1. Home
 2. Articles
 3. Mother of All
 4. అమ్మ అష్టవిధ అనుగ్రహ వీక్షణాలు

అమ్మ అష్టవిధ అనుగ్రహ వీక్షణాలు

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : January
Issue Number : 1
Year : 2017

శ్రీ శంకరాచార్యులవారు ‘సౌందర్యలహరి’లో జగన్మాత అష్టవిధ విశేష

‘విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్య కువలయై: 

కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా

అవస్తీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా

ధృవం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ॥’ అశోక ‘విశాల, కళ్యాణి, అయోధ్య, మధుర, భోగవతి, అవంతి, విజయ, ధార’ అనెడి ఎనిమిది నగరముల నామములతో విరాజిల్లుతున్నవి – అని అభివర్ణించారు. అంటే శ్రీమాత ఏఏ ప్రదేశములలో శతృసంహారం చేసి తన కృపాదృష్టిని జగతిపై ప్రసరించిందో ఆ దృష్టి విశేషణములైన పేర్లతో ఆయా నగరములు ప్రసిద్ధి చెందాయి – అని..

నాకు అందినంత వరకు వివరిస్తాను.

 1. విశాలా (బదరి) :

మానవ శరీరాన్ని ‘పురం’ అనీ, ‘క్షేత్రం’ అనీ అంటారు. అందలి హృదయము అనే అష్టదళపద్మము తలపులు, తలుపులు లేని ఆయతనం. ‘దహం విపాపం పరమేశ్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గిం’ – అంటుంది మహానారాయణ మంత్రం. అంటే హృదయ కుహరము స్వచ్ఛమైనది; పరమాత్మకు నివాసస్థానమైనది. అంటే పిడికెడు హృదయంలో ఆది మధ్యాంతరహితమైన శక్తి ప్రకాశిస్తోంది.

అమ్మ దృష్టి విశాలమైనది. కనుక అమ్మ విశాలాక్షి. విశాలమైన నేత్రములు కలది. అవి సకల లోకావలోకన సమర్థములు. అంతేకాదు. ఆ చూపులు చతుర్దశభువనాల చట్రాన్నీ దాటి దూసుకు పోతాయి. అది శివుని మూడవ కన్ను వంటిది. అది తెరిచేది కాదు, తెరిపించేది.

 1. కళ్యాణి :

అమ్మ నిత్య కళ్యాణి, సర్వమంగళ. ‘మేను (శరీరం) నేనైన నేను’ అనే దేహాత్మ భావనకి భిన్నంగా “అన్ని నేనులూ నేనైన నేను” అని అమ్మ భావతాదాత్మ్యతే కల్యాణీ దృష్టి.

‘నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను’ అనేది మాయామోహిత ప్రాకృతిక దృష్టి. ‘పరమేశ్వరుడు చేయిస్తున్నాడు. నేను చూస్తున్నాను’ – అనేది సాధకుని దృష్టి. “పరమేశ్వరుడే చేస్తున్నాడు” అనేది జ్ఞానదృష్టి. 

విశ్వకళ్యాణాన్ని సంకల్పించి హైమాలయము, అనసూయేశ్వరాలయం, అన్నపూర్ణాలయం వంటి ఎన్నో ప్రజాహిత సంస్థల్ని అమ్మ ప్రతిష్టించింది. తన కన్నబిడ్డనే కర్పూరహారతి పట్టింది; తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలు గా ఆవిష్కరించింది.

 1. అయోధ్య :

అయోధ్య అంటే యుద్ధ మెరుగనిది; జయింప శక్యము కానిది. జయించాల్సినది మనస్సుని. గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం కోటలో ఉండి యుద్ధం చేయమని ఆచరణాత్మకంగా అమ్మ ప్రబోధించింది. జీవితం ఎండమావుల వెంట పయనం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఒకరు ‘జీవితం అంటే ఏమిటి?’ అని అడిగితే, “నచ్చిందేమో దొరకదు; దొరికింది నచ్చదు. ఇదీ జీవితం” అన్నారు. ఈ సత్యాన్నే సూక్ష్మంగా సూటిగా సూత్రీకరిస్తూ అమ్మ “ఆశ, అసంతృప్తుల

కలయికే జీవితం” అని నిర్వచించింది.

