సో॥శ్రీ ప్రసాదవర్మ కామఋషిగారు ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక ఉపసంపాదకులు. శృంగేరీ పీఠము, ఆయా పీఠాధిపతులను గురించి ముఖ్యంగా ఆర్షవిజ్ఞానం గురించి, అధ్యయనం చేసిన తత్త్వవేత్త, ప్రముఖరచయిత, జర్నలిస్టు. జిల్లెళ్ళమూడిని ఈ మధ్య రెండు మూడుసార్లు సందర్శించారు. ‘వాత్సల్యామృత మూర్తి అమ్మ’ ‘మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం అమ్మ’ ‘సాధ్యమైనదే సాధన’ వంటి విశిష్ట వ్యాసాల్ని, ‘అమ్మా ! నీ మాటలు’ వంటి నిగూఢతత్త్వ బోధక గేయాల్ని రచించారు. అమ్మను కేవలం ఒక్కసారే దర్శించి పరవశించి నల్లభై ఏళ్ళుగా తన దివ్యానుభూతిని నెమరు వేసుకొంటూ అంతరృష్టితో ‘అమ్మ సహజ మహిమ’ అనే అద్భుత వ్యాసాన్ని రచించిన సో॥ శ్రీ వి. విశ్వనాధమయ్య వీరికి కడు సన్నిహితులు.
శ్రీ ప్రసాదవర్మగారు అమ్మను భౌతికంగా దర్శించి యుండలేదు. కానీ వారికి అమ్మ తన దివ్యదర్శన స్పర్శన భాగ్యాల్ని ప్రసాదించింది. వారి కలం నుండి జాలువారిన దివ్యానుభవాన్ని యధాతధంగా అందిస్తున్నాను. అవధరించండి.
2012 సంవత్సరం మార్చి1వ తేదీ గురువారం తెల్లవారు ఝాము నాలుగున్నర అయి ఉంటుంది. ఇంకా శీతాకాలం కొనసాగుతోంది. వాతావరణం చల్లగా ఉంది. అది సుమారు 12 × 12 అడుగుల పాత పెంకుటింటి గదిలా ఉంది. పాతికమంది వరకు భక్తులు ఉన్నారు. చాలా మంది కూచునే ఉన్నారు. చాపల మీద ఓ నలుగురైదుగురు నిలబడి అమ్మతో మాట్లాడుతున్నారు. అమ్మ కూడా నిలబడే ఉంది. అంతమందిలో ఒకరిద్దరు తప్పు పరిచయస్థులు లేరు. నేను మాత్రం ఒక మూలగా పదిపన్నెండంగుళాల ఎత్తున్న ముక్కాలు పీట మీద కూర్చున్నాను. కొంతసేపటికి అమ్మ నా వైపు తిరిగింది. ప్రక్క నున్న వాళ్ళతో, “వీడు ఫోటోలు తీస్తాడు. రాతలు రాస్తాడు” అంటూ నా దగ్గర కొచ్చింది. అయినా కూచునే ఉన్నాను. నా తలమీద తన అమృత హస్తాన్ని ఉంచింది. ఏదో గోరు వెచ్చగా నా శరీరమంతా వ్యాపించింది. ఇదేనా హస్తమస్తక సంయోజనము అంటే ? హఠాత్తుగా లేచి అమ్మను చుట్టేశాను చిన్నపిల్లాడిలా.
