అమ్మ అంటే సంపూర్ణత్వం ఇది ఒక ప్రత్యేకత. అమ్మ అకారణ కారుణ్యం, ఇంకొక ప్రత్యేకత. అమ్మ ఆశ్చర్యకర వాత్సల్యం ప్రత్యేకత… ఇలా ఎన్నో. మరొక
- ముందుగా అమ్మ మధుర మహిమాన్విత మాతృప్రేమ ప్రత్యేకతను విశ్లేషిస్తాను.
యశోదాదేవి శ్రీకృష్ణుని, కౌసల్యాదేవి శ్రీరాముని అపురూపంగా ప్రేమించారు, లాలించారు, మురిసిపోయారు. అవతారమూర్తుల్ని కన్న ఆ మాతృమూర్తుల మమకారం సైతం పరిమితమైనది.
నిఖిల మానవాళి భాగ్యదేవత వాత్సల్యామృత వర్షిణి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డలనే కాదు; ఉన్న వాళ్ళనీ లేని వాళ్ళనే భేదం లేక ముఖ్యంగా పీడితుల్ని, దుఃఖితుల్ని, దైవోపహతుల్ని, అసహాయుల్ని కన్న బిడ్డలుగా ఆదరించింది. అమ్మ సంతానం మనుష్యులేకాదు, మూగజీవులైన జంతువులు పక్షులు, క్రిమికీటకాదులు, భయంకర విషసర్పాలు.. చరాచర సమస్త సృష్టి.
ఇపుడు యశోదాదేవి పరిమిత మమకారాన్ని, అమ్మ సర్వత్రా మమకారాన్ని అధ్యయనం ప్రయత్నం చేద్దాం.
రేపల్లెలో ఒకనాడు, సాయం సమయం దాటి రాత్రి పొద్దు పోయింది. కృష్ణుడు ఇంటికి చేరుకోలేదు; అన్నపానాదులు లేవు. దిక్కుతోచక దుః ఖితమతియై రోదిస్తున్న యశోదాదేవి స్థితిని అన్నమాచార్యులు :
పిలువరె కృష్ణుని పేరుకొని ఇంతటను
పొలసి ఆరగించ పొద్దాయె నిపుడు
వెన్నలారగించబోయి వీధులలో తిరిగేనా !
ఎన్నరాని యమునలో ఈదులాడేనా !!
సన్నల సాందీపనితో చదువగ పోయినాడొ !!!
చిన్న వాడా కలిగొనె, చెలులార! ఇపుడు ॥ పిలువరె ….
అని వ్యక్తీకరించారు.
ఇప్పుడు రేపల్లె నుండి జిల్లెళ్ళమూడి వెడదాం.
జిల్లెళ్ళమూడిలో ఒక దీపావళి నాటి రాత్రి. అందరింటి దృశ్యం – సహస్ర, సహస్ర దివ్వెల ఉజ్జ్వల కాంతి ప్రభలతో అది రాత్రికాదు పగలే అనిపిస్తోంది. ‘దివ్యతే ఇతి దైవః’ – దైవం స్వయం ప్రకాశమానమూర్తి. కనుకనే నిత్య పూజాది సమయాల్లో ముందుగా దీపారాధన చేసి జ్యోతి స్వరూప పరమేశ్వరునికి నమస్కరిస్తాం. ప్రేమైక రసాధి దేవత అమ్మ వాత్సల్య దీధితులతో జిల్లెళ్ళమూడి దీవిని కళ్ళముందు నిలబెట్టింది. నాటి సాయం సమయంలో కొందరు చీరాల సోదరులు అమ్మ దర్శనార్థం వచ్చారు. అమ్మ వారికి దర్శనాన్ని, ప్రసాదాన్ని అనుగ్రహించి, “భోజనం చేసి వెళ్ళండి” అని మృదువుగా చెప్పింది. అంతే కాదు. ప్రక్కనే ఉన్న ఒక సోదరుని తోడు ఇచ్చి అన్నపూర్ణాలయానికి దారి చూపింది. అతను వారిని తీసుకు వెళ్ళి ఏర్పాట్లు చేసి వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు.
