(గత సంచిక తరువాయి)
1962 నుంచి 1965 వరకు కాకినాడ పాలిటెక్నిక్ లో చదివాను. మా నాన్నగారు తెనాలి దగ్గర కొల్లూరులో పనిచేస్తుండగా 1963 జూన్ 12న మా అమ్మగారు అంతలో ఐక్యమయ్యారు. ఆ తర్వాత నుంచి కాలేజి సెలవుల్లో కన్నతల్లి లేదు కాబట్టి వీలైనంత వరకు ముందు జిల్లెళ్ళమూడిలో కొన్ని రోజులు ఉండి వెళ్ళేవాడిని.
1964 లో దసరా సెలవలు ముందు రాత్రిపూట చాలాసేపు టెక్నికల్ డ్రాయింగ్ లు వేయాల్సి వచ్చింది. కొన్ని రోజులకి పొద్దున్నపూట విపరీతమయిన తలనొప్పి వచ్చేది. డాక్టర్ గారు అది సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల అని, రాత్రిళ్ళు ఆవిరిపట్టి పెందరాళే నిద్ర పొమ్మన్నారు. అప్పుడు సెలవులు రావడంతో అమ్మ దగ్గరకు వెళ్లాను. ఆ సాయంత్రం అమ్మతో, “అమ్మా! రోజూ బాగా తలనొప్పి వస్తోంది” అన్నాను. అమ్మ గజేంద్రమ్మ అక్కయ్యని పిలిచి, “వీడికి ఆవిరి పట్టించు” అన్నారు. అక్కయ్య ఆవిరి పట్టించి వేడి నీళ్లతో తలస్నానం చేయించింది
ఆరాత్రి హాయిగా నిద్ర పట్టింది. నాకు గుర్తున్నంతవరకు తలనొప్పి మళ్లీ రాలేదు. అంతే కాకుండా ఆవిరి పట్టాక వేడినీళ్ల తలస్నానం చెయ్యాలని అప్పుడు తెలిసింది .
అమ్మ నన్ను చాలాసార్లు విపత్కర పరిస్థితిలు నుంచి కాపాడింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. 1965లో హైదరాబాద్ చేరి ఉద్యోగంలో స్థిరపడ్డాను. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లెళ్ళమూడి వెళ్ళడం మహదానందంగా ఉండేది, ఉంటోంది, ఉంటుంది.
1975 జూన్ లో గుంటూరులో నా పెళ్ళి జరిగింది. పెళ్లి ముందు అమ్మచేత పెళ్ళికొడుకుని చేయించుకోవడానికి జిల్లెళ్ళమూడి వెళ్లాను. అమ్మ చిన్నకోడలు శ్రీమతి వైదేహిగారి చెల్లిపెళ్లి కూడా నా పెళ్ళిరోజే జిల్లెళ్ళమూడిలో జరగనుంది.
అమ్మ నాకు బొట్టుపెట్టి తలకి నూనెరాసింది. తర్వాత తలంటుస్నానం కోసం ఆగమంది. నేను ఆరోజు సాయంత్రం లోపల గుంటూరు చేరాలి. కానీ, ఎంతసేపైనా స్నానంకి వెళ్ళమని చెప్పడం లేదు. ఎందుకో నాకు అర్ధం కాలేదు.
కొన్ని గంటల తర్వాత వైదేహిగారి తల్లిదండ్రులు, పెళ్ళిబృందం వచ్చారు. వారితో వచ్చిన పనివాళ్లచేత అమ్మ నాకు నలుగు పెట్టించి తలంటు స్నానం ఏర్పాటు చేయించారు. అమ్మ నన్ను ఆగమని ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది. తర్వాత నాకు బట్టలు పెట్టి, ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళమని ఆదేశించింది .
పెళ్లి అయిన తరువాత నా శ్రీమతి, మా నాన్నగారు అక్కయ్యలతో సహా అమ్మ ఆశీస్సులు కోసం జిల్లెళ్ళమూడి వెళ్లాను. అమ్మ మమ్మల్ని ఆశీర్వదించి బట్టలు పెట్టింది.
40 సంవత్సరాలు హైదరాబాద్ (బాలానగర్) లో ఉన్న హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పని చేసి 2006 లో పదవీ విరమణ పొందాను. తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం ఆఫర్ చేశాయి. కానీ, నాకు ఏవైనా సేవా కార్యక్రమాలు చెయ్యాలని ఉంది. అమ్మ దయవల్ల బంధు మిత్రులు కొందరు ఆస్పత్రిలో ఉన్నప్పుడు సేవ చేసే అవకాశం లభించింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం జనవరిలో జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి వారు నిర్వహించే స్టాల్లో కూడా నా శక్తికొద్దీ సేవచేసే అవకాశం లభించింది.
2011లో దివంగత వఝ ప్రసాద్ అన్నయ్య గారు అధ్యక్షులుగా ఏర్పడిన అమ్మ సేవాసమితి కార్య వర్గంలో చేరి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించే అదృష్టం కలిగింది. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాల నిర్వహణలో పాల్గొంటున్నాను. అమ్మలో ఐక్యం అయ్యే వరకు సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ప్రసాదించమని అమ్మని సదా వేడుకుంటున్నాను
(ఇంకా ఉంది)