20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశంలో ఒక అద్భుతం జరిగింది. ఆంధ్రదేశం భూమికగా జగతికొక అదృష్టం పట్టింది. ఆంధ్రదేశపు ఆధ్యాత్మికజ్యోతి దేదీప్యమానంగా వెలిగింది. ఆ వెలుగులో ఎందరెందరో మహామహులు సేదతీరేరు, ఆత్మావలోకనం చేసుకున్నారు. ఆ విశ్వజనీనత, తాత్వికత, విప్లవాత్మక, అత్యంత ఆచరణాత్మక డౌన్ టు ఎర్త్ ఆలోచనా సరళి, మూఢాచార నిరసనలలో విలక్షణత చూపి నవయుగానికి నాంది పలికింది జిల్లెళ్ళమూడి అమ్మ.
ఫలానా కవి ఆంధ్రుడు కనుక నోబెల్ బహుమతి రాలేదు. ఫలానా గేయం తెలుగువాడు రాసింది కనుక జాతీయగీతం కాలేదు. ఫలానా శాస్త్రవేత్త తెలుగు వాడైనందున రావలసినంత ఖ్యాతి రాలేదు, గుర్తింపు కలగలేదు….. యిలా అనుకోవటం పరిపాటి! అందులో నిజం లేకపోలేదు. అలాగే అమ్మ కూడా తెలుగింటి ఇల్లాలైనందువల్ల కాబోలు కావాల్సినంత వెల్లడి కాలేదు, జరగవలసి నంత ప్రచారం జరగలేదు. ఆంధ్రదేశపు ఆధ్యాత్మిక పటంలో ఒక మూల మిణుకు మిణుకు మంటూ కూచున్నది. అయినా నిరాశ చెందవలసిన పని లేదు. నివురుగప్పిన నిప్పు రాజుకుంటున్న సూచనలు ప్రస్ఫుటంగానే కనిపిస్తున్నాయి. ఆ జ్వాల, ఆ జ్యోతి అనంతమైన కాంతిని ప్రసరించ బోతున్నది.
అమ్మ చెయ్యవలసిందేదో నిశ్శబ్దంగా, నిరాడంబరంగా చేసుకు పోయింది. చెప్పవలసిందేదో నిగూఢంగా నిశ్శబ్దంగానే చెప్పింది. చెప్పిందేదో చేతలలో చూపించి మార్గదర్శనం చేసింది. అమ్మకు ప్రచార విముఖతలాగే ప్రసంగ విముఖతా ఎక్కువే కదా! ఏది ఏమైతేనేం అమ్మ తాత్వికతను తెలుసుకోవటంలో మూఢాచారాల నడుం విరగ్గొట్టిన విప్లవాత్మక ఆలోచనా సరళిని ఆకళింపు చేసుకోవటంలో ఆంధ్రదేశం టెర్రిబుల్గా మిస్సయింది.
ఒక్కో కాలంలో ఒక్కో మహా విభూతి అభివ్యక్త మవుతుంది. అట్టి భగవద్విభూతి సంపూర్ణ మానవత్వాన్ని, మాతృత్వాన్ని సంతరించుకుని అమ్మయై సకల జీవ ఉద్దరణ చేసే సంకల్పంతో మన మధ్య నడయాడిన మానవ రూపం అనసూయమ్మ. సాక్షాత్తు పరాశక్తి అంశ తనంత తాను వచ్చినదిగాని కర్మ వశాత్తు కర్మ శేషం పూర్తి చేసుకోడానికి వచ్చింది కాదు. అమ్మ వంటి దివ్య విభూతులకు రాకపోకలు లేవని చెప్పవచ్చు. పాంచభౌతిక శరీరానికి పరిమితమైనది కాదు.
రామకృష్ణాది అవతారాలు ఎవరో ప్రార్థిస్తే వచ్చి ధర్మ సంస్థాపనకో, శిష్ట రక్షణకో, దుష్ట శిక్షణకో ఆయా సమయానికి నిర్దిష్ట కార్యక్రమం నిర్వర్తించినవి. అమ్మ అలా ఎవరో ప్రార్థించగా వచ్చినది కాదు. నాది కారణ జన్మ అయితే మీరంతా కారణం జన్ములే అన్నది. అందుకే అమ్మది అవతారం కాదు ఆవిర్భావం, సర్వత్రా నిండిన చైతన్యం తల్లి రూపాన వచ్చింది అని పెద్దల మాట. ఆమె రాక లక్ష్యం – లాలన, పాలన, పోషణ, రక్షణ, శిక్షణ కలగలసిన మాతృధర్మం.