నాటి రాత్రి అలవాటు ప్రకారం అమ్మ మంచం ప్రక్కనే చాపవేసుకుని నిద్రిస్తున్నాడు. సాధారణంగా అమ్మ మంచానికి కనుచూపు మేరలో ఇటూ అటూ ఎందరో సోదరీ సోదరులు నేల మీద పడుకుంటారు. అది వారికి తృప్తి. అమ్మ మంచం సమీపంలో పడుకున్నా తల్లి ప్రక్కలో నిద్రించే ఎడపిల్లలు, పసిపిల్లలు అనుభవించే హాయిని పొందేవారు; మనస్సు మానస సరోవరంలోనో కైలాస పర్వతం పైనో విహరిస్తున్నట్లుండేది.
రాత్రి సమయం పన్నెండు దాటింది. అమ్మ గాఢ నిద్రలో ఒకటికి నాలుగుసార్లు పలవరిస్తోంది, “వాళ్ళు అన్నాలు తినకుండా వెళ్ళిపోయారు” అని. నిద్రలేచి, ‘ఎవరమ్మా?’ అని ప్రశ్నించాడు. అప్రయత్నంగా నిద్రలోనే అమ్మ, “చీరాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళి పోయారు” అని బదులిచ్చింది. నిజమైన కడుపు తీపి, దివ్య మాతృప్రేమ అంటే అదే.
అమ్మ పెట్టే అన్నం కేవలం ఆకలి మంటను తీర్చేదే కాదు; అది అమ్మ అనురాగ సమన్వితం, అనుగ్రహ ప్రతిరూపం, అనంత శక్తి ప్రసారానికి ఒక మాధ్యమం – అనేది సత్యం. అయినా 1000 మంది బిడ్డలు కడుపు నిండా తిన్నందు వలన కలిగే సంతోషం కంటే ఒక్కడు ఆకలితో అలమటిస్తే ఆ బాధ, వెలితి అమ్మను అమితంగా క్రుంగదీస్తుంది. గాఢ నిద్రలోని ప్రశాంతతని ఛిన్నాభిన్నం చేస్తూ కలవరపడిన ఆ తల్లి మనస్సు “వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళి పోయారు” అని పరితపిస్తోంది. ఆ సంక్షుభిత మానసిక ఆందోళన స్థాయి Conscious / Subconscious / Unconscious కు చెందినదో నాకు తెలియదు.
ఆ వచ్చిన వారు శ్రీమంతులు కావచ్చు; వారి కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్లు ఎక్కడో ఎవరో చేసి ఉండ వచ్చు. కానీ పండగపూట నట్టింటికి వచ్చిన బిడ్డలకి తన చేత్తో పట్టెడన్నం పెట్టుకోలేకపోవడం అమ్మకు వెత / వెలితి / లోటు. అన్నపూర్ణాలయంలో వంట ఎవరు చేసినా, అన్నం ఎవరు వడ్డించినా ఆ చేతలు, చేతులు అమ్మవే. కనుక నిర్లక్ష్యంగా అనాలోచితంగా వాళ్ళు చేసిన పని వాస్తవానికి వాళ్ళకే పెద్ద లోటు. కాగా అమ్మ చేత్తో పెట్టే పట్టెడు మెతుకులు / పచ్చడి మెతుకులు విలువని అమేయ ధనరాశులతో కానీ, వస్తు సంపదలతోకానీ పోల్చ శక్యం కాదు.
