చిన్నమాటలో వంద భావాలు పలికించగలవు
పదం పలికితే ప్రణవం వినిపించినట్లు
ప్రాణం తేలినట్లు.. అనుభూతి
అంతరార్థం అవగతమైన కొద్దీ బహుతీపి
మా ప్రశ్నలకు నీ జవాబులు జలచరాలు…
శతవిధాల ఆలోచించ వలసిందే తరతరాలు
హేలగా… లీలగా… ఆలవోకగా జాలువారే నీ మాట
ఎందరెందరి నోట గానమవలేదు.
ఎందరెందరి మదిని ధ్యానమవలేదు.
గానమో ధ్యానమో అంతా ఒకటే అంటావు
అంటీ అంటనట్లుంటావు,
అంతటా ఉంటావు అన్నం తినమంటావు
‘సరే’ మంత్రమే సర్వస్వమంటావు
నా నుంచి వేరుగా ఎవరూ లేరంటావు
‘నేను’ కానిది ఏదీ లేనే లేదంటావు
నీ వేమంటే నాకేం… నా మటుకు నాకు
అక్షరద్వయమైన ‘అమ్మ’గా వెలసి
అనురాగ చంద్రికపై మెరసి
వాత్సల్య పీయూష ఝరులు కురిసి
నిలిపావు నా బ్రతుకు కోటపై పచ్చని తులసి !