ఒక లక్ష్యాన్ని సాధించిన నేపధ్యంలో నిర్వహించుకునే విజయోత్సవ వేడుకలు పూర్తి కాకుండానే, ఒక అసంతృప్తి సెగ కొడుతుంది. మళ్ళీ తీరని దాహం, ఆగని పరుగు ప్రారంభం.

 1. మధుర :

విరాగంలో కూడా అనురాగాన్నే దర్శించే మధుర మమతా స్రవంతి అమ్మ. సర్వాన్నీ పరిత్యజించడం కాదు, పరిగ్రహించడం; పోగొట్టుకోవడంలో ఆనందమేమీ లేదు. రాబట్టుకోవడంలోనే ఉన్నది. అమ్మ ఎవరినీ దేనినీ నిందించలేదు, నిరసించలేదు. అన్ని మతాల్నీ అందరి అభిమతాల్నీ ఆదరించింది, గౌరవించింది.

‘అంతర్ముఖ సమారాధ్య’ అయిన అమ్మను ఈ కళ్ళతో దర్శించాం. ధన్యులం. అమ్మ దర్శనం సకల పాపతాపహరం, సర్వాభీష్టఫల ప్రదం. ఆ సమయంలో పరస్పర మమతానుబంధ పూర్వక అవలోకనంలో అటు భగవంతుడు – ఇటు భాగవతుడు ఇరువురూ పరవశులౌతారు. ఏనాడో కోల్పోయిన నిధీ, నిధానమూ ఈనాడు దక్కిందని ఉక్కిరి బిక్కిరి అవుతారు. అది కేవలం లౌకిక ప్రపంచంలోని తల్లీ బిడ్డా సంబంధబాంధవ్యం వంటిది కాదు.

అమ్మ విరాట్స్వరూపంలో తనూ ఒక భాగమే అనే అలౌకిక స్ఫురణ వ్యక్తికి కలుగుతుంది. తన ప్రమేయం లేకుండానే అమ్మ హృదయాంతరాళాల్లోకి ప్రవేశించి స్థిర నివాసం చేస్తాడు. ఇందుకు హేతువు – అమ్మ కన్నుల నుండి ప్రసృతమయ్యే వాత్సల్యామృతరస సముత్తుంగ తరంగాలు. అవి జీవకోటిని పునీతుల్ని చేస్తాయి, ఉద్దరిస్తాయి.

 1. ధార :

జగజ్జనని అమ్మ కృపాధారాధార. అంటే కృప అనే ధారకి ఆధార భూతమైనది. ‘అమ్మ దయ – అంతా అమ్మ దయ’ అని అంటూంటాం. కానీ ఆ మాట సంపూర్ణమైనది కాదు; ‘అమ్మ కరుణ (MERCY)” అనాలి. కరుణ అనేది భగవద్విభూతి. అది మానవ ఊహకి అందని విధంగా ఊర్ధ్వలోకాల్లోంచి అయాచితంగా అనవరతం అవిచ్ఛిన్నంగా అమృతధారగా వర్షిస్తుంది. Mercy is an attribute to God himself Shakespeare.

కరుణను గురించి తెలుసు కోవాలంటే అమ్మ మాటలు “కరుణ లేకపోతే మనమే లేము. మనము చేసే పనులన్నీ కరుణ వల్లనే. నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కరుణ వల్లనే. ప్రతి చిన్నవనీ మన చేతులతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లనే. మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించడమే కరుణ” – ని మననం చేసుకోవాలి.

అంటే లౌకిక కార్యకలాపాలూ, ఆహార సముపార్జనా, ఉచ్ఛ్వాస నిశ్వాసలే కాదు; కన్నులు తెరవటమూ మూయటమూ అమ్మ కరుణ వల్లనే.. 

అట్టి అమ్మ నిరుపమాన కరుణారస దృష్టిలో తడిసిన మన జీవితాలు విశిష్టంగా ఉండాలి; అమ్మ హృదయానికి ప్రతిబింబాలు కావాలి. బిడ్డల కదలికల్లో ఆచరణలో తల్లి పోలికలు ప్రస్ఫుటం కావాలి.

