లలితా సహస్రనామాలలో మొదటి నామం శ్రీమాతా….
అమ్మ అంటే తొలి అని అర్థం కదా.
అమ్మతనం కన్నా కమ్మనైనది లేదు సృష్టిలో. ఈ సృష్టిని సృష్టించిన అమ్మతనం ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే దానికి సమాధానమే విశ్వజనని…
జిల్లెళ్ళమూడిలో వెలసి సమస్త జీవులకు తల్లిగా వెలుగొందినది “అమ్మ”…
ఎన్నోమార్లు ఎన్నో సందేహ ప్రాణులకు సంపూర్ణత్వమే అమ్మ అని జిల్లెళ్ళమూడిలో వెలసిన అమ్మ నిరూపించింది. అయినా దైవత్వం అనేది మన మానవ బుద్దికి అందగలిగేదా? అది అవగతమగుట కేవలం అమ్మ కృప వల్లనే కదా సాధ్యం ఎవరికైనా….
మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదని, రాగద్వేషాలనే రెండు గ్రహాల మీద, ఆ రెంటికి ఆధారమైన “నేను” మీద అని అమ్మ సెలవిచ్చింది. ఈ నేను అంటే ఏమిటి? అని తెలుసుకోవటమే సాధన. ఈ నేను అనేది అమ్మలో చిన్నతునక అని గ్రహించి సర్వస్యశరణాగతి చెయ్యటమే కర్తవ్యం, తదనంతరం లభించేదే మోక్షం…
1950 నుంచి 1980 దశకాలలో ఎందరికో దారిచూపి ఆధ్యాత్మిక ఉన్నతినిచ్చిన అమ్మ, తెలిసిన వారికి పరిపూర్ణ పరమాత్మ అవతారం. తెలియని వారికి మాత్రం “అమ్మ”. అమ్మ ఆ విషయం గురించి చెబుతూ “నాకు శిశువులే కాని శిష్యులు లేరు” అని అన్నది. అమ్మ సంపూర్ణంగా జీవించిన జిల్లెళ్ళమూడి పరమ పావనమైన దివ్యభూమి. పూర్వకాలపు దివ్యభూమిని తిరిగి పునరుద్ధరించటానికి బహుశా అమ్మ జిల్లెళ్ళమూడిని తన లీలావిలాసం చేసుకుంది. అమ్మను జీవించి ఉండగా సేవించి, అమ్మతో అనుభవాల ప్రోగులు చేసుకున్న పెద్దలు మనకున్నారు. వారు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఆనాటి దివ్యమైన ఘడియల ఆనందం వారి కళ్ళలో, అమృతం వారి మాటలలో చిందుతుంది.
అమ్మను ప్రత్యక్షంగా చూసే సౌభాగ్యం ఈ భౌతికనేత్రాలకు కలగలేదు. బహుశా ఆనాడు ఈ జీవికి కర్మ పరిపక్వం కాలేదు కాబోలు! కాని అమ్మను సేవించి అమ్మ తత్త్వాన్ని అందిస్తున్న దివ్య హృదయాలను దర్శించే భాగ్యం కలిగింది. అయినా అమ్మ చెప్పే ఉంది కదా. “నేను దగ్గరకు తీయటం తప్ప మీరు నా దగ్గరకు రావటం లేదు” అని…. ఈ జీవిత సౌభాగ్యం పండి జిల్లెళ్ళమూడిలో ఒక రోజు గడిపి, అమ్మ ఒడిలో అల్లారు బిడ్డగా గారాలు పోయే అదృష్టం ఈ ఉపాధికి అమ్మ అనుగ్రహించిన వైనం బహు చిత్రం!!! ఇండియాకు వెళ్ళినప్పుడు లభించిన వరం!!! అయినా ఆమె లీలావిలాసం మన మానవ మేధకు అందు తుందా???