అమ్మ శారీరకంగా ఎక్కడో 3వ అంతస్థులో ఉంటుంది. క్రింద ఒక మారుమూల జరిగిన విషయం అమ్మకి ఎలా తెలిసింది? అమ్మకి ఈ గోడలు, రోజులు, సంవత్సరాలు, ఖగోళాలు… అడ్డుకావు, రావు. కానీ అమ్మ తన దైవీ సంపత్తిని దివ్య విభూతిని మాయలు చేయటానికి మహిమలు ప్రదర్శించటానికి ఉపయోగించదు. అమ్మ అందరికీ, అన్నిటికీ తల్లి. కేవలం ఒక మాతృమూర్తిలా బాధపడింది. అంతే. ‘మంచిని మించిన మహిమలు లేవు’ – అని ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
మార్జాలకిశోర న్యాయం, మర్కటకిశోర న్యాయం, భ్రమర కీటక న్యాయం అనీ గురు శిష్యుల మధ్య గురుతర సంబంధాన్ని, మమకార సంశోభిత మధుర మాతా శిశుసంరక్షణ పరంగా వర్ణిస్తారు. దేహానికి మాత్రమే అమ్మ అయిన మాతృమూర్తి బిడ్డల్ని కంటికి రెప్పలా ఊపిరి ఉన్నంతకాలం సంరక్షిస్తుంది. కాగా ‘తరింపచేసే తల్లి’ నని తన జగన్మాతృ ధర్మాన్ని బాధ్యతని తానే నిర్వచించింది అమ్మ. అమ్మలో ప్రత్యేకత ఏమంటే కంటికి రెప్ప వలెనే కాక, కడుపులో పెట్టుకుని గర్భస్థ శిశువుని వలె పాలిస్తుంది, సంరక్షిస్తుంది, తన ఊపిరినే ఊది ప్రాణం పోస్తుంది. అదే ఆదిమూల విశ్వరూప ధర్మం, అవ్యక్త మర్మం. ఇదే అమ్మ ఔన్నత్యం, వైశిష్ట్యం, కనుకనే, “మీరంతా నా సంకల్పంతోనే పుట్టి, నాలోనే పెరిగి, నాలోనే లయమౌతారు” అని స్పష్టపరిచింది. అమ్మని ఒక అవతారమూర్తితో కానీ సిద్ధ పురుషునితో కానీ పోల్చలేం.
- అమ్మ అంటే సంపూర్ణత్వం
సాధారణంగా మఠాధిపతులూ, గురువులూ, పీఠాధిపతులూ ఆశ్రితులకు జ్ఞానబోధ చేస్తూంటారు. కానీ అమ్మ ఏ సందేశమూ ఇవ్వదు, ఏ ఉపన్యాసమూ చేయదు. తనకై తాను ఎప్పుడూ ఎవరితోనూ సంభాషించదు. అమ్మ వాక్యం వెలువడిందంటే, అతఃపూర్వం ఎవరో ప్రశ్నించి ఉంటారు, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్థం ప్రార్థించి ఉంటారు. “ఏదీ చెప్పను, నాన్నా! ఏదీ చెప్పకపోవటమే నా సందేశం” అనీ, “మీరు అజ్ఞానంతో ఉన్నారు, మీకు నా జ్ఞాన బోధ అవసరం అని నేను అనుకోవటం లేదు” అనీ; “నేను గురువును కాను, మీరు శిష్యులు కారు” అనీ స్పష్టం చేసింది.
ఇక్కడ రహస్యం ఏమంటే. అమ్మ జ్ఞానస్వరూపిణి. కావున మౌనం ద్వారానే జ్ఞానప్రసారం చేస్తుంది. కావున అమ్మ సాన్నిధ్యమే మహోపదేశం; అమ్మ దర్శనమే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి; నిగమాగమసార ప్రాప్తి, అనాయాసంగా అయాచితంగా సాధ్యమై కరతలామలకమైన వేళ ఇక సాధనతో పని యేముంది?
మాటలతో కాక చేతలతో అమ్మ సామ్యవాదానికి ప్రాణ ప్రతిష్ట చేసింది; ఆదర్శసమాజానికి పునాదులు వేసింది. వాటిపై మానవతా విలువల రమ్య హర్మ్యం – అందరింటిని నిర్మించింది. కేవలం సహపంక్తి భోజనాలు చేయటమే కాదు, కష్టసుఖాల్ని పంచుకుని జీవించటం నేర్పింది. రక్తసంబంధ మాధురీ మహిమను రుచి చూపించింది. పశుపోషణ, వ్యవసాయం, సామూహిక వంటశాల నిర్వహణ, అందరింటి నిర్మాణం – నిర్వహణ – పరిశుభ్రతతోపాటు పూజలు, అర్చనలు, అభిషేకాలూ, నామసంకీర్తన, సుప్రభాత సంధ్యావందన కర్మానుష్ఠానాలను దినచర్యలో భాగాన్ని చేసింది. ‘An idle man’s mind’ ఎలాంటిదో అందరికీ తెలుసు. వంచిన నడుం ఎత్తకుండా క్షణకాలాన్ని వృధాచేయకుండా శ్రమిస్తే ఆనందము, ఆరోగ్యము, దైవసంపత్తి వృద్ధి అని వేరే చెప్పాలా? ఇవే సంపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణ సోపానాలు.
