అమ్మ శరీరం అతి కోమలం. కుసుమ సమము. అయితే అమ్మ అనుకోవాలే కాని అది వజ్రసదృశం కాగలదు. నాన్నగారి మాటల్లో చెప్పాలంటే అమ్మ తన బాధను చిలకకొయ్యకు తగిలించినట్టు తగిలించ గలదు.
అతి చిన్న వయసులోనే, దాదాపు 5 సంల వయసులో, మన్నవ వెళుతూ దారిలో రైలులో తోటి ప్రయాణీకుడైన కుర్రవాడు చనిపోతే వాడికి ఉంగరం ఇవ్వటమే కాక వాడిని పునర్జీవితుణ్ణి చేసింది. ఆ తరువాత వాడి ప్రాణం పోయింది.అప్పుడు ఆ కుర్రవాడి తాత అంటాడు “అమ్మా! నీవు ఆపదుద్ధారిణివి అనుకున్నాను కానీ ఇంత సంహారకారిణివి అనుకోలేదు.” అని.
అమ్మ ఆ బాలుడిని భూనిక్షిప్తం చేసే సమయంలో ఆ పిల్ల వాడిని భుజానవేసుకుని వేగంగా నడవటం చూసి మన్నవ మోతాదు నల్లఖాసిం విస్తుబోయాడు- ఆ బాలుడి అంత బరువు లేని అమ్మ ఆ పిల్లవాడిని అలా భుజానవేసుకోవటం ఏమిటని.
ఇంకో సమయంలో అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గాడిపొయ్యి కట్టడానికి మనుషులు లేరంటే అమ్మ “నేను వస్తాను పదండి. నా వెంట రామకృష్ణ వస్తాడు.”అని ఆ శ్రమచేయటానికి అమ్మ సిద్ధపడింది. అదీ అమ్మ శరీర ద్వైధీతత్త్వం. మహా సుకుమారి అమ్మ అన్నపూర్ణాలయంలో చేతితోనే సాంబారు కలియ బెట్టిన సంఘటనలు ఉన్నాయి.
అమ్మ గంటల తరబడి నామసప్తాహాలలో పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. అమ్మ నాన్నగారి పొగాకు బ్యారన్ లో అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేది. పూజా సమయాల్లో గంటల తరబడి అలాగే సింహాసనారూఢ అయి ఉండేది. నిద్రిస్తున్నట్లు ఉండేది, అనుక్షణం మెలుకువగా ఉండేది. అనారోగ్యంతో ఉంటూనే అమ్మ బిడ్డల ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా ఉండేది.
` వైద్యులకు అమ్మ శరీరతత్వం అంతుచిక్కేది కాదు. అన్ని శారీరక సమస్యలు ఉన్న ఒక వ్యక్తి ఇలా వ్యవహరించటం మానవమాత్రులకు అసాధ్యం అని విస్తుపోయే వారు. ఔను! అమ్మ మానవమాత్రురాలు కాదుగా మరి ! అమ్మ సాక్షాత్తు ఆది పరాశక్తి. పరమాత్మ పరమాప్తురాలై మాతృమూర్తి అయి దివినుంచి భువి కేతెంచింది.
తాను వెళ్ళ దలుచుకున్న చోటుకు సంకల్ప మాత్రంగా వెళ్ళి బిడ్డల ఆపదలు గట్టెక్కించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందరికో అమ్మ భౌతికంగా వెంట లేకపోయినా అదృశ్యంగా తోడుగా ఉండి ఆపదలు గట్టెక్కించిన ఉదాహరణలు ఎన్నో. భౌతికంగా జిల్లెళ్ళమూడిలోనే ఉంటూ అమ్మ ఎందరికో ఎక్కడెక్కడో కనిపించేది. రామకృష్ణ అన్నయ్యకు అమ్మ ఒక చోట దర్శనం ఇస్తూనే సుదూరంగా వేరే చోట మరెవరితోనో మాట్లాడుతూ కనిపించింది.
ఒక సందర్భంలో ఇద్దరు మాట్లాడుకున్న మాటలను అమ్మ ఉదహరించింది. ఆ సోదరులు ‘అమ్మా నీకెలా తెలిసింది’ అంటే “మీతోపాటు నేను లేనట్రా!” అన్నది. అంటే అమ్మకు భౌతిక దేహంతో అవసరం లేదన్న మాట. అమ్మ బిడ్డలకు ఏదైన ఆపదలు సంభవించినప్పుడు అమ్మ సశరీరంగా కనిపించిన సంఘటనలు కొల్లలు. కమ్యూనిస్టు పార్టీ మాజీ ఎమ్.పి. శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారి కోడలుకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీవ్రగాయాలు అయితే, ఆమెకు ఆపరేషన్ జరిగిన ధియేటర్ లోకి అమ్మ స్వయంగా వెళ్ళినట్టు ప్రసాదరావు గారికి కనిపించింది. దీనికి వీరమాచినేని వారే ప్రత్యక్షసాక్ష్యం. వారు ప్రవృత్తి రీత్యా, వృత్తి రీత్యా కమ్యూనిష్టులు. అందుకే ఆనాటి విలేఖరులు ప్రసాదరావు గారిని ప్రశ్నించారు “సార్! ఇలా అదృశ్యశక్తులను నమ్మటం కమ్యూనిజంకు వ్యతిరేకంగదా!?” అని. దానికి ప్రసాదరావు గారు “ఏమో! కమ్యూనిజం నాకు హేతువాదం నేర్పింది. కళ్ళముందు కనిపించిన దానిని నమ్మవద్దని నేర్పించలేదు.”అని సమాధానం ఇచ్చారు.
ఎక్కడ ఎవరు సహాయం చేసినా వారిని అమ్మ రూపాలుగా భావించి ఆదరించే వారున్నారు. వారి ఔన్నత్యానికి శిరస్సు వంచవలసిందే. ఏతావతా అమ్మ శరీరం భౌతిక ప్రమాణాలకు అందనిది. ఇది దైవత్వానికి సూచికేగా!
జయహోూమాత