యోగుల గురించి చదివి వారి మీద వ్యాస పరంపరలు ప్రచురిస్తున్న సమయాన జిల్లెళ్ళమూడి అమ్మ గురించి కూడా కొంత సమాచారం సేకరించటము జరిగింది. ఆ ఆలోచన కూడా అమ్మ కరుణే!!! అంతకు పూర్వం అమ్మ గురించి తెలిసింది శూన్యం. అమ్మ అంటే అందరికి ఎప్పుడు వెళ్ళినా భోజనం పెట్టే అన్నపూర్ణ అని మాత్రమే తెలుసు. అన్నం పెట్టడం ఎంత ముఖ్యమైన విషయమో, ఒకసారి ప్రయాణాలలో జ్వరంతో తిండి తిప్పలు లేక రెండు రోజులు తిరిగిననాడు తెలిసింది.
సరే, అమ్మ మీద వ్యాసం కోసం సమాచారం వెతుకుతుంటే అమ్మ అన్నపూర్ణయే కాదు ఇంకా ఎంతో ఉందని తెలిసింది. అది ఎంతో అర్థమయ్యే జ్ఞానము ఆనాటికి లేదు. ఈనాడు ఉందని కాదు… పరమాత్మ నిజతత్వం ఋషులకు సైతం అగమ్యగోచరమే కదా!!! అమ్మ అంటే అపర లలితా పరాభట్టారిక అని, అనంతమని, అంతూ అడ్డు లేని పరాతత్త్వమే అమ్మ అన్న ఎరుక జిల్లెళ్ళమూడిలో కలిగింది.
పూర్వం భరద్వాజ మహర్షి వేదమంతా తెలుసుకోవాలని బ్రహ్మ కాలం (ఒక కల్పం బ్రహ్మగారికి ఒకరోజు) వంద కావాలని తపస్సు చేసి, సాధించి ఆ కాలమంతా వేదాధ్యయనానికి గడిపారట. ఆయన ఆ కాలమంతా వేదాలు నేర్చ వినియోగించినా వేదరాశి మహాపర్వతములా ఉండి కరగలేదు. దిగులుపడ్డ మహర్షికి మహావిష్ణువు బాదరాయణుడై వేదరాశిని నాలుగు గుప్పెళ్ళు ఇచ్చి ఇది నేర్చు చాలని దీవించారట. అలాగే అనంతమైన సర్వవ్యాపకమైన అమ్మ తత్త్వాన్ని పూర్తిగా తెలిసినవారెవరు?
అందునా నావంటి అల్పజీవికి ఏమి తెలుసని ఇది రాయ మొదలెట్టానని కొంత వెరుపు కలిగింది. జగదంబే సర్వస్వమని తలచి నడుస్తున్నందున ఈ నాలుగు ముక్కలు అమ్మ బిక్ష అని, అమ్మ రాయించినదని మరీమరీ మనవి చేసుకుంటున్నది ఈ జీవి.
“అంఆ” అన్న అక్షరాలే మంత్రంగా ప్రసాదించిన అమ్మను గురించి తలచిన ఏ క్షణమైనా హృదయం తపనతో ద్రవిస్తుంది. రావూరి ప్రసాద్ గారి ఇంటర్వ్యూలు అన్ని తు.చ. తప్పకుండా చూసి, జిల్లెళ్ళమూడిలో ఒక మండలం ఉండాలని, జపం చేసుకోవాలని, హైమాలయంలో ప్రదక్షిణలు చెయ్యాలని హృదయం చాలా కొట్టుకుంది. కాని, భారతదేశం వచ్చినప్పటి నుంచి ఎన్నో పనులు, మరెన్నో అడ్డంకులు.
‘ఇదేమిటమ్మా? ఈ జీవికి నీ పదాలంటే అర్హతే లేదా?’ అని వగచని క్షణం లేదు. ఒంటరి ప్రయాణాలే సాధనను ముందుకు తీసుకుపోతాయి. అందుకే ఒంటరిగా వెళ్ళి అమ్మ సన్నిధిలో కనీసం పది రోజులు లేదా కనీసం వారమన్నా గడపాలని గట్టిగా అనుకోవటం కూడా జరిగింది. అమ్మను అనుక్షణం తన సన్నిధికి వచ్చేందుకు అనుమతినిమ్మని మూగగా ప్రార్థించటము తప్ప ఏమి చెయ్యగలను?
