(గత సంచిక తరువాయి)
1962 లో అమ్మ చీరాల దగ్గర వాడ్రేవుకి వెళ్ళి చీరాలలో ఒక కాలేజి ఆడిటోరియంలో రోజూ ప్రజలకోసం దర్శనం ప్రసాదిస్తూ ఉండేవారు.
ఆ సమయంలో మా అమ్మగారు, మేమూ చీరాల వెళ్ళాం. 1945 నుంచి 1952 వరకు అప్పికట్లలో మా నాన్నగారి దగ్గర హాస్పిటల్లో పనిచేసిన చక్రపాణి (చక్రి) మమ్మల్ని కలవడానికి కాలేజి ఆడిటోరియం దగ్గరకి వచ్చారు. మా అమ్మగారితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. మొదటి నుంచి ఆయన్ని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మా తల్లిదండ్రులు చూసేవారు. అందువల్ల ఆయన కూడా మేం ఏ ఊర్లో ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. మేమంటే అంత అభిమానం ఆయనకి. ఆయనకి మా నాన్నగారు ఇంజెక్షన్ చెయ్యడం, అవసరమైన వారికి మందులు ఇవ్వటం నేర్పారు. తర్వాత కాలంలో అప్పికట్ల వాసులుకి ఆయన ఒక డాక్టర్ అయిపోయారు. అందరూ ఆయన్ని డాక్టర్ చక్రపాణి అనేవారు.
1966 లో నేను, మా రాధన్నయ్య, శాస్త్రి అన్నయ్య జిల్లెళ్ళమూడిలో ఉన్నామని తెలిసి మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఒక గంట మాతో ఉండి, వెళ్లబోతుంటే “చక్రీ! అమ్మ దర్శనం చేసుకుని వెళ్తువుగాని” అని అమ్మ దగ్గరకు తీసుకు వెళ్ళాను.
అమ్మ అప్పుడు అఖండ నామం జరుగుతున్న చోట దర్శనం ఇస్తున్నారు. మేము ఇద్దరం కూర్చున్నాక “అమ్మా ! ఈయన చక్రి. అపికట్ల నుంచి వచ్చారు ” అన్నాను..
అమ్మ, ” తెల్సు నాన్నా. చీరాలలో కాలేజి ఆడిటోరియం దగ్గరకి వచ్చాడు కదా” అన్నారు.
అప్పటి వరకు అమ్మకి నమస్కారం కూడా చెయ్యని చక్రికి అమ్మ అన్న మాటతో దిగ్భ్రాంతి కలిగింది. వెంటనే నాతో, ” ఇదేంటి రామూ ! చీరాలలో నేను అమ్మని అసలు చూడలేదు. మిమ్మల్ని కలసి వెళ్ళిపోయాను. అలాంటిది అమ్మ నన్ను చూశానంటుంది . నాకు ఎందుకో ఇక్కడి నుంచి వెళ్ళబుద్దికావడం లేదు. ఇక నుంచి అమ్మ దర్శనార్థం తరచూ వస్తాను.” అన్నారు. అప్పటి నుంచి అమ్మ దర్శనార్థం తరచూ వస్తూ అవసరమైనప్పుడు అమ్మకి ఇంజెక్షన్ కూడా చేసేవారు. రామకృష్ణ అన్నయ్య, గోపాల్ అన్నయ్య అప్పికట్ల వారు అవడం వల్ల ఆయనకి జిల్లెళ్ళమూడితో అనుబంధం మరింత బలపడింది.
అనూహ్య అవకాశం
1963 జూన్ 12న మా అమ్మగారు అమ్మలో ఐక్యం అయ్యారు. కార్యక్రమాలు అన్నీ అయ్యాక కాకినాడ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదవడానికి వెళ్ళే ముందు జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ దగ్గర ఆరోజు ఎవరూ లేరు. నేను వెళ్ళగానే అమ్మ, “నాన్నా, మీ అమ్మ పోయిందని దిగులు పడకు. ఈ అమ్మ ఎప్పుడూ ఉంటుంది.” అని నన్ను ఓదార్చింది.
అంతలో అన్నపూర్ణాలయం నుంచి నివేదన వచ్చింది. ఆ పళ్ళెం తీసుకుని ఆ నివేదన అంతా అమ్మ నాకు తినిపించింది. అమ్మ తినిపించిన కాకరకాయ కూర మాత్రం ఇప్పటికీ గుర్తుండి పోయింది. ఆరోజు రాత్రి పడుకునే ముందు అమ్మకి నమస్కారం చేసుకుందామని వెళ్ళాను. అమ్మ పడమర వైపు ఉన్న గదిలో పడుకునేవారు. రాత్రిళ్ళు అమ్మ దగ్గర ఎవరో ఒకరు ఉండి అమ్మకి విసనకర్రతో విసురుతూ, అమ్మకి ఏదైనా అవసరమైతే చూసేవారు. నేను వెళ్ళినప్పుడు ఎవరూ లేకపోవడంతో అమ్మ మంచం దగ్గర కూర్చుని గాలి విసురుతూ నిద్రలోకి జారిపోయాను.
మధ్య రాత్రిలో మెలుకువ వచ్చి చూస్తే అమ్మ మంచం మీద లేరు. దక్షిణంవైపు తలుపు తీసి ఉంది. గమ్మున లేచి బైటికి వెళ్తే అమ్మ తర్వాత కాలంలో కట్టిన నవనాగనాగేశ్వర ఆలయం వైపు చూస్తున్నారు. “ఏమైంది అమ్మా ?” అని అడిగితే మాట్లాడకుండా గదిలోకి వచ్చి పడుకున్నారు. నాకు కూడా కాసేపటికి నిద్ర పట్టేసింది. తెల్లవారాక నేను బైటికి వెళ్ళిపోయాను.
ఈ సంఘటన ప్రస్తావించడానికి కారణముంది.
1961 లో నేను అమ్మ దగ్గరకు వెళ్తున్నప్పుడు రామకృష్ణ అన్నయ్య, గోపాల్ అన్నయ్య, అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య అమ్మ దగ్గర రాత్రుళ్ళు ఉండేవారు. అది చూసి నాకు మనసులో అమ్మ దగ్గర వీళ్ళే ఎందుకు ఉండాలి? నేను ఎందుకు ఉండకూడదు?” అనే ఆలోచన వచ్చింది. 15 ఏళ్ల వయసులో నాకు అటువంటి ఆలోచన రాకూడదు. రాత్రుళ్ళు అమ్మ దగ్గర ఉంటే ఏ సేవ చెయ్యాలో కూడా తెలీని వయసు.
అనూహ్యంగా 1963 లో అమ్మ నాకు అవకాశం ఇచ్చి నాకు అర్హత లేని ఆలోచనలు రాకూడదని ఒక పాఠం చెప్పిందనిపిస్తుంది. ఆరోజు నుంచి నా జీవితంలో మళ్ళీ అలాంటి ఆలోచన చెయ్యలేదు.
(ఇంకా ఉంది)