(గత సంచిక తరువాయి)
108 కోట్ల అమ్మ నామ జపం ! 2023లో జరపబోయే అమ్మ శత జయంతి లోపల 108 కోట్ల అమ్మ నామం చేసి అమ్మకి సమర్పించాలని శ్రీ విశ్వజననీ పరిషత్ నిర్ణయించింది.
రోజువారీ జపసంఖ్య రాసుకోవడానికి అనువైన ఒక పుస్తకం కూడా పంపిణీ చేశారు.
తదనుగుణంగా జూలై 2014 నుంచి నా శక్తి కొలదీ అమ్మ నామం చేసుకోవడం ప్రారంభించాను.
అమ్మ నామం చేసుకోవడానికి ప్రత్యేక నిబంధనలు ఏమీ లేవు కాబట్టి పనిమీద వెళ్తున్నా కూడా అవకాశాన్ని బట్టి నామం చేసుకునేవాణ్ణి.
అమ్మ నామ జపం చెయ్యడం వల్ల నాకు కలిగిన కొన్ని ముఖ్యమైన అనుభవాల్ని మీతో పంచుకుంటాను.
అనుభవం -1
2019 ఆగష్టులో హైమాలయంలో 11 రోజులు ప్రదక్షిణలు చెయ్యాలని జిల్లెళ్ళమూడిలో ఉన్నాను.
11 రోజుల ప్రదక్షిణలు, వీలునిబట్టి హైమాలయంలో, అనసూయేశ్వర ఆలయంలో అభిషేకాలు దివ్యంగా జరిగాయి. 12 వ రోజు రాత్రికి హైదరాబాద్ ప్రయాణంకి బాపట్ల నుంచి రాత్రి 10 గంటలకి వెళ్ళే చెన్నై – హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి రిజర్వ్ చేసుకున్నాను. ఆ రోజు అర్చన చేసుకుని ఆ ప్రసాదం గుంటూరులో ఉన్న నా బాల్య మిత్రుడు, నాతో 1961 మార్చిలో అమ్మ ప్రథమ దర్శనం చేసుకున్న P.V. చలపతికి ఇవ్వాలని సాయంత్రం 4 గంటలకి జిల్లెళ్ళమూడి నుంచి బయలదేరాను. బాపట్లలో బస్ ఎక్కి గుంటూరు వెళ్ళేసరికి 6.30 అయింది. మళ్లీ కనీసం 8 గంటలకి బస్ ఎక్కి బాపట్ల చేరకపొతే ట్రైన్ అందుకోలేను.
చలపతి ఇల్లు చేరి ప్రసాదం ఇచ్చేసి మంచి నీళ్ళు మాత్రం తాగి బస్ స్టేషన్ చేరాను . 8.30 కి గాని బస్ దొరక లేదు. ఇంక నాలో ట్రైన్ అందదేమోనని ఆందోళన మొదలైంది. అయినా చేసేది ఏమీ లేదు.
అమ్మ నామం చేసుకుంటూ, ట్రైన్ వెళ్లిపోతే హైదరాబాద్ ఎలా చేరాలి అని ఒకపక్క ఆలోచించుకుంటూ అమ్మ మీద భారంవేసి నామం చేస్తున్నాను. బాపట్లకి సరిగ్గా 10 గంటలకి చేరాను. అంటే, ట్రైన్ దొరికే అవకాశం సన్నగిల్లింది. ఆటోలో స్టేషన్ చేరి సామానుతో పరుగెత్తాను. పైగా బాపట్లలో బ్రిడ్జి ఎక్కాలి. నాకింక ఏడుపు ఒకటే తక్కువ. స్టేషన్ మాస్టర్ని “హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందా సార్ ?” అని అడిగాను.
ఆయన, “అరగంట ఆలస్యంగా వస్తుంది” అన్నారు. అప్పుడు ఊపిరి పీల్చుకుని ఉద్వేగం భరించలేక అమ్మ పాదాలకి కన్నీటితో అభిషేకం చేసుకున్నాను. అప్పుడు స్థిమిత పడ్డ మనసుతో ట్రైన్ వచ్చేదాకా మనసారా అమ్మ నామం చేసుకున్నాను.
(సశేషం)