1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ అన్నప్రసాదవితరణ కార్యక్రమం – పార్వతీపురం సప్తశతదినోత్సవ వేడుక – నివేదిక

అమ్మ అన్నప్రసాదవితరణ కార్యక్రమం – పార్వతీపురం సప్తశతదినోత్సవ వేడుక – నివేదిక

G. Chinnam Naayudu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

ప్రేమావతారిణి – విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ ఏరి కోరి వచ్చి చేరిన పుణ్యభూమి పార్వతీపురం. అమ్మ సంకల్పంతో పురుడు పోసుకున్న సంస్థ జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి. అమ్మ అపారకరుణతో, అవ్యాజమైన ప్రేమతో, అమ్మ ఆశీస్సులతో కొనసాగుతున్న యాగం నిరతాన్న ప్రసాద వితరణ కార్యక్రమం. పార్వతీపురం ఆగష్టు 6, 2021న ప్రారంభమై అమ్మ అన్నప్రసాదవితరణ కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా, పెరిగి ఆశేష ప్రజాదరణ పొందుతూ అమ్మ కుటుంబ పార్వతీపురం సభ్యుల విశేష కృషితో రోజూ వందలాది మంది ఆకలి తీరుస్తూ తేదీ 06-07-2023 నాటికి నిర్విఘ్నంగా, నిరంతరాయంగా 700 రోజులు పూర్తిచేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మ కుటుంబ పార్వతీపురం సభ్యులు, పార్వతీపురం పట్టణంలోని A.P. N.G.O. Home సభాభవనంలో ఎంతో ఉత్సాహంగా “అమ్మ ప్రసాద వితరణ కార్యక్రమం – సప్తశత దినోత్సవం (700 రోజుల పండుగను) జరుపుకొని యింత చక్కని సువర్ణావకాశం కల్పించిన జగజ్జనని – అమ్మకు కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పించుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులందరూ సపరివార సమేతంగా సాయంత్రం 5 గంటలకే చేరుకున్నారు. మొదట ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. తర్వాత అమ్మనామపారాయణ – అనంతరం లలితా సహస్ర నామపారాయణ ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి పార్వతీపురం ప్రధాన కార్యదర్శి గంటేడ చిన్నంనాయుడు సభాకార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నూతనంగా అమ్మకుటుంబంలో చేరి అన్నయాగంలో విశేష సేవలు అందిస్తున్న శ్రీమతి & శ్రీ దొడ్లంకి గణపతి, శ్రీమతి & శ్రీ జి.అప్పలరాజు, శ్రీమతి & శ్రీ చిన్నం నాయుడు, శ్రీమతి & శ్రీ చిరంజీవి, జయదేవి దంపతులను సభకు పరిచయం చేసారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన గంటేడ సోమేశ్వరరావు అన్ని విషయాలను తెలియజేస్తూ అన్నయాగాన్ని నిర్విఘ్నంగా అమ్మ జరిపిస్తున్న తీరును అత్యద్భుతంగా వివరించారు. నాటి సభలో ప్రముఖ కథా రచయిత జి.గౌరునాయుడు, బి. అడివినాయుడు, బి.శ్రీరాములు, యల్. గణపతిరావు, జి.అప్పలరాజు, యస్.త్రినాథరావు, బి.శ్రీరామమూర్తి నాయుడులతో పాటు మహిళాసభ్యులు శ్రీమతి జయదేవి, శ్రీమతి బి.భవాని అమ్మ ప్రేమతత్త్వాన్ని అమ్మ చూపిన మహిమలను తమ అనుభవాలను, అనుభూతులను ఎంతో చక్కగా తెలియజేశారు. చివరగా 6.8.2023 న జరగబోయే ద్వితీయ వార్షికోత్సవములో చేయాల్సిన కార్యక్రమాలను గురించి చర్చించుకొని అన్నయాగం పార్వతీపురం నిరంతరం కొనసాగించాలని తీర్మానించుకోవడం జరిగింది. 8 గంటలకు సమావేశం ముగించుకొని అమ్మకు హారతినిచ్చి, తీర్థప్రసాదాలతో పాటు అల్పాహారం స్వీకరించి అంతా ఆనందంగా ఇళ్ళకు వెళ్ళారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!