అమ్మా !
ఒంటిచేసి మింటి కెగసిన నిన్నేమని యందును
నిదుర రాని నాకన్నులు, నీకై నిరీక్షించే ఈ కన్నులు,
నీకై వీక్షించే యీ కనుదోయి, కనురెప్పలు వాలనీయదదేమో
నామదిలో మెదిలే నీ తలపులతో
నా హృది తలుపులు మూతపడేదే !
మూడు దశాబ్దాల కాలం ముగింపుకొస్తోంది
మన భౌతికమైన వియోగం కాన
అది మానసికంగా మహత్తర సంయోగం
తెల్లవారి నీ గురించిన వూహలతోనే
ప్రారంభం అనటానికీ లేదు దానికి తుది ఉంటేగా
అన్నిటా నువ్వు – అంతటా నువ్వే నిరంతరం నీ స్మరణే
నా గుండెలోతుల్లో మారుమ్రోగుతోంది
నువ్వు నాకందించిన అందిస్తున్న
అనుభూతులేనే ధ్యాసగా అదే ధ్యానంగా
నా వూహలకే అందని రీతిలో నీతో పంచుకున్న అనుభూతులు
నాహృది గదిలో నిక్షిప్తమయినాయి
నామంఅనే ఇటుకలతో హృదిలో
గుడికట్టమని ఉద్బోధించావు కదా
అదే నిజమయింది సత్యం
నాయెదలో ఆలయ నిర్మితమయింది.
నీ రూపమే ప్రతిష్ఠితమైంది
పూజా సుమాలు లేని అర్చన
నియమ నిబంధనలు లేని అర్చన
ఆవేదన – నివేదన మనసే – హారతిగా మంత్రపుష్పంగా
వెలుగొందుతున్నదామూర్తి
నీ ఆలోచనల చుట్టూ పరిభ్రమించటమే
ప్రదక్షిణలు, షోడశోపచారాలును.