(చేబ్రోలు దగ్గర కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ‘ఆనందాశ్రమం స్థాపించి సుమారు 30 సం|| పైగా యోగసాధన చేసిన మహనీయులు శ్రీశ్రీశ్రీ కొమ్మరాజు లక్ష్మీకాంతానంద యోగివర్యులు. వారు 13, 14 డిసెంబరు 1957న అమ్మను జిల్లెళ్ళమూడిలో దర్శించిరి. వారితో అమ్మ సంభాషణ రాజుపాలెపు రామచంద్రరావుగారి డైరీల నుండి వేరొక వ్యాసమున రాయబడి యుండెను. ఈ వ్యాసము శ్రీ లక్ష్మీకాంతానందయోగివర్యులు డిక్టేషనుతో 30.3.1965న కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు వ్రాసినది. రా॥రా|॥ గారి కాగితములలో లభ్యమైన ఈ వ్యాసమును మీకందించుటకు సంతోషించుచున్నాము. – శేషు)
శ్రీజగన్మాత్రేనమః
శ్రీ విశ్వగర్భిణీ చరణారవిందామృత పాదానురాగ, పరభక్తి సహితులైన, సద్భక్తులారా !
- ఎవరు అమ్మ తత్వమునెరిగి, ఎరిగిన చోటు విడువక, అమ్మ యొక్క అనుగ్రహ శక్తిచే నిత్యమారాధించు, బుద్ధి బలయుక్తులకు, కోవిదులకుకాక, కేవల బాహ్యశాస్త్రారణ్య గర్తాన్వేషులగు వారికి సాధ్యమగునా? అదికల్ల. ఎవరు అమ్మ దివ్య రూపమందుగల దాంపత్య మర్మమెరుంగుదరో. అట్టి వారికి మాత్రమే, సగుణ, నిర్గుణముల సంధినెరిగి, ఆనందింపజేయు శక్తి సహితులై, నిర్వికారముగా, సంతతము, బహిర్దృష్టిలేక, అంతరదృక్కగు, జ్ఞానదృష్టి యందు నిలచి, అట్టి పరమాకాశమున, భావ భావ విమానములపై స్వేచ్ఛగా, నిర్భయముగా సంచరింపగల సద్భాగ్యము గలవారై జీవన్ముక్తులగుదురు.
- బ్రహ్మవిద్య అనగా బ్రహ్మ యొక్క విద్య, అనునప్పుడు విద్యారూపిణియగు, అమ్మ, అనుగ్రహించి నప్పుడు, అమ్మలోగల చైతన్యమున, అమ్మయే చేర్చి, అమ్మ – అయ్యలను, ద్వైతభావము విడిపించి, కేవల అద్వైతసిద్ధియే అనుభవించగల, ప్రాజ్ఞత్వమనెడి సత్ప్రసాదము నొసగి, పురుషత్వ – స్త్రీత్వమనెడు లింగద్వయ భేదము లేని స్థితి బ్రహ్మ విద్యా స్వరూపిణియగు అమ్మయే యొసంగును కాన, ఎట్టి ప్రాణియైనను, ఎంత తపస్వియైనను, భారము అమ్మయందే విడచి, అమ్మగర్భములోనే స్థిరముగా నుంటి మనెడు ఆరూఢభావము ఎవరికి కల్గునో అట్టివారు ఈ దృశ్యప్రపంచమున గల నానాత్వగుణ వికారము లేక, సమదృష్టి, సమభావము కలిగి, వారెందున్నను, ఎట్లు చరించుచున్నను. అమ్మ సన్నిధిని మరువక విడువక, స్థితప్రజ్ఞులై ఉండగల జ్ఞానానంద స్థితిగలిగి, అమ్మ కటాక్షించి, ఆజ్ఞ ఇచ్చినచో వారు లోకహితార్థము, మాతృసేవ చేయుచు, లోకులను తరింపచేతురు.
- ఎంతటి యోగియైనను, ఎంత జ్ఞానియైనను, బిందుస్థానమునకు సహస్రారమునకు మధ్యగల చిదాకాశమున చైతన్య సహిత చిద్రూపిణియై ఆనందమే గుణముగా గల్గియున్న అమ్మ సన్నిధిచేరి, అమ్మ ఒడినెక్కి అమ్మ యొక్క దివ్యామృత స్తన్యపానమును చేయగల్గిన, సమర్థతను, షట్చక్రములు; క్రమముగా అమ్మపైనగల లక్ష్యబలముచే మధ్యమార్గమును బట్టి, దహరాకాశమనెడి హృదయ మందు చేరి, అచ్చట కొంత కాలము విశ్రాంతి రూపమగు – సద్భక్తియనెడి సగుణ రూపమున ధ్యానించి, అమ్మ యొక్క అనుగ్రహ మనెడి దివ్యదృష్టి ప్రసారముచే అమ్మ సన్నిధి చేరగల, నిర్వికార గుణయుక్తుడగు పుత్రులను అమ్మ తన ప్రేమచే, తనలోగల, ప్రేమయున్న చోట చేర్చి, తన నిజరూప దర్శన మొసంగి కృతార్థులను జేయును.
