అమ్మా !
నీవేం చేస్తున్నావమ్మా ?
నీ వెంట వుండాలనీ ఉంటుంది.
నీ కంటపడాలనీ ఉంటుంది.
నీకు కంటకంగా వుండాలని వుండదు
నీ వెంట వుండాలని వున్నా
నిన్ను తంటాలు పెట్టాలని మాత్రం కాదు
ఒంటిగా ఉండలేకనే
ఓ వైపు మనస్సు – మంటలతో
తంటాలు పడుతూ వుంటే
నీ కంటపడటం లేదా
నన్ను వెన్నంటి నీ వున్నా
నీవు ఎదురుగా కన్పించాలని వుంటుందమ్మా
నీ చెంత నన్ను నిలువ నీయక
చింతలో చిక్కించుట నీకు న్యాయమా ?
ఇది నీకు ధర్మమా ?
నిను దాటించుట నా ధర్మమని వాక్రుచ్చితివే
నీకూ మరి ధర్మం లేదా ?
నీ చెంతనే లేనని – నీకే చింతయును
ఆవంతయును లేదా ?
ఒంటరినై నేనెలా వుండగలను చెప్పు ?
ఈ గోళంలో వున్న – నా మనస్సు, శరీరమూ
గందరగోళంగా వున్నది
గిజ గిజ లాడుతూ గజిబిజిగా వున్నది.
ఏం చెయ్యనమ్మా – నేనేం చెయ్యను ?
కన్నీటితో పాదాల నభిషేచనము చేసి
హృదయమే – పుష్పగుచ్ఛముగ పాదాలపై నిడి
విన్నపాల మాలనే – గళసీమ నలకంరింపచేసితే
ఎందులకీ జాగు – మరెందులకీ జాగు
నన్ను నీ చెంతకు చేర్చుకోవటానికి.