 1. భోగవతి (అమరావతి) :

కేవలం అమ్మ వర్ణ చిత్రాన్ని కాని, దూరాన్నుంచి అమ్మను కాని చూచినవారు అనుకుంటారు. అంటారు ‘పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొనే ముత్తైదువ – పుష్టిగా కళకళలాడుతూ ఉంటుంది’ – అని. కానీ అమ్మ నిరాహార అనే వాస్తవం నూటికి ఒక్కరికి కూడా తెలియదు.

అమ్మ భోగం ఏమిటంటే అందరూ తింటుంటే చూచి మురిసి పోవటం. అమ్మకి మహా నివేదన చేస్తారు. అన్నపురాశి ఉన్న ఆ పెద్ద స్టీలు పళ్ళెం చుట్టూ కూరలు, పచ్చళ్ళు, నెయ్యి, పెరుగు వగైరా అనుపాకాలుంటాయి. వాటన్నిటిని కారం లేని తన మమకారంతో కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేస్తుంది. తాను తినటానికేమో అనుకుంటే అపార్థం చేసుకోవటమే. వాటిని గోముగా బిడ్డల నోటికి అందిస్తుంది. అమ్మది పేరు బిడ్డలది నోరు. అమ్మ చేతిలో అన్నం మహాప్రసాదం. పెట్టుకోవటంలోనే అమ్మకి ఆనందం. అది మన దృష్టిలో త్యాగం – అమ్మ దృష్టిలో రాగం: మాతృధర్మం. అదే అమ్మ భోగం.

అన్ని పదార్ధాలను కలిపి అంటే ఒక చక్కని సంఘటన గుర్తుకు వస్తుంది. భగవాన్ శ్రీరమణ మహర్షుల ఆశ్రమంలో శాంతమ్మ అనే భక్తురాలు ఉండేది. ఆమె కడు భక్తిశ్రద్ధలతో కూర, పప్పు, చారు, వడ, హల్వా అన్నీ తయారు చేసి మహర్షికి వడ్డించేది. వారు అన్నిటినీ కలగలిపి తినేవారు. అందుకు ఆమె “అదేమిటి స్వామీ! దేనిరుచి దానిదే కదా! అలా కలగూరగంప చేసి తింటారేమీ?’ అని ప్రశించింది. అందుకు మహర్షి, “అన్నీ వేరు అనుకోవటం నీకు ఇష్టం. అన్నీ ఒకటే అనుకోవటం నాకు ఇష్టం” అన్నారు. అలా ‘ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’తో తాదాత్మ్యం చెందిన వారికే తెలుస్తుంది – ఆ ఆనందం, ఆ భోగం.

అమ్మ సహజస్వరూపానికి రెండవ వైపూ ఉన్నది. అది కనిపించేది కాదు. హైమక్కయ్య శరీరత్యాగం చేసినపుడు ఒకరు కంట తడి పెట్టుకొని ‘అమ్మది. గర్భశోకం; దుర్భరం’ అన్నారు. అమ్మది గర్భశోకం కాదు, ఆగర్భశోకం. అందరూ, అన్నీ అమ్మ సంతానమే. ‘సద్యోజాతం ప్రపద్యామి’ అన్నట్లు అనుక్షణం జననమరణాలు సహజంగా సంభవిస్తున్నాయి. కోట్లాది జీవరాశి తొలిసారి ఊపిరి పీలుస్తోంది. కడసారి ఊపిరి విడుస్తోంది. అది అసలైన అమ్మకి ఆగర్భశోకమే కదా! ఈ సంపూర్ణతత్త్వాధ్యయనమే సమ్యగ్దర్శనమ్. కనుకనే అమ్మ యదార్ధస్థితి కృష్ణుడు పుట్టాడని సంతోషం లేదు, నరకాసురుడు పోయాడనే ‘బాధ లేదు’ – అనే వాక్యంలో వ్యక్త మౌతోంది.

 1. అవంతీ :

ఈ దృష్టి ఆర్తత్రాణ పరాయణత్వ ఆశ్రిత జనవాత్సల్య లక్షణ సమన్వితం, సంశోభితం, సమలంకృతం.

