- తలపైని సొగసైన నెలవంక లేదేమి!
దరహాస సుధలలో దాగె నేమొ;
మురిపాల గంగమ్మ శిరసుపై కనరాదు,
కరుణయై కనులలో కురిసె నేమొ;
అగ్నినేత్రమ్మేది ? అసలె కానగరాదు,
నొసట కుంకుమయౌచు మసలె నేమొ ;
అక్షరమ్ముల ఢక్క అది యేది ? కనరాదు,
మృదు భాషణమ్మయి ఒదిగె నేమొ;
రజతగిరి నుండి పుడిమికి రాదలంచి
శివుడు కొంగొత్త రూపాన చెలగెనేమొ;
దివ్యమౌ భవ్యమౌ శాంత తేజమిటుల
అర్కపురిలోన అమ్మయై అవతరించె
(మహాశివరాత్రి సందర్భముగా)
- తిన్నగ కుంకుమ దిద్దును
చెన్నుగ మరి పలుకరించు చిత్తము కరుగన్
మన్నన సేయును మనలను
కన్నుల వాత్సల్య గంగ కదలాడునహో!
- ‘మీరెల్లరు నాబిడ్డలె,
‘నేరుగ మీ తల్లులకును నెనరున నేనే
తీరుగ దత్తత నిచ్చితి,
రారే!’ యని చేర బిల్చు రాజత్కరుణా!
- అందరు తన బిడ్డలనుచు
స్పందించెడు హృదయము గల సర్వేశ్వరికై
డెందము నర్పించ గలుగు
చందము నెఱిగిననె జన్మ సార్థక్యమహో!
- నిర్మల తత్త్వచింతనము నిశ్చలభక్తియు సాధుశీలమున్
ధర్మ పరాయణత్వము సదా వసుధైక కుటుంబ భావనం
బర్మిలి విశ్వశాంతియును నన్య మతంబుల నోర్చు బుద్ధియున్
కర్మలొనర్చు పట్టులను కౌశలమీయవె శ్రీ పరాత్పరీ!