(గత సంచిక తరువాయి)
అమ్మ దగ్గర అన్ని భయాలూపోయి అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకుంటారు. “అభయంకరి” అంటే దీన్నే అంటారేమో! అన్ని రూపాలూ భగవంతుడివే, అన్ని మంత్రాలూ శబ్దరూపమైన భగవంతుడే. అన్ని కాలాలూ కాలస్వరూపుడైన భగవంతుడివే. అంతటా పవిత్రత తప్ప మరేమీ లేదు. ఇవే ఆమె చెప్పే నగ్న సత్యాలు. ఈ సత్యాలను మసిపూసి మారేడు కాయనుచేసి మనుషులు బాధలు పడుతూ వుంటారు.
కొన్ని సందర్భాలలో ఆచరణలోనే ఆమె దివ్యమైన వ్యక్తిత్వం బైట పడుతూ వుంటుంది. ఒకప్పుడు దివిసీమకు తుఫానువల్ల వరదలు వచ్చాయి. ఆ తుఫాను ప్రభావం వల్లనే జిల్లెళ్ళమూడి చుట్టూ కూడ నీటి ముంపు వచ్చింది. అందరూ అమ్మ మందిరంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
చుట్టూ నీటిలో మురుగుకాలవలు కలిసిపోయి, ఆ నీరే స్నానాలకూ, వంటలకూ, త్రాగడానికి వాడవల్సిన దుర్గతి వచ్చింది – అటువంటి సమయంలో అమ్మ ఆ నీరు త్రాగలేదని ఆమెను వేరే సురక్షిత ప్రదేశానికి తీసుకుపోదామన్న అంతరంగిక భక్తుల మాటను సుతరామూ ఒప్పుకోలేదు. “ఇంతమంది నన్ను నమ్ముకుని ధైర్యంతో నా అండజేరితే నేను సుఖంగా వేరేచోటు చూసుకుంటానా” అని అంది. అన్ని హంగులూ తనకి వున్నా వెళ్ళలేదు. “వాళ్ళతో పాటేనేనూ” అని అంది. ప్రాణాపాయ స్థితిలో ఎంతమంది తాము నమ్ముకున్న నీతికి నిలబడతారు? అమ్మ తన పిల్లల్ని ఆపదలో వదలి వేరే వెళ్ళిపోతుందా? ఆమె నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా దానికే కట్టుబడి వుంటుంది. ప్రపంచంలో ఎంతో మంది మహాత్ములుగా పేరుపొందిన వారిని చూస్తూ వుంటాము. ఒక్కోసారి వారిలో కనీస మానవతా లక్షణాలైన జాలి, ప్రేమలు కొరవడుతాయి. అది చూసిన వారి అనుయాయులకు నిరాశానిస్పృహలు కలిగి (m ఒక్కోసారి ఆధ్యాత్మికత మీదే నమ్మకంవీగిపోతుంది. ఆలోపం ఆధ్యాత్మికతలో లేదు. వ్యక్తులలో వుంది. అన్ని రకాల సిద్ధాంతాలూ, మహావ్యక్తులూ, నదులు సముద్రంలో కలిసిపోయినట్టుగా అమ్మ ప్రేమాంబుధిలో కలిసి పోవలసిందే.
