జన్మనెత్తినప్పటి నుండీ తల్లిదండ్రులతో నిరంతరం ఉండే భాగ్యం అందరికీ లభించేది కాదు ఈ అవకాశం నాకు దొరకటం నా పూర్వజన్మ సుకృతం. ఉద్యోగం కూడా ఒక్క సంవత్సరం తప్ప ఇప్పటివరకు గుంటూరు మరియు గుంటూరు పరిసర ప్రాంతాలలోనే చేయటంవల్ల వీరితో ఎల్లవేళ్ళలా ఉండే భాగ్యం అబ్బింది. నాన్నగారు, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు, కవిగా, అమ్మభక్తులుగా, బహు గ్రంథ కర్తగా అందరికీ తెలిసిన విషయమే. వారితో నాకున్న అనుభవాలు పంచుకోవటానికి ప్రయత్నిస్తాను.
మేము ముగ్గురం సోదరులం. మా అమ్మ నాన్నలతో పాటుగా మా అమ్మమ్మ కూడా మాతోనే ఉండేది. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచినప్పటికీ, ఏనాడూ మమ్మల్ని నాన్నగారు పల్లెత్తు మాట అనేవారు కాదు. మొత్తం మీద ఒకటి -రెండు సార్లు మాత్రమే అగ్రహించినట్లు గుర్తు. అది కూడా అబద్దం ఆడటం వల్ల మాత్రమే. వారు సత్యం పలకటానికి అంత విలువ ఇచ్చేవారు.
“నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్న అమ్మ మాటని అక్షరాల అమలు పరిచారు నాన్నగారు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఎంతో మంది జిల్లెళ్ళమూడి అమ్మభక్తులు జిల్లెళ్ళమూడి నుంచి వచ్చి మా యింట్లో భోజనం చేస్తూ ఉండేవారు. వారిలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీ పాండురంగారావు గారు, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు గారు, శ్రీ పూర్ణచంద్రరావు గారు, మల్లాప్రగడ మొదలగువారు. శ్రీ రవీంద్రరావుగారి కుటుంబంతో మాకు కూడా ఎక్కువ అనుబంధం ఏర్పడింది. వారి పిల్లలు చైతన్య, శరత్, పింకి మా కుటుంబంలో సభ్యుల్లా ఉండేవారు. మా నాన్నగారికి వీరంటే చాలా ఇష్టం. మా నాన్నగారిని ప్రేమగా తాతయ్య అని పిలిచేవారు. ముందుగా చెప్పకుండా అప్పటి కప్పుడు పగలు-రాత్రి లేకుండా మా యింటికి నాన్నగారు చాలామందిని ఆతిథ్యానికి ఆహ్వానించేవారు. మా అమ్మ, అమ్మమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేవారు. మా అమ్మ సహకారం ఈ విషయంలో ఎంతో అపూర్వమైనది. జిల్లెళ్ళమూడి అమ్మ కుమారులు రవిగారు మేము ప్రేమగా రవి మామయ్య అని పిలుచుకుంటాము) ఒకసారి అన్నారు. “మీ యింట్లో నాలుగు తరాల వారు వండి పెడితే తిన్నానయ్యా” అని. మా బామ్మ (మా నాన్నగారి అమ్మ), మా అమ్మ, నా భార్య, నా కూతురు ఇట్లా అందరూ వండిన వంటలని రవిమామయ్య రుచి చూశారు.
మా నాన్న సాహిత్య సాంస్కృతిక రంగాలలో సుప్రసిద్ధులు. వీరి 5 గురి సోదరులలో అగ్రజులైన శ్రీ ప్రసాదరాయకులపతి (ప్రస్తుతం కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి) స్థాపించిన శ్రీనాథ పీఠ ఆధ్వర్యంలో అన్నగారితో కలిసి అసేతు హిమాచల పర్యంతం, ఖండఖండాంతరాలలో కూడా భువన విజయాది సాహితీ జైత్రయాత్ర చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆ సభలు గుంటూరులో నిర్వహించినపుడు కవులు, పండితులు రావటం దగ్గర నుంచి వెళ్ళేవరకు నాన్నగారే చూసేవారు. వారికి భోజన వసతులు మా యింట్లోనే. మా యింట్లో మా నాన్నగారితో పాటు అమ్మ కూడా ఈ అతిధి, అభ్యాగత ఆదరణవ్రతంలో భాగస్వామిని.
నేను గుంటూరులో ఉండటం వల్ల నాన్నగారి సాహిత్య కార్యక్రమాలు అన్నీ చూసే భాగ్యం కలిగేది. మా పెదనాన్నగారైన కులపతిగారితో కలిసి మా నాన్నగారు భువన విజయాలు, ఎన్నో రూపకాలు ఆశు కవితా ప్రదర్శనలు చేయటం, అవి కళ్ళారా చూడటం మా అదృష్టం. మా నాన్నగారికి తెనాలిరామకృష్ణునిగా, విప్లవకవిగా బాగా పేరు వచ్చింది. ఒకసారి కులపతి గారు కొప్పరపు సోదరకవులవైపు, మా నాన్నగారు తిరుపతి వేంకటకవులవైపు ఉండి పోటీగా పద్యాలు చదువుతుంటే విజ్ఞానమందిరం కిక్కిరిసిన జనాలతో కరతాళధ్వనులు చేస్తున్న దృశ్యం ఇప్పటికీ మరచిపోలేని మధురమైన సంఘటన.
