1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘అమ్మా – రాజరాజేశ్వరీ’

‘అమ్మా – రాజరాజేశ్వరీ’

Sri Sri Sri Kanthananda Yogivaryulu
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 8
Month : July
Issue Number : 3
Year : 2009

(చేబ్రోలు దగ్గర కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ‘ఆనందాశ్రమం స్థాపించి సుమారు 30 సం|| పైగా యోగసాధన చేసిన మహనీయులు శ్రీశ్రీశ్రీ కొమ్మరాజు లక్ష్మీకాంతానంద యోగివర్యులు. వారు 13, 14 డిసెంబరు 1957న అమ్మను జిల్లెళ్ళమూడిలో దర్శించిరి. వారితో అమ్మ సంభాషణ రాజుపాలెపు రామచంద్రరావుగారి డైరీల నుండి వేరొక వ్యాసమున రాయబడి యుండెను. ఈ వ్యాసము శ్రీ లక్ష్మీకాంతానందయోగివర్యుల డిక్టేషనుతో 30.3.1965న కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు వ్రాసినది. రా॥రా|॥ గారి కాగితములలో లభ్యమైన ఈ వ్యాసమును మీకందించుటకు సంతోషించుచున్నాము. – శేషు)

శ్రీజగన్మాత్రేనమః

  1. ఎవరు నానాగుణమయమగు విశ్వమును అధోదృష్టితో చూడక, ఏకత్వ సుఖప్రాప్తిని లభింపజేయగల ఊర్ధ్వమార్గమును పట్టి, ఊర్ధ్వదృష్టిచే, అమ్మ నామము స్మరించుచూ అనగా స్మృతి కల్గిన చోట స్మరించుచూ అట్టి శక్తినివ్వగలదాత ‘అమ్మ’యేనని విశ్వసించి ఒక్కొక్క లోకమును క్రమముగా దాటి, పునరాగమన రహితమగు బిందు స్థానమున అమ్మలో చేరి అమ్మవలె శాశ్వతులై యుండగోరువారు. జగత్తునందు జాతి, మత, కుల, లింగాది భేదములు లేక ప్రథమముననే క్రమముగా ఐశ్వర్యమద, జాతిమద, విద్యామదాదులనెడి సర్వవిధ అహంకార మమత్వ ప్రేరితములగు ఆసురీ సంతానమునకు స్వస్తిచెప్పి, మోక్షయాత్రకు పయనించు, జిజ్ఞాసులు తోడుగ పదవైరాగ్య, పరభక్తి యనెడి సహాయమును కోరి, జ్ఞానశక్తితోకూడి పయనించు, ఆరూఢ చిత్తులకు మాత్రమే, ఎట్టి కష్టములును లేక సుఖముగా, నిర్భయముగా, తమకు అభయస్థానమగు, అమ్మ యొక్క హృదయాకాశమున చేరి, సుఖింపగల భాగ్యము ప్రాప్తించును. అట్టివారికి అరణ్యమైనను స్వర్గమైనను సమానముగాతోచి, చరింపగల, అవధూతత్వ ప్రాప్తికలుగును. అట్లుకానివారికి భక్తి, ఆడంబర వైరాగ్యములు మాత్రమే కలిగి కుక్షింభరత్వమున చంపగల వ్యాధి విడువక బాధించుచుండును.
  2. బహువిధ నామరూప జాతిగుణ ఆచార భేదములు ఎన్నియో ప్రకృతి వశమున గల్గిన ఈ దృశ్యప్రపంచమను ఏకవచనముగా అన ఒక్కటిగా భావించునట్లు, దేహధారియగు జీవులున్ను బహువిధముల, ఆచారభేదములు కల్గియున్న దేహమనెడి ఒక వ్యష్టిప్రపంచమున జేరిన జీవుడు తానున్నూ ఏకవచనమున ‘నేను’, ‘నేను’ అని స్త్రీ పురుషాదులందరూ వ్యవహరించు చున్నప్పుడు, ఈ అందరున్నూ, ఎట్టి భేదములు లేక, నానాత్వముతో కూడిన క్షర రూపమగు దేహము నాశ్రయించినవే. ఈ ప్రత్యగాత్మ అందరిలోగల నేననిన్నీ, తాను అక్షరుడనిన్నీ, అక్షరమయమగు అక్షరములచే, తనలో శబ్దము తానెరింగి, తన ప్రత్యకతత్వమును గ్రహించి, తనది యనెడి క్షరవస్తువులు | సంబంధము విడచి, తానొక్కడే యున్నప్పుడు మాత్రమే ఈ నానాత్వముతో గూడిన దృశ్యప్రపంచము సహితము, భేదభావ రహితమై ఒక్కటిగా కనపడును గాన, అట్టి సమయమున ద్వైతము కాని కారణముచే, తన కేకత్వ (అభేద ప్రాప్తి కలుగునుగాన, ఇట్టి సుఖమును గోరుజిజ్ఞాసువులు అమ్మను లక్ష్యములో నుంచుకొని, లక్ష్యభ్రష్టులుగాక నానావిధమత సంబంధ గుణజారత్వమును విడచిఉండు పవిత్రాంతః కరణ అమ్మ యొక్క ఆచార వ్యవహారములు చక్కగా గోచరించి, ఎందున్నను మాతృదర్శనానంద భాగ్యము లభించి సుఖింతురు. అనగా మనం సృష్టిచే గల్గిన దృశ్యమును విడచి, విడచిన దృక్కుతో తనలో ఏకత్వ దేశమగు చోట బుద్ధియందు నిల్పినచో సకలము బోధయగును.