అమ్మ 1941 సం॥లో తన తొలి చూలుబిడ్డ సుబ్బారావును చంకనెత్తుకుని జిల్లెళ్ళమూడి కాపరానికి వచ్చింది. అప్పుడు నాన్నగారికి కరణంగా 6 రూ. నెలకు వేతనం ఇచ్చేవారు.ఆమెకు ఒక కడవ ఇచ్చారు నీళ్ళు తెచ్చుకోవటానికి. దూరాన వున్న చెరువు నుండి రోజూ నీళ్ళు తెచ్చుకునేది. సుబ్బారావుని దూలంనుంచి వేళ్ళాడతీసిన ఉయ్యాల్లో వేస్తే చూరులోంచి పాములు తొంగి చేసేవి. “నేను కష్టపడుతోందని తండ్రి సీతాపతిగారు బాధపడుతూ అన్నారు “అమ్మా జ్యోతిష్కులు నీది మహజ్జాతకం అన్నారు. నీవిట్లా కష్టపడుతున్నావే” అని. దానికి అమ్మ కష్టం అనుకోవటం లేదుగా నాన్నా! సంతోషంగానే వున్నాను కదా! మహజ్జాతకం అంటే ఇంతకన్నా ఏముంటుంది?” అంది. మహాకవి మిల్టను మహాశయుడు చెప్పినట్లు “Mind makes its own place; Heaven in the Hell and Hell in the Heaven” మనిషి మనసు నరకంలో వున్నా స్వర్గాన్ని సృష్టించగలదు. స్వర్గంలోవున్నా నరకాన్ని సృష్టించకలదు. అన్నిటికీ మనస్సే కారణం.
ఆ రోజుల్లో ఆమె జిల్లెళ్ళమూడి గ్రామస్తుల్ని ప్రతి ఇంటికి రోజూ ఒక గుప్పెడు బియ్యం చొప్పున పోగుచేయాలని కోరింది. అలా పోగు చేసిన బియ్యంతో కరువు వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టింది.
ఆమె ఐశ్వర్యంలో వుండి అన్నదానం మొదలు పెట్టలేదు. ఆమె హృదయంలో ఐశ్వర్యం వుంది. కొందరు ఐశ్వర్యం నిజంగా వున్నా మనస్సులో దరిద్రం వుండి దానం చెయ్యలేరు. మనస్సులో దరిద్రం లేకపోవటమే అమ్మ మహజ్జాతకం కనపడుతుంది.
ఇక ఆఖరి మాటలు చెప్పుతూ, ఈ వ్యాసానికి స్ఫూర్తినిచ్చింది, తమ్ముడు తంగిరాల శాస్త్రి అయితే నాచేతకలం పట్టి రాయించింది అమ్మే, ఈ మధ్య పరమహంస యోగానందగారి సంభాషణలు చదవటం జరిగింది. అందులో నేను చదివి పరవశించి కన్నీరు కార్చిన విషయాలురాస్తున్నాను. “ఇన్ని నక్షత్ర మండలాలు సూర్యుడు, భూమి సకల జీవరాసులను సృష్టించిన శక్తివంతుడైన భగవంతుడు భక్తుని ప్రేమకు బానిస. ఆయన మనిషి హృదయ కవాటం దగ్గర ప్రేమ బిక్షువులా వేచి వుంటాడట. మనిషి నేటి జీవన వేగంలోని కార్యకలాపాలలో మునిగితేలుతూ దేవుని పలకరించటానికి కాని, ఆయన గూర్చి ఆలోచించడానికి కాని టైము లేదు అంటాడట. ఆయన “నీకు టైము దొరికేవరకు ఇక్కడే వేచి వుంటాను” అంటాడట. అటువంటి ప్రేమ భిక్షుకి అమ్మ – మనహృదయ కవాటం దగ్గర వేయికళ్ళతో మనకోసం చూస్తూ వుంటుంది. మనం నెలకొక్కసారైనా సత్సంగంలో ఆమెకోసం మన హృదయ కవాటాలు తెరిచి ప్రార్ధిద్దాం. పిచ్చి అమ్మ చాలా సంతోషిస్తుంది. ఆమె చాలా అల్పసంతోషి, మన కానుకలతో పనిలేదు. మన ప్రేమలో ఒక్క బిందువు అభిషేకానికి కోరుతుంది. (విషయసేకరణ బ్రహ్మాండం వసుంధర రాసిన శ్రీవారి చరణ సన్నిధి అను డైరీ నుండి) రచన స్వతంత్రము.