శ్రీవారితో ప్రయాణాల వలన, కొంత గృహస్తు ధర్మ పాలన వలన ఆ కోరిక కుదిరేదిగా కనపడలేదు. పైగా “భర్తను చూసుకో, అదే నా సేవని తెలుసుకో” అని కదా అమ్మ చెప్పింది. ఈసారి కనీసం అమ్మ దర్శనం కలిగినా చాలన్న భావన కలిగింది.
పుట్టిల్లు లేని ఈ జీవివంటి ఎందరికో అమ్మ, “నేనే అమ్మను, ఇది మీ అందరిల్లని” కదా చెప్పేది!!! అందుకే పుట్టింటికి తీసుకుపొమ్మని శ్రీవారిని కోరితే, “పది రోజులుండలేము. ఒక్క రాత్రి నిద్ర చేస్తామంటే తప్పక వెళదాము” అని మనసులోని కోరికకు కొన ఊపిరినిచ్చారు.
అమ్మ అనుగ్రహము. ఇదే మహాప్రసాదం. ఈ రోజు ఒక్క రాత్రి ముందునాటికి తిరిగి వచ్చేందుకు అనుమతి అని ఆనందం కలిగింది. రాజమండ్రి పని మీద వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు విజయవాడ దుర్గమ్మను ఉదయం దర్శనం చేసుకొని గుంటూరు మీదుగా జిల్లెళ్ళమూడి వైపు సాగాము.
గుంటూరులో ఉన్న కజిన్ కం చిన్ననాటి మిత్రురాలు వాళ్ళూ బయలుదేరారు అమ్మ దర్శనానికి…
జిల్లెళ్ళమూడి వెళ్ళే దారిలో పంటపొలాలు చెట్లు కూడా స్వాగతిస్తున్నాయన్న సంతోషం కలిగింది. పొలాలన్ని కోతలయి ఉన్నాయి. కొత్త పంటలేశారేమో! హరితం అణువణువునా కనపడుతూ మనసును రాగరంజితం చేస్తోంది. వచ్చే పల్లెటూర్లు “హమ్మయ్య ఇన్నాళ్ళకు రాగలిగావా?’ అంటూ అడుగుతున్నాయి.
“త్వరగా వెళ్ళాలి అమ్మని చూడాలి” అన్న మా మాటను విని కారు నడిపే అతను “మీ అమ్మగారుంటారా ఇక్కడ?” అన్నాడు.
“మా అమ్మ, మీ అమ్మా కాదు నాయనా, సర్వులకు అమ్మ అయిన విశ్వజనని వెలసిన క్షేత్రమిది!!” అని చెప్పాము. అంతకు ముందే ఎం.కె.ఎల్ రావు గారితో చెప్పి ఉన్నందున్న, వస్తున్నామంటే మా కోసం ఒక గది సిద్ధం చేసి ఎదురుచూస్తున్నారు శ్రీ AVR సుబ్రహ్మణ్యం గారు,
జిల్లెళ్ళమూడిలో ప్రవేశించగానే అమ్మ ఒడిలోకే వచ్చేసినంత హాయి. సుబ్రహ్మణ్యం గారు ఎంతో అప్యాయంగా ఎదురు వచ్చి మమ్మల్ని అన్నపూర్ణాలయం తీసుకుపోయారు.
మాకు సుష్టుగా భోజనం పెట్టించారు. ఎందరో పెద్దలు చెప్పినట్లుగా ఆ ఆహారం ఎంత రుచో! వర్ణించ ఈ నాలుక వశమా? తదనంతరం మమ్మల్ని “వాత్సల్యాలయం” తీసుకొని పోయారు.
దివ్యప్రదేశం అమ్మ నడయాడిన క్షేత్రం. నేల ఆ తలుపులు, ఆ మెట్లు అమ్మ స్పర్శను తనలో ఇముడ్చుకొని మాకందించాయి. అది అచ్చంగా అమ్మ ఒడి. ఎన్నో యుగాల తపస్సు ఫలితంగా ఆ పవిత్ర ప్రాంగణములోకి అడుగుపెట్టి అమ్మ కూర్చున్న మంచం వద్ద కూర్చొని, సుబ్రమణ్యం గారు ఆనందంతో చెబుతుంటే ఆనాటి విషయాలు, మా హృదయంలో తడిని కనురెప్పల క్రింద అదిమి, అమ్మా! అమ్మా!! అని శరణఘోషతో వినటం ఒక మరువలేని మరపురాని అనుభవం. ఆ ప్రదేశం అణువణువు అమ్మ పాదధూళి పొంది ధన్యత చెందింది.