క్రమశిక్షణ, సమయపాలన, పనిగౌరవం (Dignity of Labour), సహానుభూతి (Empathy), ప్రేమ, కరుణ, ఆదరణ, ఆప్యాయత…. వంటి ఎన్నో ఆర్ద్రతాధార విలువల్ని నేర్పింది. కాషాయ వస్త్రాలు, దండకమండలాలు ధరించని యదార్థ జగద్గురువు అమ్మ. అమ్మ బోధించిన జీవనసూత్రాన్ని
తారకమంత్రాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘పది మందితో కలిసి పని చేయటం, పదిమంది కోసం పని చేయటం’- ఇదే వాస్తవానికి పారమార్థిక సాధన.
పురాణాల్లో ఇతిహాసాల్లో ప్రహ్లాదుడు, సక్కుబాయి, రామదాసు, మీరాభాయి వంటి భక్తులు. భాగవతోత్తములు దైవానుగ్రహం కోసం తపించిన వారే, జీవితాన్ని కర్పూర హారతి పట్టిన వారే.
కానీ కారుణ్యామృత వర్షిణి అమ్మ దృక్పధం, మార్గం, నడక, విధానం వేరు. అమ్మ బిడ్డల్ని, దైవం భక్తుల్ని ఆరాధిస్తాడు. ‘మాతృదేవోభవ’ అనుకుంటూ అమ్మకి నమస్కరిస్తే, ‘సంతానదేవోభవ’ అని అమ్మ ఆచరణాత్మకంగా త్రికరణ శుద్ధిగా బిడ్డల్ని సేవిస్తుంది. ఇదే సంపూర్ణతత్వం, అమ్మ సంపూర్ణత్వం.
అమ్మ జన్మదిన, కళ్యాణదినోత్సవాలు, నవరాత్రి, దసరా వంటి పర్వదినాలూ సంక్రాంతి, ఉగాది వంటి పండుగలు వచ్చాయంటే భోగాలు ఎవరికీ? బిడ్డలకే అమ్మ నిరాహార. కానీ బిడ్డలు వస్తారని ఏడాదికి సరిపడు ఊరగాయలు, బియ్యం, పప్పులు… అన్నీ సిద్ధం చేయిస్తుంది. వారికి పెట్టుకోను గుడ్డలు, నీరు – నీడ – వసతి సౌకర్యాల కల్పన.. ఇదే అమ్మకి తపస్సు. అంతే కాదు. వేదనా పరితప్త హృదయాల్ని తన విశాల వడిలో వేసికొని లాలించి, ఉద్విగ్న మానసాల్ని అనునయించి, శబరీ కృత హృదయాల్ని శాంతింపచేసి, దివ్యమాతృత్వ ఆశీఃపూర్వక సుఖశాంతుల్ని ఉగ్గుపాలతో రంగరించి పోసి, వారి వ్యధల్ని బాధల్ని తన బాధ్యతగా శిరసావహించి మోస్తూ… తరింపచేయటం – ఇదేగా అమ్మ నిత్యకృత్యం. ఇది అక్షర సత్యం. ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఒకసారి, ‘అమ్మా! మా భారాన్ని నీ మీద వేస్తాం. మేం హాయిగా ఉంటాం’ – అని అంటే వెంటనే అమ్మ, “వెయ్యండిరా!” అన్నది. క్షణం ఆలశ్యం కాకుండా తటాలున వెనువెంటనే, అయినా ‘భారం’ అని నువ్వు అన్నావు. కానీ నేను అనలేదు” అన్నది చిరునవ్వుతో. అమ్మ చరాచర జగత్తుని తన అవయవాలుగా సంభావన చేసింది. చెట్టుకి కాయ, తల్లికి బిడ్డ భారం కావు.
అమ్మలో ప్రత్యేకతలు అమ్మకి సహజం, మనకి విశేషం. అవి సామాన్య మానవ నేత్రాలకి, మస్తిష్కానికి అందేవి కావు.
(సశేషం)