నేను మామూలుగా జిల్లెళ్ళమూడిలో ఉదయం పూట పూరింటి వద్ద నామం చెప్పేటప్పుడు మొదట్లోనైతే వరండాలో గోడగడియారం ప్రక్కన గల అమ్మ, హైమల ఫొటొ కెదురుగా కూచుని నామం చెప్పే వాడిని. తర్వాత స్థలం మారింది. పూరింటి మందిర ద్వారానికెదురుగా కూచుని నామం చెప్పే వాడిని. అక్కడ అలా కొన్నాళ్ళు నామం చెప్పిన తరువాత నాకొక వింత అనుభవం కలిగింది.
ఆ మందిర ద్వారానికి ఎడమ ప్రక్కన గల తెల్లని గోడమీద ఛాయా మాత్రంగా నా వైపు చూస్తున్నట్టుగా అమ్మ ముఖం కనబడేది. అంతే కాదు ద్వారం వెనుక హాల్లోనూ, వెనుక అమ్మ పడకగదిలోనూ గల మంచాల మీద దిళ్ళవైపు చూస్తే, అమ్మ అటు గోడవైపు తిరిగి పడుకున్నట్టు, అమ్మ తల వెనుక భాగం నల్లని జుట్టుతో ఛాయా మాత్రంగా కనబడేది.
అలాగే అలంకార హైమ గదిలో హైమ విగ్రహం ప్రక్కన గోడల మీద, ద్వారానికున్న ఐరన్మెష్ మీద హైమ నిలువెత్తు ఆకారం ఛాయా మాత్రంగా కనబడేది. ఇప్పటికీ కనబడుతోంది.
తరువాత నా స్థలాన్ని అలంకార హైమ మందిర ద్వారానికెదురుగా మార్చుకున్నప్పుడు మరొక వింత జరిగింది.
నేను కూర్చున్న కుర్చీ వెనుక గోడపై “జయహో మాతా! శ్రీ అనసూయా ! రాజరాజేశ్వరి ! శ్రీ పరాత్పరి ! నామంతో, అమ్మ తల ప్రక్కకు త్రిప్పి చేతుల్తో ఏదో చూపిస్తూ మాట్లాడుతున్నట్టుండే నిలువెత్తు హోర్డింగ్లో గల అమ్మ చిత్రం – అలంకార హైమ గదిలో హైమ విగ్రహం చుట్టూగల గ్లాసెట్లో సరిగా హైమ ముఖం మీద నిలువునా ప్రతిభింబించి (గదిలో లైటు లేనప్పుడు) హైమ ముఖంలో కలసిపోయిన అమ్మ ముఖం స్పష్టంగా కనుపించేది. అదే సమయంలో తెల్లని హైమ విగ్రహం తల మీద చక్కగా పాపిడ తీసిన నల్లని జుత్తు కనిపించేది.
అయితే ఇప్పుడు నా వెనుక నున్న హోర్డింగ్ను కొంచెం ప్రక్కకు జరిపి, స్థంభాలకు కలిపి చెదిరిపోకుండా దిట్టంగా కట్టడం వల్ల ప్రస్తుతం హోర్డింగ్ గల అమ్మ బొమ్మా, లోపల హైమ విగ్రహంలో కాకుండా కొంచెం ప్రక్కకు జరిగింది. అందువల్ల ఇదివరకులా అమ్మ ముఖం హైమవిగ్రహంలో కనపడకుండా పోయింది.
ఈ పరిణామం నాకు కొంచెం బాధను కలిగించింది. అక్కడ కూచున్న కాస్సేపూ కొంచెం వెలితిగా అనిపించేది.
నా బాధను ఇటు అమ్మ, అటు హైమలు గమనించి నట్టున్నారు. అందుకే ఇప్పుడు హైమ విగ్రహం ప్రక్కన కనపడుతున్న అమ్మ ముఖం వంక కాస్సేపు నిదానంగా చూచే సరికల్లా సడన్గా అమ్మ ముఖం మాయమై, అందులో హైమ ముఖం కనబడుతోంది.
అదీ మామూలుగా కాదు – హైమాలయంలో గంభీరంగా ఉండే హైమలా కాకుండా, సరదాగా నవ్వుతున్నట్టుండే హైమ ముఖం, అప్పుడప్పుడూ తలను అటూయిటూ త్రిప్పుతూ “అన్నా!” అనిపిలుస్తూ ఏదో చెబుతున్నట్లు కనబడుతుంది.
ఆ దృశ్యం నా కళ్ళకు కనబడగానే, అప్రయత్నంగా ముకుళిత హస్తుడవై – “అమ్మా! హైమా ! నా కన్నా!” అని ఆనంద పారవశ్యంలో మునిగి పోతాను ! ఒక్కోసారి నేను చెబుతున్న నామం ఆగి పోతుంది కూడా.
ఇది నాకు మాత్రమే తెలిసిన నిజం, కలిగిన దివ్యానుభవం అని అనుకుంటున్నాను ! ఏమో – మిగతా వారికి కూడా కలిగిందేమో.
దీనిని బట్టి నాకు అర్ధమయిందేమిటంటే అమ్మ, హైమల భౌతిక శరీరాలు అటు అనసూయేశ్వరాలయంలోనూ ఇటు హైమాలయంలోను ప్రతిష్టింపబడినా, వారి సూక్ష్మ శరీరాలు మాత్రం పూరింట్లోనే తిరుగు తున్నాయని, ముఖ్యంగా, హైమకు ఇష్టమైనది ఆ పూరింట్లోని ‘అలంకార హైమ’ ఉండే ఆ చిన్నగదేనని అనిపిస్తుంది.
అంతా నామ మహాత్మ్యం !
అందుకే “నామం శరణం గచ్ఛామి!”