1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘అమ్మ’ ఆర్తత్రాణ పరాయణత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా.

‘అమ్మ’ ఆర్తత్రాణ పరాయణత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా.

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 19
Month : October
Issue Number : 4
Year : 2020

ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరి వైకుంఠాన్ని విడిచి ఎన్నోవేషాలు ధరించాడు.

‘దారుకావన తపోధనుల నిగ్రహశక్తి

పరికింప తరుణినై తిరుగలేదె అమృతమ్ము నాశించు అసురుల వచింప

మోహినీ వేషమ్ము పూనలేదె

కామవైరి నటన్న కైలాసపతి గర్వ

మణగింప నటినై ఆడలేదె

వనసీమ పార్ధుడు భద్రను వెంటాడ

నేను సుభద్రనై నిలువలేదె

జంగమ స్థావరాత్మక జగతిలోన

 నేను వేయని వేషమే కానరాదు

 భక్తజన రక్షణార్ధ మేపనినిగాని

జేతు నేవేషమైనను వేతు నబలా!’ అంటారు శ్రీకృష్ణపరమాత్మ రుక్మిణీ దేవితో.

ఆర్తత్రాణ పరాయణ అమ్మ సశరీరంగా జిల్లెళ్ళమూడిలోనే ఉంటూ బిడ్డలను ఆదుకోవటానికి వ్యక్తంగాను, అవ్యక్తంగాను ఎన్నో రూపాలను ధరించిన సందర్భా లెన్నో ఉన్నాయి. కొన్నిటిని వివరిస్తా.

1. రెడ్డి సుబ్బయ్య అమ్మకి నమ్మినబంటులా సేవలు చేసేవాడు. తను ఒకనాడు వరినారు కొనుగోలు చెయ్యటానికి ఎండ్లబండి తోలుకుని బాపట్ల వెళ్ళాడు. వరినారు పీకించి, కట్టలు కట్టించి, బండిమీద ఎగుమతి చేయించు నప్పటికి చీకటి పడవస్తున్నది. తను ఒంటరినన్న భయం ఆవహించింది. బండి వెంట ఎవరైనా తోడువస్తే బాగుండునని మానసికంగా గగ్గోలు పెడుతున్నాడు.

తక్షణం ‘అమ్మ’ ఒక పల్లెటూరి మనిషిలా వేషం ధరించింది. పంచకట్టు, ఒక చేతిలో కర్ర, నోటిలో చుట్ట. ఆ మనిషి సుబ్బయ్య బండిని అనుసరిస్తూ 7వ మైలు దాకా వచ్చాడు. సుబ్బయ్య ‘బ్రతుకు జీవుడా!’ అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మనిషి సుబ్బయ్యతో ‘ఒకరూపాయి ఇవ్వు, సారా త్రాగుతా అన్నాడు. తనకు తోడుగా వచ్చి సాయం చేశాడు కదా అని సుబ్బయ్య అతనికి ఒక రూపాయ ఇచ్చాడు.

సుబ్బయ్య జిల్లెళ్ళమూడి చేరి బండి విప్పుకుని స్నానం చేసి అన్నం తిని రాత్రిపూట నాన్నగారింటికి కాపలా కోసం చేత కర్ర పట్టుకుని డ్యూటీకి వచ్చాడు. 

సుబ్బయ్యని చూడగానే అమ్మ “ఏరా! సారా త్రాగుతానంటే కానీ రూపాయి ఇవ్వవా? నీ రూపాయి నాకు అక్కర్లేదు. తీసుకో” అంటూ అదే రూపాయ బిళ్ళను అతని చేతిలో పెట్టింది.

2. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి అమ్మమ్మగారు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మ శ్రీచరణాలకు సమస్కరించుకుని “అమ్మా! ఈ పార్శ్వపు నొప్పితో సరకం అనుభవిస్తున్నాను. నువ్వే కరుణించాలి” అని ప్రార్ధించింది. అమ్మ చిరునవ్వు నవ్వేసి “మానవశరీరం కదమ్మా! బాధలు తప్పుతాయా?” అన్నది. ఆమెకు నిరాశ, విసుగు, కోపం వచ్చాయి. అక్కడ (జిల్లెళ్ళమూడిలో) మహిమలు మహిమలు అంటారు గానీ ఏ మహిమలు లేవు అన్నది ఇంటికి వెళ్ళి.

ఆమెను అమ్మ మాటలతో ఓదార్చింది. కానీ తల్లి మనస్సు ఊరుకోలేదు. అమ్మ తన అలౌకిక శక్తి బిడ్డలను ఉద్ధరించటానికి వెచ్చిస్తుంది.

మర్నాడు నీలం చీర కట్టుకుని ఒక గ్రామీణ యువతిలా వేషం ధరించి వారిల్లు వెదుక్కుంటూ వెళ్ళి “నేను పార్శ్వపు నొప్పికి పసరు వైద్యం చేస్తాను” అన్నది. తనకొక ఊరు లేదట, తనకొక పేరు లేదట, అన్ని ఊళ్ళూ తిరుగుతూ ఉంటుందట.

ఆ విశ్వ సంమోహన విశ్వ ప్రకాశక శక్తిని కీర్తిస్తూ అన్నమాచార్యుల వారు అంటారు.

‘సర్వ పరిపూర్ణునకు సంచార మిక నేడ? 

నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ

 ఉర్వీధరునకు కాలూదనొక చోటేడ?

 పార్వతీస్తుత్యునకు భావమికనేడ?’ అని.

సరే ఆమెకు పసరు వైద్యం చేసి మళ్ళీ వస్తానని చెప్పి తను వెళ్ళిపోయింది. మరుక్షణం అమ్మమ్మగారి పార్శ్వపు నొప్పే పలాయనం చిత్తగించింది. వెదుక్కుంటూ వచ్చి, ఉచితంగా వైద్యం చేసి, బాధా నివారణ కావించిన ఆ కోసం పరిసర గ్రామాలన్నిటా వాకబు చేశారు. బియ్యమో, చీరో పెడదామని కృతజ్ఞత తెలుపుకుందామనుకున్నారు. ఆమె చిరునామా తెలియలేదు. ఉంటే కదా! పూర్వము ఆకాశరాజుకు సోది చెపుతానంటూ శ్రీవేంకటాచలపతి ఎఱుకల సాని వేషం వేసిన వైనం స్ఫురిస్తుంది మనకు.

3. తిరుపతిలో శ్రీనివాసుని దర్శనార్థియై క్యూలో నిలిచియున్న గుడియాత్తం సో శ్రీచంద్రన్ వద్దకు ఒక ముత్తైదువ రూపంలో వెళ్ళి ప్రసాదం పెట్టింది.

శ్రీవీరమాచనేని ప్రసాదరావు గారి కోడలు ఘోరమైన కారు ప్రమాదంలో తీవ్రమైన గాయాలకు గురైంది. ఆపరేషన్ చేసినా అవయవాలు పొందికగా సౌష్ఠవంగా పూర్వస్థితికి వస్తాయనే నమ్మకం లేదన్నారు వైద్యులు. ఆత్మీయులంతా నైరాశ్యంతో ఖిన్నవదనులై యున్నారు. ప్రసాదరావు గారు ఆందోళనలో మునిగి పోయారు.

మన ఆర్తి, దుస్థితి అమ్మ హృదయాన్ని కదిలిస్తుంది. ఆ సమయంలో ‘అమ్మ’ సర్జన్ వేషం ధరించి ఆపరేషన్ ధియేటర్లోకి వెళ్ళటం ప్రసాదరావుగారు కళ్ళారా దర్శించారు.

ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అని వేరే చెప్పనక్కరలేదు.

