2012 ఆగష్టు వరకు అమ్మ సేవాసమితి బ్యానర్ మీద అన్న వితరణ / వస్త్ర వితరణ అని ఉండేది. 2013 అక్టోబర్లో జరగబోయే జగత్పిత శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి శత జయంతి లోపల ఆంధ్ర ప్రదేశ్ లో 100 చోట్ల అన్న ప్రసాద వితరణలు జరగాలని, అందులో హైదరాబాద్ లో 20 చోట్ల జరపమని శ్రీ విశ్వజననీపరిషత్ వారు కోరారు. దానికి ప్రేమార్చన అని ఒక అద్భుతమైన నామకరణం చేశారు.
అప్పటికి మాకు 10కి మించి అనాథ, వికలాంగుల, వృద్ధ ఆశ్రమాలు (అవి కూడా 2008లో అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవం సందర్భంగా తెలిసినవి) లేవు. నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ దగ్గర రోగికి సహాయకులుగా వచ్చిన వారికి పులిహోర పొట్లాలు పంపిణీ కూడా జరిపాము.
కొత్త ఆశ్రమాలు గురించి తెలుసుకోవటానికి నేను నా బంధు మిత్రులతో సమితి చేస్తున్న ప్రేమార్చనల గురించి చెప్పేవాణ్ణి. దానివల్ల రెండు ఉపయోగాలు కలిగాయి:
- కొత్త ఆశ్రమాలు గురించి తెలుసుకోవడం 2. ప్రేమార్చన కోసం ధన సహాయం లభించడం.
అప్పట్లో Facebook, Whatsapp లాంటి సోషల్ మీడియా లేదు. అందువల్ల ఈమెయిల్ ద్వారా ప్రేమార్చనల ఫోటోలు ప్రచారం చేశాను. దానివల్ల కొందరి నుండి ధన సహాయం లభించింది.
ఈ ప్రేమార్చనలు సక్రమంగా జరగడానికి తమ ఆర్థిక సహాయంతో సమితికి వెన్నుదన్నుగా నిలిచారు మాన్య సోదరులు శ్రీ భమిడిపాటి వెంకటరామశాస్త్రి గారు. సంవత్సరంలో కనీసం ఐదు ఆరు వారి కుటుంబ సభ్యులు పేరున చేయించేవారు, ఇప్పుడు కూడా వారు సంవత్సరానికి ఏడెనిమిది ప్రేమార్చనలు చేయిస్తున్నారు.
ప్రతి సంవత్సరం జనవరి 1నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలో జరిగే All India Industrial Exhibitionలో అమ్మ సేవాసమితి వారి Stall 40 రోజులు నిర్వహిస్తారు. వీలైనంత ఎక్కువ రోజులు ఆ స్టాల్లో సేవ చేసే వాణ్ణి.
కరోనా వల్ల 2020, 2021 సంవత్సరాలలో ఎగ్జిబిషన్ జరగలేదు.
2022 జనవరిలో వఝ ప్రసాద్ అన్నయ్య అమ్మ ప్రసాదం వీలైనంత మందికి అందాలని ఒకరిని స్టాల్ నిర్వహణ కోసం నియమించి అమ్మకి ధూప దీప నైవేద్యాలు సమర్పించి సందర్శకులకు పులిహోర ప్రసాదం వితరణ చేయించారు.
ఆ సంవత్సరం ఇంకా పూర్తిగా నిర్మూలన కాని కరోనా వల్ల ఎవరమూ గుంపుల్లోకి వెళ్లే చొరవ తీసుకోలేదు.
వఝు ప్రసాద్ అన్నయ్య 2021 సెప్టెంబరులో ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. కరోనా నిబంధనలు తగ్గినా మేము ఎవరమూ (అందరూ 70 ఏళ్లు పైబడిన వారు కనుక) ప్రేమార్చనల నిర్వహణకు వెళ్ళనవసరం లేకుండా మాకు అప్పటి వరకు పరిచయమున్న 12 అనాథ ఆశ్రమాలకు, 6 వృద్ధ ఆశ్రమాలకు తలా ఒక సేవా సమితి బ్యానర్, అమ్మ ఫొటో పంపి వారే ప్రేమార్చన నిర్వహించుకునేలా ప్రోత్సహించారు. ఆశ్రమ వాసులు చేత అమ్మ నామం చేయించడానికి నిర్వాహకులకు అమ్మ నామం ఆడియో పంపారు. ప్రేమార్చనప్పుడు అమ్మకి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, అంతేవాసులు చేత అమ్మ నామ సంకీర్తన చేయించడానికి తగిన సలహాలు ఇచ్చారు.
ప్రేమార్చన చేసి ఆశ్రమ నిర్వాహకులు ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో పంపించేవారు. అవి మేము దాతలకు షేర్ చేసే వాళ్ళం. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగిస్తున్నాం.
ఈ సౌలభ్యం సమకూర్చిన కరోనా దేవతకి నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
(సశేషం)