తాత్త్విక శిఖరాగ్రాన నిలచిన అమ్మ మనకోసం దిగి వచ్చి, మన చేయిపట్టి నడిపించి దారి చూపిన దీప శిఖ. అతి సామాన్యమైన సాంఘిక ధర్మాల నుంచి అద్వైతం వంటి ఆధ్యాత్మిక విషయాల వరకు అలవోకగా ప్రస్తావించిన వివేక చూడామణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సహజ సంగమం అమ్మ వ్యక్తిత్వం. తల్లి, గురువు, దైవం ఏకీకృతమైన విభూతి అమ్మ. తాను అందరికి అమ్మను అన్న అంతఃస్పందన బాల్యం నుంచీ వ్యక్తమైనట్టు అనేక ఉదాహరణలున్నాయి అమ్మ చరిత్రలో.
ముగ్గురు పిల్లలున్న చిన్న కుటుంబాన్ని విశ్వకుటుంబముగా విస్తరించింది. తన ప్రేమను సర్వసృష్టిపైనా ప్రసరించింది. పరిమితమైన మమకారం మానవత్వానికి, సర్వత్రా ఉన్న మమకారం మాధవత్వానికి చిహ్నమని వివరించింది. ఈ లోకంలో ఈ ఊరు నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది. అనగలిగిన వారున్నారు గాని “ఈ సృష్టి నాది అనగలిగినది అమ్మ మాత్రమే అన్నారు కొందముది రామకృష్ణగారు.
సమసమాజస్థాపనకు అతి నిశ్శబ్దంగా నిరాడంబరంగా సోపానాలు వేసింది. ఒక సామాన్య గృహిణి ఆచరణలో పెట్టి చూపిన సామ్యవాదం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె ఆచరణాత్మకత ముందు మార్క్స్, ఎంగెల్సు, లెనిన్లూ, వంటి వామపక్ష నేతలు మరుగుజ్జులుగా కనిపిస్తారు. వాళ్ళు కూడా అమ్మ ఒడిలో పసిబిడ్డలే.
సాంఘికంగానూ, ఆధ్యాత్మికంగానూ – సంప్రదాయం ఆచారం పేరిట ఎన్నో మూఢ విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించ కుండా, సంప్రదాయం distort కాకుండా ఈ మూఢత్వం తొలగించటానికి కృషి చేసింది. అమ్మ అనుసరించిన విధానంలో మత ఛాందసము, మత కాఠిన్యత orthodoxy సనాతన ధర్మ వ్యతిరేకత కానరాదు.
అమ్మ మనకు తెలియకుండానే, ఇది చేస్తున్నాను అని చెప్పకుండా, ఎన్నెన్నో మార్పులు తెచ్చింది. సమాజోద్ధరణకు ఎందరో సంస్కర్తలు, నాయకులు, ఎంత ప్రయత్నించినా, ఎంత వ్యాయామం చేసినా జరగని పని పదహారణాల తెలుగింటి ఆడపడుచు, యింటి పని, వంటింటి పని అన్నంత అలవోకగా చేసి చూపించింది. ఆచరణాత్మకంగా ప్రబోధించటమే అమ్మ ప్రత్యేకత. ఏం చెప్పినా, ఏం చేసినా హేతుబద్ధంగా వాస్తవ దృష్టితో కూడి ఉంటుంది. ముందు తాను ఆచరించి, తన అనుభవంలోంచే చెప్పింది.
“మీరందరు అన్నదానం చెయ్యండి అని ఊరికే చెప్పలేదు. నేనిలా అన్న వస్త్రాలు పెట్టుకోవటం మీరు మీ ఇళ్లలో పెట్టుకోవాలన్న ప్రేరణ కలగాలనే ” అని అమ్మ చెప్పింది. అన్నపూర్ణాలయం స్థాపించి ఒక ఆదర్శం నిర్దేశించింది.
ఆ పల్లెటూళ్లో తినటానికి పట్టెడన్నం లేక పస్తులుండే పేద వారికి సహాయంగా “పిడికెడు బియ్యం” పథకం ప్రారంభించి ఎందరినో ఆదుకున్నది.
కులమత, వర్గ, వర్ణ, విచక్షణ ఎన్నడూ లేదు అమ్మ దగ్గర. అన్ని మతాల కులాల వారినీ దేశ విదేశీయులను అందరిని సమదృష్టితో చూసింది. ఇంత విస్తృత ప్రాతిపదిక మీద, ఎంతో విశాల భావనతో అందరిల్లు మొదలు పెట్టింది. ఈ భావనకు ప్రాతిపదిక చిన్నతనంలోనే కనిపిస్తుంది. కల్యాణానంద భారతీ స్వామి వారు నీవెవరు? మీదేకులం? అని అడిగితే నేనెవరో తెలుసుకుందామనే వచ్చాను. శుక్లశోణితాల దేకులమో అదే నాకులం అనటం – నాకు కులాలు లేవని చెప్పటమే కదా!
మంత్రాయి, రహి, మౌలాలి, చాకలి బుచ్చమ్మ, అంకదాసు, మస్తాను వంటి. వారి కుల మత జాతి ప్రసక్తి అణుమాత్రమైనా తలంచ లేదు. వారంతా తమ్ము తాము సంస్కరించుకొని అమ్మకు ఆత్మీయులై అమ్మ సేవలో తరించే అవకాశం అమ్మే కల్పించింది.