నాన్నగారు మాజేటి గురవయ్య హైస్కూలులో (Non-Teaching staff) Superintendent పనిచేసేవారు. కానీ వారు తెలుగు భాష మీద ఉన్న పట్టువలన అప్పుడప్పుడు తెలుగు క్లాసులు తీసుకొనే వారు. మేము 8వ, 9వ, 10వ తరగతిలో ఉన్నప్పుడు క్లాసులు తీసుకొని ఛందస్సు చెప్పటం నాకు, నా సహాధ్యాయులకు అందమైన జ్ఞాపకం. స్కూలులో నాన్నగారిని అందరూ గౌరవించేవారు. ఏనాడూ ఒక్కరూపాయి కూడా అక్రమంగా ఆయన ఆర్జించలేదు. ఏమైనా Exams conduct చేస్తే వచ్చే డబ్బులన్నీ peons కి ఇచ్చేవారు. వారందరూ కూడా నాన్నగారిని చాల గౌరవంగా చూసేవారు. స్కూల్లో Temporary Staff ని ఎంతోమందిని permanent చేయటానికి మా నాన్నగారి కృషి ఎంతో ఉంది. స్కూల్లో ఒక Sanskrit Pandit ని Committee సభ్యులు ఇబ్బంది పెడుతుంటే, వారితో ధైర్యంగా మాట్లాడి ఆ పండితుడిని కాపాడటం ఇప్పటికీ ఆయన చెప్పుకుంటున్నారు. ఇది వారి ధైర్యానికి ధర్మనిష్ఠకి నిదర్శనం. నాన్నగారికి సహాయం చేసే గుణం ఎక్కువ. చిన్న ఉదాహరణ: జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులు ఒకరు తన మనవడికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ ఖర్చులకి అప్పటికప్పుడు 4 లక్షలు సహాయం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నేను 9వ తరగతి చదువుచున్నప్పుడు త్యాగరాజు ఆరాధనోత్సవాలు స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అప్పుడు త్యాగరాజుల వారి మీద నాన్నగారు ఒక బుర్రకథ రచించారు. దానికి మా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించారు. అప్పుడు జరిగిన పోటీలలో మాకు ప్రధమ బహుమతి లభించింది. మా నాన్నగారి ఆధ్వర్యంలో జిల్లెళ్ళమూడి అమ్మ సమక్షంలో బుర్రకధను ప్రదర్శించటం ఒక అపూర్వ అవకాశం. అమ్మ మమ్మల్ని ఆశీర్వదించింది. రోజుల్లోనే జిల్లెళ్ళమూడి అమ్మ సినిమాని స్కూల్లో ప్రదర్శింప జేసి పిల్లలు అందరికీ చూపించారు. అమ్మభక్తి ప్రచారం చేయటంలో నాన్నగారు ముందుండేవారు. చాలాకాలం ప్రతినెలా అమ్మ పూజని అమ్మ భక్తుల ఇండ్లలో జరిపేవారు. అమ్మ వ్రతాలు చేయించేవారు.
నాన్నగారు ఎన్నో గ్రంథాలను రచించారు. వాటిలో ఎక్కువ గ్రంథాలు జిల్లెళ్ళమూడి అమ్మ గురించినవే. వాటిలో కొన్ని: విశ్వజననీ వీక్షణం, తులసీ దళాలు, మాతృకవితా బృందావనం, అనుభవాలమూట అమ్మమాట, ఆదర్శమూర్తి ఆచరణ స్ఫూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ … ఇట్లా 40 గ్రంథాలపైనే రచించారు. వాటిని తన ఆత్మీయులందరికీ అంకితం యిచ్చారు. వారిలో కొంతమంది ప్రముఖులు…. స్వామి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామీజీ, శ్రీ తంగిరాల కేశవశర్మ, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, శ్రీ నరసింహానంద భారతీ స్వామి, శ్రీ తంగిరాల రామచంద్రసాయి ఇ ఎంతోమంది ప్రముఖులు.
వారు స్వీయ గ్రంథరచనలతోపాటుగా, పద్యకవిత్వం రాసిన ఎంతోమంది నవీన కవులు వ్రాసిన పద్యాలని పుస్తకాలుగా తన ఖర్చులతో అచ్చువేయించి ప్రోత్సహించటం వారి సహృదయతకు నిదర్శనం.
