అమ్మా… నువ్వు ఎక్కడ లేవు చెప్పమ్మా..!
అందరింట్లో అనంత విశ్వంలో… అణువణువులో ఉన్నావు…!
ఆదరంతో నీ బిడ్డల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయంలో అన్నపు రాశివై ఉన్నావు..! మనోవ్యధలను రూపుమాపే దేవాలయంలో పరదేవతా స్వరూపిణిపై ఉన్నావు…! నవతరానికి జ్ఞానాన్ని అందించే కళాశాలలో జ్ఞానరూపిణివై ఉన్నావు …! అర్కపురిలో అహరహం తపస్సు చేసే యోగుల హృదయాలలో చిన్మాతవై ఉన్నావు ….!
కల్పవృక్షం … కామధేనువు గురించి విన్నాను కానీ …
జిల్లెళ్ళమూడిలో వాటి ప్రత్యక్ష రూపంగా శ్రీ పాదుకాలయంలో ఉన్నది నువ్వే…! అందరిలో అన్నిటిలో నువ్వు ఉండగా ఇక నాకు దిగులు, చింత ఎందుకమ్మా ? అడగకుండానే ఆదుకునే ఆప్తబాంధవివి నీవు…!
చూపులతో కోర్కెలు తీర్చే కామాక్షీ దేవివి నీవు …!
కరుణతో కాపాడే త్రిశక్తి రూపిణివి
ముగురమ్మల మూలపుటమ్మవు
ఇక నాకు లేనిది లేదు, అందనిది లేదు.
నువ్వే చాలమ్మా నాకు!
నువ్వే కావాలమ్మా నాకు!!
న కాంక్షే పుత్రాది ప్రమద మపి వా యోగ మపి వా
న వా సిద్ధిం బుద్ధిం భవ విదళనం మోక్షమపి వా
పరం కాంక్షే మాత ర్నిఖిల జననీం ప్రేమనిలయాం
జగద్రక్షాదక్షాం నిగమ వినుతాం త్వా మభయదామ్.
(డా.పన్నాల రాధాకృష్ణశర్మ, శృంగారలహరి, శ్లో-77)