వారు “అమ్మ ఇక్కడ కూర్చొని మాట్లాడేది. ఇదిగో చూడండి అమ్మ ఇక్కడే ముఖం కడుక్కొని తదనంతరం తన మంగళసూత్రాలు తీర్థం త్రాగి “నాన్నా! ఈ తీర్థమేరా మీ అందరికి తీర్థానివ్వగలుగుతోంది” అంటూ వారు భావావేశంతో చెబుతుంటే ఆ ఘటన కళ్ళ ముందు చిత్రంలా ప్రత్యక్షమయింది.
అమ్మ పాదాలు పెట్టుకునే పీట మీద తల ఉంచి ‘అమ్మా! నీవు లలితా పరాభట్టారికవు. మా అమ్మవు. నా హృదయంలో నీ నామం ఆగకూడదు. అలా వరమివ్వమని మరీ మరీ తలచి ఆ మధురమైన ఆలయంలో తలుపులను, పీటలను తాకి ఆ స్పర్శలో అమ్మను వెతుక్కున్నాము.
వారు అమ్మను కలిసినప్పటి సంగతులు చెబుతూ ఉంటే ఆయన కళ్ళ ముందు ఆనాటి దృశ్యం కదలాడినదేమో! మాకు మాత్రం అవి చలనచిత్రంలా కనబడుతూనే ఉంది. ‘అమ్మను చూసి, సేవించిన ధన్యజీవి వీరు’ అని మనసులో ఒక ఆనందం, నేను అమ్మను సశరీరంతో చూడలేదే అన్న ఈజన్మ మీద కోపం, దుఃఖం ముప్పిరిగొన్నాయి. వారు మమ్మల్ని మాకు కేటాయించిన గది దగ్గర వదిలి విశాంత్రి తీసుకోమని చెప్పి వెళ్ళారు. సాయంత్రం దేవాలయానికి వెళ్ళాలి. అమ్మను, హైమక్కను చూడాలి. అదే తరువాత కార్యక్రమం.
మా కజిన్ వాళ్ళు వచ్చారు. వారు భోజనం చేసి వచ్చాక కూర్చున్నారు. ఇంతలో కామరాజుగారు వచ్చారు. వారు ప్రధాన కార్యదర్శి. వారు వచ్చిన తరువాత అమ్మ గురించి ఎన్నో వివరాలు చెప్పారు. వారు చెబుతున్నంత సేపు అదో దివ్యలోకాల అనుభవము కలిగింది. ఆఫీసులో అమ్మ క్యాలెండర్, ఫోటోలు ఇచ్చారు. ఆనాటి సాయంత్రం అమ్మ దేవాలయానికి వెళ్ళాము. అమ్మ సహస్రనామ పూజ జరుగుతోంది. సుబ్రహ్మణ్యంగారు, కామరాజుగారు వచ్చారు. పూజ ముగియకుండా గుంటూరు వెళ్ళిపోతామంటే, కొద్ది సేపు ఉండి ప్రసాదం తీసుకు పొమ్మని చెప్పారు.
పూజ జరుగుతున్నంత సేపు హృదయపు లోలోపల ‘అమ్మా!’ అంటూ లేగదూడలా కేకలు వేస్తున్న మానసాన్ని నిలువరించ లేకపోయాను. అమ్మకు నాన్నగారికి వస్త్రాలు తీసుకువెళ్ళాము. పసుపు గాజులు తాంబూలముతో అమ్మ పాదాల వద్ద ఉంచమన్నారు. ఆ విధంగా చేసి పూజను చూస్తూ గడిపాము. పూజ అనంతరం పెద్దలు, అక్కడ ఉన్న పెద్ద ముత్తైదువగారిచే చీర, శ్రీవారికి పంచె ఇప్పించారు. పూజారి గారిచే ఆశీర్వచన సహితముగా.
