడి అన్నయ్యలు, అక్కయ్యలకు దుర్గపిన్నితో ఒక ప్రత్యేక అనుబంధం వున్నదని స్పష్టమౌతుంది. కనుకనే మా అమ్మ అందరింటి అన్నయ్యలు అక్కయ్యల గుండెల్లో ‘దుర్గపిన్ని’లా గూడు కట్టుకుని ఉన్నది. తల్లిని మరిపించే తల్లి పినతల్లి అని అంటారు. కాని మా అమ్మ తల్లిని మరిపించే తల్లికాదు, మురిపించేటంత మననం చేయించే తల్లి. తనకు అమ్మ బిడ్డలే ఆత్మబంధువులన్నట్లు ఒక్కొక్కసారి కన్నబిడ్డలైన మమ్మల్ని ప్రక్కనబెట్టి వారిని ఆదరించిన సందర్భాలూ ఉన్నాయి. అశేష సోదరీ సోదరుల గుండెల్లో వారి పలకరింపుల్లో మా అమ్మ కనిపిస్తోంది నాకు.
మేము ఏటా ‘అమ్మ’ అనంతోత్సవాలు (ఆరాధ నోత్సవాలు) మా ఇంట్లో నిర్వహిస్తున్నాము. అది మా భాగ్యం, ‘అమ్మ’ కృపావిశేషం. ఆ సందర్భంగా అందరినీ పేరుపేరున పలకరించి ఆహ్వానం పలికేది మా అమ్మ. వచ్చిన వారంతా ‘అమ్మ’ యెడల భక్తిప్రపత్తులతో, ఆప్యాయత పొంగులువారే వారి దుర్గపిన్ని పిలుపువిని వచ్చారు. వచ్చి ‘అమ్మ’ పూజాదికములలో పాల్గొని నేరుగా వారి దుర్గపిన్ని దగ్గరకు వెళ్ళి కష్టసుఖాలు మాట్లాడుకుని సెలవు తీసుకునేవారు.
అందరికీ నా అభ్యర్ధన ఇదే – దుర్గపిన్ని లేదు, కానీ ఆమె స్మృతిచిహ్నాలుగా మేము ఉన్నాం. అదే ఆత్మీయత, అభిమానంతో ఎప్పటిలాగే మీ దుర్గపిన్ని ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదరించండి – అదే మాకు ఆనందము.
జగన్మాత అమ్మ మరియు జన్మదాత మా అమ్మ శ్రీచరణాలకు కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.