అమ్మ ఏ ప్రక్కింటికో, స్నానానికి వెళితే వచ్చేదాకా ఓపిక పట్టలేని, ఎడబాటు సహించలేని చిన్నపిల్లవాని తహతహ, రాగానే ‘అమ్మా’ అంటూ తల్లిని చుట్టేసే ఆతృత మనకు అనుభవంలోనిదే ! సరిగ్గా ఇలాంటి భావావేశంతో అమ్మను చుట్టేసి, అమ్మ భుజం మీద ఒక్క సెకను తల వాల్చేను. ఇంతలో మెలకువ వచ్చేసింది. అంత చల్లని వేకువఝామున ఒళ్ళంతా వేడిగా అయి చెమటలు పట్టేయి. వెంటనే తలుపు తీసికొని ఆరుబయట మెట్టు మీద కూర్చున్నాను. కలగన్న మనోచిత్రాన్ని నెమరు వేసుకుంటూ ‘చలిలో బయట ఎందుకు కూర్చున్నారు ? అంటూ అర్ధాంగి!
ఇది ఏమాత్రం అతిశయోక్తి లేని అక్షర సత్యం. ఇది అబద్ధమో అతిశయోక్తో అని అనిపిస్తే – అది పరిమితమైన నా భాషాజ్ఞానం వల్లగానీ, వ్యక్తీకరణలో లోటు పాట్లు వల్లనే గానీ మరొకటికాదు’.
వారి దివ్యానుభవాన్ని తెలుసుకున్నారు కదా!
ఇక్కడ మరొక ముఖ్యమైన సంగతి ఉన్నది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్దిరోజులకు నాకు ఛాతి నొప్పి వచ్చింది. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో రెండు రోజులున్నారు. వైద్యులు పరీక్షలు అన్నీ నిర్వహించి గుండెకి సంబంధించిన సమస్యలు ఏమీ లేవని తేల్చారు.
ఈ నేపథ్యంలో నాకు అమ్మ అనుగ్రహ విశేష సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది. మచిలీపట్టణం సో॥ శ్రీ ఒ.వి.జి.సుబ్రహ్మణ్యం గారి బావమరిది శ్రీ చంద్రశేఖర్ గారు. ఒకసారివారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ‘అల్సర్ ఉన్నది. ఆపరేషన్ చేయాలి’ అని తేదిని కూడా నిర్ణయించారు. కారణాంతరాల వల్ల ఆపరేషన్ వాయిదా పడింది. ఆ మధ్యకాలంలో అమ్మ మచిలీపట్టణం వచ్చింది.
సో॥చంద్రశేఖరరావుగారు అమ్మతో తన అనారోగ్యం, ఆపరేషన్ విషయాల్ని ప్రస్తావించారు. అమ్మ తన అమృతహస్తంతో వారి పొట్ట మీద రాస్తూ, “నాన్నా! వైద్యులు ఆపరేషన్ చేస్తానంటే చేయించుకో. కాని ఇక్కడ ఏమీ (లోపం / సమస్య) లేదు” అన్నది. తర్వాత కాలంలో వారికి అనారోగ్య చిహ్నాలు అదృశ్యం అయినాయి, ఆపరేషన్ కాలేదు.
అందువలన నాకు ఏమనిపిస్తుందంటే ప్రసాదవర్మగారికి ముందుగా ఏదో అనారోగ్యం ఉండి ఉండవచ్చు. అమ్మ అమృతస్పర్శల్ల అది మాయం అయి ఉండవచ్చు. నరసాపురం సోదరి ఆచంట అన్నపూర్ణ సో॥ ఎమ్. దినకర్, శ్రీమతి యస్. రుక్మిణక్కయ్య ఇంకా పలువురి సందర్భాల్లో అమ్మ మాట, స్పర్శవల్ల వైద్యులకు అంతుచిక్కని రుగ్మతలు సమూలంగా నిర్మూలమైనాయి. కాగా ప్రసాదవర్మగారు ‘ఇది కేవలం శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందునికి అనుగ్రహించిన హస్తమస్తక సంయోగ సదృశశక్తి ప్రసారభాగ్య విశేషమేమో!’ అని. వాస్తవం శ్రీ ఏమంటే లౌకికమైన, పారమార్థికమైన కోరికలు లేక అవసరాల్ని తీర్చేది ఒకే శక్తి; ఆ సాకార రూపమే అమ్మ.