అంత వరకు రెప్పల మాటుగ దాగిన కన్నీరు, కట్టతెగిన గోదారిలా ఉప్పొంగాయి. హృదయాంతరాల నుంచి అమ్మమీద ఉన్న తపన, భక్తితో లోలోపలి సర్వకర్మలను ప్రక్షాళనం చేస్తూ వెక్కి వెక్కి అమ్మ పాదాలకు అభిషేకించాము. వారు మాతో “ఇక్కడికి వచ్చిన వారు ఇలా కరిగి కన్నీరవటము మాములే” అన్నారు. అవును మరి. అమ్మను చూసిన పిల్లలు ఎవ్వరైనా శాన్నాళ్ళ తపనను దాచటం కుదరని పని. అమ్మ విశ్వజనని. సర్వ చరాచరాలకు మాత ఆమె. స్వయంగా లలితా పరాభట్టారిక మానవ రూపం దాల్చి వస్తే… అది అమ్మే. మరొటి లేదు. ఈ జీవికి ఆవిషయం అప్పటి వరకు తెలియదు…
సో. కామరాజుగారు, సుబ్రహ్మణ్యంగారు ఎంతో ఆదరణ చూపారు. అచ్చంగా పుట్టింట్లో ఆడపిల్లను చూసినట్లే ఉంది వారి ఆదరణ. వారి ప్రేమ, అప్యాయతలను ఏ కొలమానంతో చెప్పగలము?
నిఖార్సైన ప్రేమను అందిస్తూ అమ్మను తమలో ప్రతిష్టించుకొని, అక్కడకు వచ్చే మా వంటి భక్తులకు పంచే జిల్లెళ్ళమూడి పెద్దలకు మేము ఇవ్వగలిగినది ఏముంది? హృదయపూర్వక పాదాభివందనాలు తప్ప.
ఆ రాత్రి అమ్మ పూర్ణాలయంలో పిల్లలతో పాటు భోజనం చెయ్యటం మరో గొప్ప అనుభవం. పిల్లలు అన్నపూర్ణ అష్టోత్తరం చదివిన అనంతరం మేము వారితో కుంకుమ కలిసి ప్రసాదం తీసుకున్నాము.
అమ్మ ఇచ్చిన చీరలో మరునాటి ఉదయం దర్శనానికి రమ్మని చెప్పారు పెద్దలు. సరేనని ఉదయమే ఆ చీర కట్టుకొని నేను, పంచెలో శ్రీవారు అమ్మ దర్శనానికి వెళ్ళాము. అమ్మకు అభిషేకమయింది. మాకు దర్శనం, ప్రసాదం ఇప్పించారు. అక్కడ జరుగుతున్న అఖండ నామములో కొంత సేపు ఉండి. గొంతు కలిపి అమ్మను నోరారా తలచి ధన్యమయినాము..
అమ్మ పెద్దకోడలు శేషుగారు కలవటం తేజోమూర్తి మామయ్య ద్వారా చుట్టరికం, అమ్మ మాకు పెద్దమ్మ కావటం ఎంత యాదృచ్ఛికమో!! అయినా అమ్మ “అమ్మల గన్న అమ్మ చాలా పెద్దమ్మ” గా అన్న తెలివి వెలిగింది. ఒడి నింపి, హృదయభారం తీసి మమతలతో హృదయం నింపి పుట్టింటి నించి సాగనంపారు పెద్దలు అమ్మ తరపున. అమ్మ ఆదరణ నేటికి జిల్లెళ్ళమూడిలో లభ్యం. అమ్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తలిస్తే Atlanta లో నైనా కళ్ళలోకి వచ్చి ఆదరణ చూపుతుంది.
నడక నేర్చుకుంటున్న పిల్లలను చేయి పట్టుకు నడిపించినట్లుగా, సదా ప్రక్కనుండి నడిపిస్తుంది.
అమ్మ అంటేనే అతి కరుణ.
ఆ తల్లిని కోరవలసినదేముంది?
“అమ్మా నీ పాదాల మీదనుంచి ఈ జీవి ఎరుకను కదలనివ్వకు. అజ్ఞానం మా లక్షణం. అయినా అక్కున చేర్చుకునే అమ్మవు నీవు. నీకు సదా వినమ్ర శతసహస్ర వందనాలు” అంటూ శరణాగతి చూపటం/ కోరటం తప్ప!!!