“నేను అంటే అనసూయను మాత్రమే కాదు. నేను అంటే అందరిలో ఉన్న నేనునే!” అంటున్న అమ్మ తన గురించి తాను చేసిన వ్యాఖ్యలు భారతీయ తత్వంలో ఇమిడిన మూల సూత్రాలే! దేహాత్మ భావన నశించి, ఆత్మ… సాక్షాత్ ఆకారంగా సంచారం చేయడం పురాతన కాల సంబంధి. ఆత్మ నిష్ఠనెరిగిన మహాత్ముల మాటలన్నీ బహుసరళంగా అనిపించినా, ఆ అక్షరాల వెనుక దాగినదంతా పరమార్థ చింతనను ప్రబోధించే మహా పరిసత్యమే. ఒక్కొక్క వాక్యము, కావ్య సమానంగా పరిమళించే గంభీర ముద్రే, వినగా, అనుకోగా మాటల వెనుక దాగిన మహాతత్వం సాధకుణ్ణి ఆలోచనాసక్తుణ్ని చేస్తుంది. పైకి కనబడుతున్న ప్రతి దాని వెనుకా, కంటికి కనిపించనిదేదో ఉన్నది. దాన్ని శక్తి అనుకున్నా… వాణ్ణి కర్త అని భావించినా… అంతర్వాహిని అని సంభావించినా… నిజానికి అదే ప్రేరకం, అదే కారకం!
ఈ నేపథ్యంలో లోక విద్య ఎరుగని, సర్వ విద్యలకు మూలశక్తి అయిన అమ్మ చిలికిన ఒక్కొక్క వాక్యం, విభూతి తుల్యం, సానందం, ఆలోచనామృతం, ఆపాతమధురం. తనను గురించి తాను అమ్మ పలికిన మాటలన్నీ సాగర గంభీరాలు, తాత్త్విక భూమికలు. అర్థం చేసుకోగలిగితే! “నా జీవితం అనంతం, అఖండం, అచ్యుతం. కానీ నా సంచారం పరిమితం!” అంటే ఏమిటి? పరిణామ ప్రధానమైన దేహచారణం, ఒక చిన్న పరిధి. సామాన్య జీవుడు అనుభవించే అన్ని స్థితులూ అందులో ఉంటయ్. పైకి చూస్తున్నప్పుడు ఏ ప్రత్యేకతా వుండదు. జీవితం అనగానే పైకి పరిమితంగా కనిపిస్తున్నా, అది పరిమితం కనుక, జీవుడుగా, దేహంగా, ఎన్నో జన్మల అనంతరం సైతం, మూలస్థితి మార్పెరుగనిది. కనుక అది అనంతం. ఎన్నో మార్పులు, కూర్పులు, చేర్పులు! ఇదే సత్యం!
అనుగ్రహం, దయ, వాత్సల్యం, ప్రేమ తప్ప మరొక భావననెరుగనిది తల్లి. తల్లి రక్షిస్తుందే తప్ప శిక్షించదు. తల్లిని చూడటానికి బిడ్డలు వస్తారు. కానీ ఎక్కడ ఉన్నా, తల్లి బిడ్డల్ని చూస్తూనే ఉంటుంది. దూరం నుండి చూస్తూ మీనాక్షిగా, విశాల దృక్పథంతో విశాలాక్షిగా, అంతరంగాలలో వెల్లువెత్తే అనంత భావతరంగాలను సాక్షిగా చూస్తూ సాక్షీ స్వరూపిణిగా తల్లే తొలిగా ఉండటం.
సృష్టి గర్భంలోని జీవుల వెలుగులన్నీ తల్లి గర్భంలో నిస్వనాలై, ఆ వెలుగులే వేదనలై, సంవేదనలై, నివేదనలై, వెలుగువైపు నడిపిస్తయ్. కనుకనే జీవుల తొలి అడుగులు, ఆనందానుభూతుల మడుగులు, అన్నీ తల్లితోనే ముడిపడి ఉంటయ్. సర్వం సహా చక్రవర్తికీ తల్లే మూలం. అందువల్లనే అమ్మ నిలిచిన ప్రదేశం ఆశ్రమం కాదు, ఆశ్రయం. ఆమె సంచారం చేసిన స్థలం కారణ స్థలం, ప్రేరణ స్థలం, పేగు బంధాలు నినదించిన స్థలం. ఆకలైన వారు, ఆకలి ఎరుగని వారు, నలిగిన వారు, కలిగిన వారు సోదరభావాన్ని ఆర్ద్రంగా, అనుభవించిన అనుభవ క్షేత్రం జిల్లెళ్ళమూడి! అది అందరిల్లు! వసుధైక కుటుంబం! అమ్మ అందరి అమ్మ!!
(19 ఫిబ్రవరి 2020 ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)