కోన వేంకటేశ్వరరావుగారి తల్లి వెంకాయమ్మగారికి స్వయంగా అంత్య క్రియలు జరిపింది. శ్రీపాదవారు రాజమండ్రిలో మరణించినా వారి కోరిక ప్రకారం అంత్యక్రియలకు జిల్లెళ్ళమూడి తీసుకువచ్చారు. కొడుకులు లేని వారికి కూతురు గాయత్రి చేత అంతిమ సంస్కారాలు చెయ్యమని, అట్టి కర్మాధికారం స్త్రీలకున్నదని ఆచరణాత్మకంగా చెప్పింది.
సాధారణంగా స్త్రీలు తమ యింటికి ఎవరైనా వచ్చి వెళ్ళేటపుడు బొట్టు పెట్టి పంపుతారు. అలాగే గురువు రాజమ్మగారు బొట్టు పెట్టుకు వెళ్ళమన్నది. మీరే పెట్టండి అన్నది అమ్మ. తాను వితంతువు కనుక ఆ అర్హత లేదన్నది. మీకు మనస్ఫూర్తిగా అర్హత లేదని తోస్తున్నదా? సంఘ మేమన్నా అంటుందనా? అని ప్రశ్నించింది. అనాది ఆచారం కదా అన్నది రాజమ్మగారు. ఇలాంటి అర్థం లేని ఆచారాలను పాటించనవసరం లేదని వివరించింది.
ఆలయాల్లో పూజారులుగా స్త్రీలు అర్బనాదులు నిర్వర్తించమని ప్రోత్సహించింది. ఒక సందర్భంలో యింటి కోడళ్ళు శేషు, వైదేహిలచే గ్రామస్తుల కాళ్లకు పసుపు రాయటం కుంకుమ దిద్దటం చేయించింది. పెద్ద యింటి ముత్తయిదువలు తమ కాళ్లను తాకి పసుపు రాస్తుంటే ఎంతో బిడియ పడ్డారు గ్రామస్తులు.
అలాగే పరుగెత్తుకు వస్తున్న గేదెల బారి నుండి పాకీ పిల్లను కాపాడిన సందర్భంలో – అయ్యో అన్న వాళ్లే గాని ఆదుకున్న వాళ్ళు లేరు. పైగా బ్రాహ్మణత్వం మంట కలిసిందన్నారు. ఆ పిల్లను రక్షించకుండా మిన్నకుండి పోయారే మీరందరూ, ఆ క్షణమే బ్రాహ్మణత్వం మంట కలిసిందని, బ్రహ్మతత్త్వమే. బ్రాహ్మణత్వమని తెలుసుకుంటే చాలని వివరించింది. ఇక్కడ గమనించ వలసింది – పాకీ పని చేసే ఆ స్త్రీని ‘సంఘమాత’ అనటం ఎంత అన్వర్థమైన మాట!
మురికివాడలలో, ఫుట్పాత్ ల మీదా తలదాచుకుని పట్టెడన్నం కోసం ఎదురు చూసే అధోజగత్ సహోదరులను ‘మనవాళ్ళు’ అన్నది. బిచ్చగాళ్లకు యింటి లోంచి అన్నం పట్టుకెళ్లి పెట్టటమే గాక తాతగారి పంచలు, చొక్కాలు తీసుకుని పంచిపెట్టింది.
పైన ఉదహరించిన అమ్మత్వ విశేషాలు, సంఘటనల గురించి లోతుగా పరిశీలిస్తే వర్తమాన సమాజంలో అమ్మ స్థానం ఏమిటి, అమ్మ రిలవెన్స్ ఏమిటన్నది తెలుస్తుంది. అమ్మ సనాతనము, ఆధునికత కలబోసుకున్న అర్థనారీశ్వరి. అమ్మ మన మధ్య ఎటువంటి మానవ సంబంధాలుండాలని ఆశించిందో, ఎటువంటి సమసమాజాన్ని సంకల్పించిందో అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో, అందులో మన పాత్ర ఏమిటన్నది అంతే ముఖ్యం.
కూతురుగా, కోడలుగా, ఇల్లాలుగా, తల్లిగా, గురువుగా, ఆచార సంప్రదా యాల్లోని మూఢత్వాన్ని ఛేదించిన విప్లవకారిణిగా మాతృధర్మానికి మహా రాణిగా ఇలా విభిన్న పాత్రలను సమర్థంగా, సాధికారంగా సమన్వయము చేసిన దివ్యమూర్తి, అయినప్పటికీ మాతృధర్మానికే పట్టం కట్టినది, ప్రేమదే పై చేయి అన్నది. అందరి ఆకలి తీర్చటమే నా జీవిత సందేశం అన్నది. సర్వ సృష్టికి అమ్మనే అన్నది. అందుకే ఆమె విశ్వజనని! అమ్మ ఒక నిరంతర స్ఫూర్తి.