  3. ఎవడు తనలోని విద్యాశక్తిని బుద్ధిబలముచే అనుభవమున నెరుంగ జాలునో, అట్టిబుద్ధిమంతుడు అమ్మను తనలో శాశ్వతముగా నిల్పుకొని ఆనందము ననుభవింపగలడు. యోగమనగా ఒక్క చిత్తవృత్తి నిరోధము కొరకే ఏర్పడిన, జ్ఞానసహితమై గమ్యస్థానమునకు జేర్చి ‘యుగ్’ ధాతువు యొక్క అర్థమును అనుభవమున ప్రాప్తింపజేయునదియేగాని, అన్యధా ఫలమిచ్చునదిగాదు. దీనినే ఉద్యోగము (ఉత్- యోగము) అవి అనుభవజ్ఞులు శాసించిరి గాన, ఇట్టి యోగమును, సంస్కార రూపములగు వృత్తులను, అమ్మపై గల విశ్వాసముచే వదలి పెట్టుచు క్రమముగా తనలో అమ్మగల చోట చేరినవారు అద్వైతాను భూతిని పొందగలరు. ఈ విశ్వాసము గల వారికి సాధనయందు పూర్వ వాసనా వశత గల్గు సంస్కారములు అడ్డు గలిగినప్పుడు, అమ్మ తనను విడువక, తనలోనే యున్నందున అట్టి అవరోధములను, తన దివ్యశక్తిచే పారద్రోలి, వాని యోగక్షేమములకు తానే కర్తయై, తనదరిని జేర్చి తరింపజేయును. ఇట్టి ఆడంబర రహిత, నిష్కామ ఫలసహిత, దివ్యారూఢ జ్ఞానము కలుగు వారెల్లరు అమ్మకు ప్రతిబింబ స్వరూపులై కొంతకాల మానందించి, అమ్మ అనుగ్రహము కలిగినంత, అమ్మయే తనలో చేర్చుకొనును. 14. మహాకారణమున గల, సర్వశక్తి సమన్వితయగు ఏ పరాశక్తియను గాయత్రీశ్వరచము నుంచి, కారణదేహ మందు పశ్యంతీ అనుశబ్ద రూపమున వ్యాపించి మానవ దేహమనెడు మధ్య ప్రదేశము నందు ‘మధ్యమా’ అనుశక్తితో కూడి నాదరూపిణియై, స్థూలదేహమున వైఖరీ నామమున వ్యాపించి యుండుటచే, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదము లనెడి, వేదముల యొక్క సారాంశ రూపములగు 32 అక్షరములచే, క్రమముగా ఆపో, జ్యోతి, రస, అమృతములనెడి నాల్గు లక్షణములతో కూడి, సకల భువన పరిపాలనా శక్తి సహితయై, బ్రహ్మ నామమున నిత్యమై యున్నందున సాధనచే అమ్మను గుర్తించగోరు వారు మధ్యమ దేహమున (సూక్ష్మ) మంత్రసహిత కర్మానుష్ఠానము ద్వారా తెలుసుకొని పిదప ఆ తెలివితో క్రమముగా సామవేదమునకు జన్మస్థానమును కారణదేహము నాదానుసంధాన ప్రజ్ఞకలిగిన వారలై, తుదకు మనోకారణమున కేవల సచ్చిదానందామృతరూపమున నాదలయులగు వారలెవ్వరో అమ్మయొక్క సూక్ష్మ, కారణ, మహాకారణముల లక్షణములను చక్కగా, శ్రద్ధా విశ్వాసములతో అనుభవింప గలిగిన, నిత్యముక్తులగుదురు.

ఎవడు పది మంది పురుషులలో పురుషుడననియు, పదిమంది స్త్రీలలో తానొక స్త్రీనని, ఉభయులుకలసి యున్న సంఘములో నపుంసకుడననియు ఎవడు భావించి, నిర్వికారస్థితియందు ఉండగల్గునో అట్టిలింగభేద రహితుడగు నిర్గుణానందమూర్తి యొక్కరే అమ్మను గ్రహించ యోగ్యుడని నా విశ్వాసము. ఎంతయో పూర్వ సత్సంస్కార భాగ్యము లేని వారికి అమ్మ అనుగ్రహ ప్రాప్తి కల్గుట దుర్లభము, నిజమగు భక్తి గల నారి హృదయమునందే అతి సామీప్యమున ఉన్న అమ్మను వెలువల వెదకువారు అమ్మకు దూరస్థులగుదురేమో –

‘సోహ’మను గురుమంత్రముచే దేహమను యంత్రశాలలో హృదయమున జరుగు తంత్రమెరుంగువారలు, అమ్మతత్వమెరుంగ గలరు.