‘రసాతల నిమగ్నార్త రక్షణాధిక కాశలా’ అని శ్రీ రాధాకృష్ణశర్మగారు అమ్మను స్తుతించారు. అంటే – అధః పాతాళ లోకస్థాయికి పతనమై ‘రక్షణ కోసం’ ఆర్తనాదాలు చేసే వారిని ఉద్ధరించటంలో అమ్మ బహునేర్పరి – అని..

‘మాయ అంటే ఏమిటమ్మా?’ అని అడిగితే అమ్మ, “నేను (వ్యక్తితాను) చేస్తున్నాననుకోవటం” అన్నది. శాస్త్రార్థం ఏమంటే – యామాసా: ‘యా’ ఏదైతే, ‘మా’ లేదో, ‘సా’ అది మాయ – అని. ఉన్నది ఉన్నట్లుగా దర్శింపచేసే సత్యస్వరూపిణి అమ్మ.

భగవాన్ శ్రీ సత్యసాయిని ఒకరు ‘బ్రహ్మపదార్థం అంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. అందుకు వారు “ఈ కన్నులు దేనిని చూడలేవో, దేని వలన ఈ కన్నులు చూడగలుగుతున్నాయో అదే అన్నారు. మనస్సులయం అయ్యేది. ఆలయం. అచ్చట సర్వత్రా పరివ్యాప్తమైన శక్తిని లింగాకారంగా పరిమితరూపంలో అర్చిస్తూ ఏకాదశరుద్రాభిషేకాల్ని నిర్వహిస్తాం. సమయంలో అంగాంగీ భావాన్ని ప్రోది చేసుకోవాలి. ‘లింగం’ అంటే ‘లిమయతే’, ‘గమయతే’ – ఏది లీనం చేస్తుందో, ఏది నడిపిస్తుందో అది – అని.

అనన్యసామాన్యము అప్రతిహతము అయిన ఆ పరతత్త్వాన్ని ‘శివే! అనసూయే! మాతర్భవాని! మమదేహి కరావలంబమ్’ అని ప్రార్ధించటమే రక్షణ పొందటం.

 1. విజయ :- అమ్మ రాగద్వేషాల్ని జయించింది. అరిషడ్వర్గాల్ని జయించింది; పంచభూతాలను జయించింది; పాంచభౌతిక సరిహద్దుల్ని అధిగమించింది; స్వార్ధాన్ని రూపుమాపి పారమార్ధిక శిఖరాల్ని అవలీలగా అధిష్ఠించింది. కనుకనే అనసూయ అయింది.

జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ దర్శనం ఇస్తోంది’ అనే సమాచార సాంకేతికంగా జేగంట గణగణమని మ్రోగుతుంది. ఆ ప్రణవనాదం ‘ఆగమార్ధంతు దేవానాం, గమనార్ధంతు రక్షసాం’ అనే ఆప్తవాక్యానికి సంకేతం. అది తత్త్వత: రణభేరి. అమ్మ దర్శన ప్రభావం చేత అధర్మంపై ధర్మానికి అసత్యంపై సత్యానికి, దానవత్వంపై దైవత్వానికి విజయం తధ్యం.

శ్రీ అనసూయేశ్వరాలయం నుంచి శంఖనాదం వినిపిస్తుంది. అది సమర శంఖారావం. అమ్మ ద్వేషాన్ని ద్వేషిస్తుంది. అజ్ఞానాన్ని, అంధకారాన్ని, అలసత్వాన్ని అంతమొందించి పునర్జీవనానికి పునరుజ్జీవనానికి రాచబాటను వేస్తుంది. సకల జగత్తును ఒకసారి చంకన వేసుకుని, మరొకసారి చిటికెనవేలు పట్టుకొని చిట్టిచిట్టి అడుగులు వేయిస్తూ పరమపద సోపాన మధిరోహణము చేస్తుంది.

అమ్మ అనుగ్రహ వీక్షణాలు సర్వదా సర్వధా సర్వులపై సర్వత్రా ప్రసరించుగాక !!!

(సో॥ శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తిగారి ప్రసంగం ఆధారంగా)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!