- అమ్మ సూర్యరశ్మి క్రిందగల దేశములలోని వారందరూ, ఒక మనస్సేగల మానవులు గనుక వారు వారి దేశముల గల ఏ భాషలు మాట్లాడినను, అమ్మ, అందరిలోని మనస్సు నెరిగిన బుద్ధితత్వమందు గల తత్వమెరింగిన దివ్యమంగళ స్వరూపమై యుండుటచే, అమ్మ ఎట్టిభాషనైనను మాట్లాడగల, గ్రహించగల సమర్ధత గలిగి యుండుట అమ్మకు సహజము సులభము.
- అమ్మ సర్వదా శ్రవణేంద్రియ – దృగింద్రియములనెడి, ఇంద్రియముల మధ్యగల సర్వవ్యాపక ఆకాశమున ఉండుటచే, ఎచ్చట యేమి జరుగుచున్నను, అమ్మకు గోచరించుచుండును గాన అప్పుడప్పుడు, అమ్మ సన్నిధిగల వారలతో పరుల యొక్క భావమును, ఇచ్చటి నుండియే అచ్చటి విషయముల లీలామాత్రముగా, ముద్దు ముద్దుగా వచించి భక్తుల రంజింపజేయు చుండుట అనెడి శక్తి – సర్వవ్యాపక శక్తియగుటచే అమ్మను సర్వజ్ఞశక్తి యనుటకు సంశయము లేదు.
- అమ్మ దర్శనార్థమై వెళ్ళగోరువారు అమ్మ యొక్క స్వరూపమును, తమకు, తమలోగల సంకల్పస్థానమున, అమ్మ దివ్య మంగళ స్వరూపమును నిలుపుకొని, సంశయ రహితులై, అమ్మ ముందు గల దనెడి విశ్వాసముచే వెళ్ళువారికి అమ్మ ఈ మార్గమధ్యముననే దర్శన మివ్వగల సర్వాంతరామిత్వ శక్తి యగుటచే ఎట్టి అవరోధము లేక, తన సన్నిధికి చేర్చుకొనును.
- శాస్త్రముల యందు, త్రిగుణాత్మిక యగు, శ్రీ రాజరాజేశ్వరీ దేవి యొక్క దివ్యలక్షణములు, తమోగుణ రహితమై, రజోగుణముతో కూడిన రెండు కళలతో, పధ్నాలుగు శుద్ధ సత్వ గుణయుక్త కళలతో చేరి యున్నందున జగత్కుటుంబిని గాన తన సంతాన పోషణార్థమై రెండు రజోగుణకళలతో కూడి యున్నందున – అమ్మ మనతో కలసి మెలసి తిరుగుచున్నట్లు గోచరించి, తన నిజప్రేమను వెల్లడి చేయుచు, అందరితో కలసి ఆనందించుచు, తన నిజమాతృ ప్రేమామృత సాగరమున ముంచి, ఆశ్రితుల తత్తరంగ రూపములుగా జేసి – సముద్రమునకు తరంగములకు భేదములేని స్థితినొసంగి, రక్షింపగల శక్తిగలదగుటచే – అమ్మను ‘జగన్మాతయనుట సార్థకమగును.
- ముక్తికొరకై, ఎంతటి వారలైనను, ముక్తినొసగెడి ఒక దివ్య శక్తి మోక్షదాత యగు, ఆ పరమేశ్వరుని యందే లీనమై యుండుటచే ఆపరమేశ్వరుని దివ్యశక్తియే మోక్షమొసగెడి శక్తి రూపమున అవతరించి కేవలము మూర్తీభవించిన చిన్మయ స్వరూపమై యుండుటచే, నిష్కళంక భక్తి, జ్ఞానద్వయ వైరాగ్య శక్తిగల వారికి మాత్రమే దర్శన మాత్రముచే సకల సంశయములు తీరి, కృతార్థులగుదు రనుట హాస్యాస్పదము కాదు నిశ్చయము.
- ఎవరు పురుషులమనెడి భావముచే చరించుచూ, అట్లు చరింప జేయగల శక్తి తనలో, ఏరూపమున – నేవేళ – ఎట్లు, విషయాదులతో కూడి, చరింపజేయు చున్నదో అట్టి అవిద్యాశక్తిని గ్రహించి, తనతో అనాది నుండియు లోపలనే విద్యాశక్తి యనెడి రూపమున కాపురము చేయుచున్నట్టి శక్తితో గూడి ఆ పురుషుడు ఆవిద్యను జయించి, కూటస్థమనెడి పురము నందు హాయిగా భోగింపగల యోగ పర్యంకమునచేరి యుండగల నిత్యజ్ఞానులకే అమ్మ స్వరూప మందలి దివ్యచైతన్యమును గ్రహించి, సుఖింపగల అతులితానంద భాగ్యము ప్రాప్తించును.
- మూర్తీభవించిన, దివ్యస్వరూపిణియగు, భువనేశ్వరియగు అమ్మ తత్వంబు నెరుగ గోరు భక్తులు, సాధకులు క్రమముగా అమ్మ సన్నిధి చేరు పర్యంతము, మధ్యలోకములంగల, చిత్రవిచిత్ర ప్రదర్శన మహిమలకు లోబడిన, యేకదీక్షచే, యేక లక్ష్యమున ఏకమార్గమును బట్టినవారే అమ్మ సన్నిధి యనెడి ఒక్కచోటికి జేరగలరు. లేనిచో మహిమలకు లోబడి పతితులగుదురు.
(సశేషం)