ఇంకా ఇదే విధమైన దర్శనాలు అనుగ్రహాలు బుద్ధిమంతుడు అన్నయ్య, రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య, పి.ఎస్.ఆర్ అన్నయ్య, నాదెండ్ల భ్రమరాం బక్కయ్య, వఝ మల్లికార్జున వరప్రసాద్ (మల్లు) అన్నయ్య ఎందరికో కలిగాయి. 

అయితే ఒక వేషం ధరించి వెళ్ళనవసరం లేదు: సంకల్ప మాత్రం చేతనే అమ్మ అవ్యక్తంగా రక్షించే విధానానికి ఒక ఉదాహరణ:

సో॥ శ్రీయార్లగడ్డ రాఘవయ్యగారు మరికొందరితో కలిసి కృష్ణా నదిలో ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. సాగర సంగమ పవిత్ర తీర్ధ జలాన్ని తెచ్చి అమ్మ పదాంబుజములను అభిషేకించవలెనని వారి కోరిక. కాగా, పోగా పోగా సరంగుకి గమ్యం అగమ్యమైంది. ఎటుచూచినా నీరే. నడి సంద్రంలో చిక్కుకున్నట్లుంది. తీరం కానరావట్లేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సరంగు ఒక హెచ్చరిక చేశాడు – ‘కొద్దిసేపట్లో ప్రవాహం పాటు తిరుగుతుంది. అంటే నదిలో నీరు వేగంగా సముద్రంలోకి పోతుంది. అంటే పడవ సముద్రంలోకి కొట్టుకు పోతుంది. కడసారి దైవాన్ని స్మరించుకోండి’ అని.

వెంటనే రాఘవయ్యగారు అంజలి ఘటించి ‘పాహి! పాహి!’ అంటూ అమ్మను శరణు వేడారు. తక్షణం అమ్మ ఆ పడవలోని ఒకామెకు స్వప్నదర్శనం ఇచ్చి ‘ఫలానా దిక్కుగా వెడితే తీరం చేరవచ్చును’ అని సూచించింది. ఆమె మాట నమ్మి సరంగు చుక్కాని దిశ మార్చి ఆ దిశలో పడవ నడిపాడు. అమ్మ దిశా నిర్దేశం చేస్తే తిరుగేముంది? వారంతా కొద్ది సేపట్లో క్షేమంగా తీరైన తీరాన్ని చేరుకున్నారు.

అసలు అమ్మకు ఈ అవస్థలు, తాపత్రయం ఎందుకు? తాను మహిమాన్విత మాతృత్వ మమకార పాశానికి బందీ కావటమే. ఈ మాటని కొంచెం వివరిస్తాను.

ఒకనాటి సాయం సమయంలో అమ్మ శ్రీ చరణ సన్నిధిలో సంధ్యావందనం జరుగుతోంది. ‘తవ శుభ నామ స్మరణం తాపత్రయ హరణం’ అంటూ గానం చేస్తున్నారు. చెంతనే ఉన్న సో॥ శ్రీ చాగంటి వెంకట్రావు గారితో అమ్మ “నాన్నా! నాకే తాపత్రయం పోలేదు, మీకేమి పోగొడతాను? నాకు ఒక లారీ బియ్యం, 10 బస్తాల చింతకాయలు, 1 బస్తా కందిపప్పు కావాలి. చూడు. పోయి పోయి నేను ఎక్కడ ఉన్నానో!” అన్నది.

నిజమే. అమ్మకు పరమార్ధమే స్వార్ధం: పర హితార్థమే పరమ ప్రయోజనం. అది విశ్వశ్రేయః కారకం.

కాగా జగత్కర్త జగద్భర్త అమ్మకి వేరే పని లేదా? అంటే ఆ ప్రశ్నకు సమాధానం గెలీలియో చాలా సూటిగా సరళంగా సుందరంగా చెప్పారు – ‘The Sun, with all those planets revolving around it and dependent on it, can still ripen a bunch of grapes as if it had nothing else in the universe to do.’ అని.

ఆర్తత్రాణ పరాయణ మన అమ్మ శ్రీచరణాలకు శత సహస్రాధిక కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలులు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!