నాన్నగారు గత 20 సం॥లుగా విశ్వజనని పత్రికకు సంపాదకులుగా సేవచేస్తున్నారు. అంతేకాక కుర్తాళపీఠం నిర్వహించే మాసపత్రిక మౌనప్రభకి కూడా సిద్ధాంతం. సంపాదకులుగా 20 సం॥లనుండి గత సంవత్సరం వరకు ఉండి ఎంతో ధర్మబద్ధంగా నిర్వహించారు.
నాన్నగారు గుంటూరులో శ్రీరాధాకృష్ణ మందిరంలో జరిగే పండగలలో అన్ని కార్యక్రమాలలో పాల్గొనేవారు. సాక్షాత్తు శ్రీరాధాసఖి పూజ్యులు బృందావన రసయోగి శ్రీరాధికాప్రసాద్ మహరాజ్ గారిచే మెప్పుపొందిన కవి పి.యస్.ఆర్.
మా అన్నయ్య రవికిషోర్ గత 25 సం॥లుగా దుబాయ్లో పనిచేస్తూ నాన్నగారి కోర్కెమేరకు గత సంవత్సరము రిజైన్ చేసి వచ్చేశాడు. గత సంవత్సరంగా మా నాన్నగారు తనని తోడుగా తీసుకొని వెళ్ళి And ఎంతోకాలంనుంచీ కలవాలనుకున్న ఆత్మీయ మిత్రులు, చిరకాల మిత్రులందరినీ కలిశారు. మా అన్నయ్య సహాయంతో ఎన్నో సభలకు వెళ్ళటం, ఎంతోమందికి సన్మానం చెయ్యటం జరిగింది. మా అన్నయ్య చివరి క్షణంవరకు నాన్నగారికి సేవచేసి ఆయనకు ఆనందం కలిగించాడు.
ఇటీవలే సహస్రపూర్ణచంద్రదర్శనము చేసుకున్న మా నాన్నగారు ఒక మనః సన్యాసి. 2011 లో మా
పెద్దన్నయ్య ప్రేమకుమార్ చిన్నవయసులో మరణించినప్పుడుగానీ, మా అమ్మ గిరిబాలగారు 2015 లో స్వర్గస్థులైనప్పుడు గానీ వారు చూపిన స్థితప్రజ్ఞత ఒకయోగి లక్షణాన్ని తలపింపజేస్తుంది. ఏది జరిగినా అంతా అమ్మే చేయిస్తున్నది అన్నది ఆయన జీవన సిద్ధాంతం.
బృందావనం రసయోగులు ప్రధానంగా పాటించే ప్రధానసూత్రాలలో “అనన్యనిష్ఠ”, “తత్సుఖేన సుఖీత్వం” అనేవి ప్రధానమైనవి. భగవంతునిపై అనన్యనిష్ఠ కల్గి ఉండటం, భగవంతునికి ప్రీతికరమైనదేదో అదే చేయటం. ఈ రెండూ కూడా నాన్నగారు ఆచరించి చూపించారు. నాన్నగారు మనసా వాచా కర్మణా జిల్లెళ్ళమూడి అమ్మని హృదయంలో నిలుపుకొని అనన్యనిష్ఠతో అమ్మనే కొలిచి, అమ్మ సేవయే పరమావధిగా భావించి, అమ్మకు ఇష్టమైన పనులు ఆచరిస్తూ.. ఇటు అన్నగారైన కులపతిగారికి (ప్రస్తుత సిద్ధేశ్వరానంద భారతిస్వామి) సేవచేస్తూనే అటు జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థకి సహకారం అందించారు. స్వామి మాటలలో చెప్పాలంటే, మా నాన్నగారికి అమ్మమీద ఉన్న అచంచల భక్తి విశ్వాసాలు, నిజమైన ఏకేశ్వరోపాసనకి నిదర్శనాలు. అంతిమశ్వాసవరకు అమ్మపైనే అలోచన దృష్టి నిలిపిన నాన్నగారు 13.02.2022న అమ్మలోనే ఐక్యమైనారు. ఇక అమ్మతోనే ఉంటారు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ మామీద వారి కరుణాకటాక్షవీక్షణాలు ప్రసరిస్తూనే ఉంటాయి.
***
మూర్తీభవించిన, మాతృప్రేమ, ఆలనలో పరవశం, సృష్టి జడచేతన భేదం లేకుండా పసిపాపలై ఆ ఒడిలో సేదతీరటమే. దేవతలూ బిడ్డలే దానవులూ బిడ్డలే – పందిపిల్లా ముద్దే పాముపడగా ముద్దే. పేనూ ముద్దే పెనుతుఫానూ ముద్దే – సహజము అవ్యాజము అమ్మ ప్రేమ. జిల్లెళ్ళమూడిలో నాలుగు గోడల మధ్య కూర్చున్న నాల్గడుగుల విగ్రహమే అనుకునేరు. అంతా చెప్పిన నిర్వచనం “అదీ అంతమూ లేనిది, అంతకూ ఆధారమైనది.”
– శ్రీ పి.యస్.ఆర్