“సాధ్యమైనదే సాధన” అని ప్రవచించిన అమ్మ గృహస్థాశ్రమం ద్వారా లోకంలో ఉన్న గృహిణులందరికీ ఒక సాధనాక్రమాన్నీ, వైవాహికబంధంలో ఉన్న పరమార్థాన్నీ బోధించడం కోసమే తాను వివాహం చేసుకున్నదేమో అనిపిస్తుంది. వైవాహిక బంధంలో అతికీలకమైంది. గృహిణీస్థానం. అసాధారణస్థితిలో ఉన్నప్పటికీ అమ్మ సాధారణ వ్యక్తి వలె వివాహం చేసుకున్నది. ఇల్లాలుగా, కోడలుగా, తల్లిగా అనేక భూమికల్లో తన కర్తవ్యాన్ని ఎంతో సహనంతో నిర్వర్తించింది. గృహిణీ ధర్మాలను అమ్మ నిర్వచించటమే కాక తాను ఆచరించి ఆదర్శగృహిణిగా లోకారాధ్య అయింది. లోకంలో ఆదర్శగృహిణి అంటే భర్తనే దైవంగా భావిస్తూ భర్తభావాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తూ అనుకూలవతిగా ఆ సేవలో తరించడం. ఇది ఒక మార్గం. కాని అమ్మ ఆదర్శం ఆ పరిధిలోనే ఆగిపోక ఒక ఉన్నత లక్ష్యం వైపు సాగింది. ఆ నేపధ్యంలోంచి వచ్చిన మహావాక్యాలే “సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచిపెట్టేదే వివాహం; పాతివ్రత్యానికి చరమదశ భర్త భార్యను ‘అమ్మా’ అని పిలవడం…” వంటివి.
ఒకసారి చిదంబరరావు తాతగారు అమ్మతో, “నువ్వు అగ్నిగుండంలో ఆడుకోగలవు, పాము పడగనీడన కాపురం చేయగలవు” అని అంటే అమ్మ “తాతగారూ! హాస్యం చేస్తున్నారా? జోస్యం చెపుతున్నారా ?” అని అన్నది.
అమ్మ తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జీవితమంతా అన్నింటికీ ‘సరే’ మంత్రం పఠిస్తూ, కొంగుపట్టి సమయానికి ఏది వస్తే దానిని సంతోషంగా అనుభవించింది. అట్టి అసిధార వ్రతాచార తత్పర అమ్మ.
ఒక సందర్భంలో నాన్నగారితో అమ్మ, “కష్టసుఖాలు రెండూ మీమీద ఆధారపడి ఉన్నాయి. ఈ ద్వంద్వమే ప్రకృతి. ఆ ప్రకృతిని జయించడానికి మీరు ధ్యేయమూర్తులు చేసుకున్నది. ద్వంద్వంతో ద్వంద్వాన్ని జయించాలి” అని అన్నది. ఈ వాక్యం వినగానే మనకు కొంచెం ఆశ్చర్యం కల్గుతుంది. ‘ద్వంద్వాల్ని జయించడమే ద్వంద్వాతీతమైన స్థితి’ అని సాధారణంగా మనం అనుకుంటాం. కానీ అందుకు భిన్నంగా “ద్వంద్వంతో ద్వంద్వాన్ని జయించాలి” అని అన్నది అమ్మ. అమ్మది ద్వంద్వాతీత స్థితి. మరి తాను ద్వంద్వాన్ని జయించడమేమిటి ? అన్న ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఆ ప్రశ్న సాధకుల కోసం, అందుకు సమాధానం అమ్మ జీవితమే. తన వివాహం ఆధారంగా లోకంలో ఉన్న గృహిణులందరికీ ఆచరణాత్మకమైన ప్రబోధాన్ని అందిస్తోంది అమ్మ.
అమ్మ ఆ ద్వంద్వ స్థితిలో ఉన్నప్పటికీ లోకం కోసం ద్వంద్వాలను ఏర్పరచుకొన్నది. ఒక్కటే అయిన దైవీశక్తి అమ్మగా, నాన్నగారుగా రెండు రూపాలుగా దిగి వచ్చినా నిజానికి అమ్మకి మాత్రం ద్వంద్వాలు లేవు. న్నానగారితో అమ్మకు ఎప్పుడూ అభేదమే. సుఖదుఃఖాలు వేరుగా లేవనీ ఇష్టాయిష్టాలే అందుకు కారణమనీ, భర్తమీద అచంచలమైన భక్తి వలన కష్టాలు కష్టాలుగా తోచవనీ వివరించిన అమ్మకు నాన్నగారి సాన్నిధ్యమే సుఖం అని మనకు అర్థం అవుతోంది.
ఇంకొక విశేషం. ఇక్కడే అమ్మకీ మనకీ మధ్య ఒక విభజన రేఖ స్పష్టంగా గోచరిస్తుంది. ద్వంద్వాల్లో ఒక భాగమైన జయాన్ని, సుఖాన్ని, లాభాన్ని… ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, వాటికోసం పరితపిస్తాం. కానీ అమ్మ ‘బాధలు జీవితాన్ని చైతన్యతరంగితం చేస్తాయి’ అంటూ కష్టాల్నీ ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది; దుఃఖాన్నీ సంతోషంగా స్వీకరిస్తుంది. సేదదీరుస్తుంది. ఈ తత్వం ‘దుః భేష్వనుద్విగ్నమనాః సుభేషు విగతస్పృహః…’ అనబడే స్థిత ప్రజ్ఞ లక్షణం కంటే మహోన్నతమైనది. కనుకనే ఆ సాన్నిధ్యంలో దుఃఖస్పర్శ ఉండదు. కాబట్టి అమ్మ అఖండానంద రూపిణియే. అంతా సుఖమే అయినపుడు ద్వంద్వానికి అవకాశం ఎక్కడిది ? అంటే ద్వంద్వం జయించబడింది. ద్వంద్వాన్ని జయించడానికి అమ్మ ఎంచుకున్న ధ్యేయమూర్తి నాన్నగారే. నాన్నగారిని ధ్యేయంగా తనకు ధ్యాతగా అమ్మ అభివర్ణించింది. పతి సాన్నిధ్యంలో అమ్మకు సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలు లేవు; లేని ద్వంద్వాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ నాన్నగారిని ధ్యేయమూర్తిని చేసుకున్నది.
ధ్యేయమూ, ధ్యత అనే ద్వంద్వం ఆధారంగా సుఖమూ, దుఃఖమూ అనే ద్వంద్వాన్ని జయించవచ్చనీ, భర్తను దైవంగా ఆరాధించి అభేదాన్ని పొందిన స్త్రీ ద్వంద్వాతీత స్థితిని పొందవచ్చనీ ఆచరణ ద్వారా నిరూపించింది అమ్మ. అనుభవపూర్వకంగా “ద్వంద్వంతో ద్వంద్వాన్ని జయించాలి” అని అపూర్వంగా ప్రబోధిస్తోంది అమ్మ.
మనిషితో పుట్టిన స్వార్థం – మనిషితో అంతం.