“అమ్మల మరపించు అవని అమ్మవైన అమ్మా!
ఇమ్మహిలో నమ్మలేని అమ్మలేని అమ్మా!”
– మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజుబావ)
అసంఖ్యాకమైన నకిలీ బాబాలు, అమ్మలు కోకొల్లలుగా దర్శనమిస్తూ దైవస్వరూపులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో “నాకు భక్తులెవరూ లేరు – అందరూ బిడ్డలే”, “నాకు శిష్యులెవరూ లేవు – అందరూ శిశువులే” అంటూ, సమస్త జీవరాశినే కాదు, చరాచర జగత్తును ప్రేమించి, లాలించి “నా దృష్టిలో అంతా చైతన్యమే కాని, జడం లేదు” అన్న పరమసత్యాన్ని ఆచరణాత్మకంగా చూపించి,
కన్నతల్లులనే మరపించి అమ్మలోని అసలైన అమృతత్త్వాన్ని పంచిన అమ్మ ఈ అవనిలో అవతరిం చింది అంటే భావితరాలకి నమ్మశక్యం కాకపోవచ్చు.
“అడగనిదే అమ్మైనా పెట్టదు” అనే నానుడిని వమ్ముచేసి, “అడగకుండా అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ” అని లోకానికి చాటిన అమ్మ ఈ మహీతలంపై అవతరించింది అంటే వెంటనే విశ్వసించటం అంత తేలిక కాదు.
“తల్లికి తప్పదు” కాదు “తల్లికి తప్పే కనపడదు” అని ప్రవచించి, “గుణభేదమే లేని నాకు కులభేద మేమిటి” అని ప్రకటించిన అమ్మ ఈ అవనిలో అవతరించిందీ అంటే……అమ్మను చూడనివారికి నమ్మటం అంత సులభం కాదు.
నమ్మలేని అనేక మహనీయ గుణాల రాశి, ఆవిర్భవించిన మూడు సంవత్సరాలకే కన్నతల్లిని కోల్పోయి “తల్లిలేని తల్లి” అయింది. మరి ఈ సర్వ సృష్టికీ కారణమయిన జగన్మాతకు తల్లి ఎవరు?
అమ్మ తన బాల్యంలోనే ఒకసారి చిదంబరరావు తాతగారితో అంటుంది “నమ్మలేని అమ్మనా? అమ్మ లేని అమ్మనా” అని. ఆ భావాన్నే రాజుబావ తన పాట పల్లవిలో వ్రాశాడు “ఇమ్మహిలో నమ్మలేని అమ్మలేని అమ్మా!” – అని.
మహెూన్నతమయిన భావగర్భితమయిన ఈ గీతం లోని ప్రతి పదాన్నీ ఇలా విశ్లేషించుకుంటూ పోతే సర్వవేదాంత సారమంతా అనుభూతమౌతుంది.