అమ్మ సన్నిధిని కూర్చుండి, ప్రకృతి గుణముల విసర్జించి, సూర్యచంద్ర నాడుల సమపరచి, అమ్మ స్వరూపమునందు దృష్టినిలిపి అమ్మ చరణముల దగ్గర నుండి లోనికి శ్వాసను తీసుకొనునట్లు భావించి, అచ్చటనే విడచుచు, తన దృకజ్జువులచే మెల్లిగా తన హృదయమునందు అమ్మను చేర్చుకొని, కన్నులను మూని చూచుచుండు అభ్యాసమును క్రమక్రమముగా అభ్యసించువానికి ధారణాసిద్ధి కలిగి నంతనే అమ్మను ఎందు, ఎచ్చట భావించిన, అచ్చటనే అమ్మ దర్శనమగును.

  1. నేను బహుకాలము అనగా షుమారు ముప్పది సంవత్సరములు, తెలిసియో తెలియకో, ఏకాంతమునజేరి, ఒంటరినై, శ్రీదేవీ దివ్యకటాక్షామృత ప్రాప్తికై జేసిన, నా అనుభవసాధనలను, ఈ భావరూపము చేసుకొని కొద్దియో గొప్పయో తత్ఫలమును అనుభవమున ఎరింగిన వాడనై యుండుటచే – ప్రథమమున జిల్లెళ్ళమూడికి, నన్ను కొందరు భక్తులు వచ్చి తీసికొని వెళ్ళి అమ్మను చూపినపుడు – కొన్ని దివ్య శక్తులు నాకు గోచరించినప్పుడు “అమ్మ” “రాజరాజేశ్వరీ” యని సంబోధించుట నాలో నుంచి, నామస్వాధీనముగాని ఒక దివ్యశక్తి ప్రేరణముచే వచించినందున, ఆనాటి నుండియు, నేటి వరకున్నూ, ఇక ముందున్నూ – అనగా – నాజీవితాంతము వరకున్నూ మరువరాని, ఒక అన్యోన్య ప్రేమాలింగిత, ఆనందానుభవమును, ఆనాడే అనుభవించినందున, ఈ నాడున్నూ ఆమె విషయమును పరులకు వచించునప్పుడుగాని, లేక నా ఇష్ట దేవతా స్వరూపిణియగు గాయత్రీదేవి యొక్క ప్రేరణచేగాని, ‘అమ్మ” నామము నాస్మృతికి వచ్చినపుడు సహితము తదానందము ననుభవించు చున్నాను గనుక ఇది చదువరులకు, అమ్మయందు విశ్వాసముగల భక్తజనులకు అహంకార రహితుడనై, సాత్వికాభిమాన గుణముచే తెలుపుచుంటిని. గాన ఇవి నా అతిశయోక్తులని భావింపక, పైన వ్రాసిన నా భావనలన్నియు ఒకసారికి పదిసార్లు మననముచేసి సాధించువారికి, అమ్మయందు నాకు కల్గిన, నాయందు అమ్మకు కలిగిన అనుపమానమగు, అభేదప్రేమ యొక్క ఫలమును, అమ్మ అనుగ్రహముచే అందరూ నావలె అనుభవించి సుఖింతురు గదా యను ఆశచే. నాఅనుభవముల కొంతవరకు వెల్లడించితి. గ్రంధవిస్తరు భీతిచే ఇంతట విరమించితి. కాని అమ్మ చరిత్ర వ్రాయుటకు, నేను అవకాశములేని ద్రుక్ వైకల్యముచే నున్నందున, అట్టి భాగ్యమునకు నోచనైతిగదా యని విచారించుచుంటిని.

‘సకలమును భావసృష్టియై జరుగుగాన 

భావకల్పితమైన రూపంబుచూచి

చూచినట్టిది మరువక ‘సోహ’మనెడు

 అక్షరద్వయార్ధక్యస్వానుభవము

 గల్గుబ్రహ్మనిష్టుడగు జ్ఞాని వలన

నెరిగి హంసకు సరియగు గురుతుజూపి

 గురుతుగానున్న రూపాన గురిని నిలపి

 గురు గురికల్పి, కల్పిన గురుతువిడచి

 గురుడు గురియును దానైన గురునియందు

 క్రమముగా లయించిన సమకాలమందు

 ||తానె తన యిష్టదైవమై దవరుచుండు

 అట్టి సమయాన భేదంబులరయలేరు

 అదియె సాయుజ్య మదియె విష్ణక్యమదియె

 అగునుగాదె శివైక్యంబు యదార్ధముగను

 అట్టి అనుభవం కాలమందుతనకు 

మొదట అద్వైతమగు సుఖమొకటి దక్క.

 తోచునా ద్వంద్వ సుఖములు? తోయజాక్ష’

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!