రూపుదాల్చిన ప్రేమమూర్తి అమ్మ. అమ్మది ప్రేమావతారం. అడగకుండానే పెట్టేది అమ్మ. అలా అడగకుండానే అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో వున్నాయి. జరగబోయేది తెలుస్తేనేగా అడగటానికి. ఆమెకు తెలుసు మనకేమి అవసరమో! మా పుట్టిల్లు చిలకలూరిపేట దగ్గరవున్న పసుమర్రుగ్రామం. 1976 లో మొదటిసారి ప్రసవం కోసరం పసుమర్రు మా అమ్మగారింటికి వచ్చాను. అప్పట్లో మా బాబాయి శ్రీ వాసుదేవాచారి గారు చిలకలూరిపేటలో వుండేవారు. డాక్టరు ఇచ్చిన తేదీకి వారం రోజులు ముందుగానే మా బాబాయి వాళ్ళింటికి రమ్మన్నాడు. ఆసుపత్రి వాళ్ళింటికి దగ్గర. పసుమర్రునుండి రవాణా సౌకర్యాలు తక్కువ అందువల్ల అలా ఏర్పాటు జరిగింది. అప్పట్లో కమలక్కయ్య వాళ్ళుకూడా అక్కడే వుండేవారు. రోజూ కమలక్కయ్య నాకు అమ్మతో ఆమె అనుభవాలను చెప్తూవుండేది. అలా వింటూవుంటే నాకు ఎంతో హాయిగాను, సంతోషంగానూ ఉండేది. చైత్ర శుద్ధ నవమి, శ్రీరామనవమి పండుగ సాయంత్రం కొంచెం నలతగా వుండటంవల్ల హాస్పటల్కి వెళ్తే జాయిన్ అవమన్నారు. ఉదయం 7 గం||లకు డాక్టరు వచ్చి ఆపరేషను అవసరం బిడ్డకు మాడు ఎదగలేదని తోస్తోంది, ఎక్స్-రే తీయించండి అన్నారు. డాక్టరు ఎంతో అనుభవం వున్నావిడే. కానీ సౌకర్యాలు ఆ హాస్పటల్లో లేవు. ఆ రోజుల్లో ఆపరేషను కాన్పులు అరుదు. ఎక్స్-రే తీయిస్తే కార్డు బిడ్డ మెడకు చుట్టుకుంది, అందువలన ఆపరేషన్ అవసరం అన్నారు.
వెంటనే ఆపరేషను చేయాలని చెప్పటంవల్ల గుంటూరుకు వెళ్ళే అవకాశంలేదు. అది అందరినీ కలవరపరిచింది. కొంతసేపటికి మా బాబాయి పూలు, అమ్మ కుంకుమ, ప్రసాదం తీసుకుని వచ్చారు. అమ్మకు నమస్కరించుకుని, బొట్టు, పూలు పెట్టుకున్నాను. “అమ్మ నీలోనే వుంటుందమ్మా! ధైర్యంగావుండు” అన్నారు. రాత్రి అమ్మ కమలక్కయ్యకు చెప్పిందట. అందుకని “అమ్మ నీతోనేవుంటుంది” అన్నారు. కమలక్కయ్యకు అమ్మ ఏమి చెప్పిందో తర్వాతి రోజు చెప్పారు. ఉదయాన్నే అమ్మ కుంకం, పూలు తీసుకుని బాబాయిదగ్గిరకు అక్కయ్య వచ్చి “అన్నయ్యా! రాత్రి అమ్మవచ్చింది. “కమలా! రాముకి (నన్ను అక్కడ అలాపిలుస్తారు) ఆపరేషను చేసి, ఆడపిల్లనిస్తే బాధపడ్తుందంటావా!’ అని అమ్మ అడిగితే “ఎందుకు బాధపడ్తుందమ్మా! ఇస్తోంది నువ్వైతే. తల్లీ పిల్లా క్షేమంగా వుంటే చాలు”అని తను అన్నట్లు చెప్పిందిట. అలా చెప్పి ఆ పూలు, కుంకుమ నాకు పంపించింది. ఆ ఏర్పాటు అమ్మదే! ఆపరేషను చాలా సులువుగా అనుకున్నదానికంటే ముందుగా జరిగిందని డాక్టర్లు చెప్పారట. అమ్మ అన్నట్లే ఆడపిల్లనిచ్చింది! అప్పట్లో కుట్లు మానటం ఎక్కువకాలం పట్టేది. నాకు 7 రోజుల్లో పూర్తిగా నయమైపోయి 11 వ రోజున స్నానం చేయించారు. అంతా అమ్మ అనుగ్రహం కాక మరేముంది! కొద్ది రోజులలోనే మామూలు స్థితికి వచ్చాను. ఇది అమ్మ నాపై వర్షించిన అవ్యాజ కరుణామృతధార!
జయహోమాత.F