భగవంతుని సేవించటం కంటే భాగవతుని సేవించటం విశేషఫలాన్ని ఇస్తుంది. ‘గోపీభర్తృః పదకమలయోః దాసదాసాను దాసః’ అనేది విశిష్టాద్వైతసారం.
అమ్మ అనే పదంలో ‘అ’ అక్షరం, నాన్న అనే పదంలో ‘న్న’ అక్షరం కలిపితే ‘అన్న’ పదం వస్తుంది. తల్లిదండ్రుల ఆదరణ, ఆప్యాయతల్ని తోడబుట్టిన వారికి అందించేవాడే అన్నయ్య. అట్టి సోదరుల్ని సన్మానించుకోవడం సంస్థకి ఆనందదాయకం, మహద్భాగ్యం. ఒకసారి సో॥ శ్రీ వల్లూరి పార్థసారధిరావుగారు జిల్లేళ్ళమూడి వచ్చారు. వారికి అమ్మ స్వయంగా కాఫీ, ఫలహారాల్ని అందించింది. అలా అమ్మ అమృత హస్తాల మీదుగా అమ్మప్రసాదాన్ని స్వీకరించిన వారు, ‘అమ్మ! ఇది నా అదృష్టం నా భాగ్యం’ అంటూ మురిసిపోయారు. అందుకు అమ్మ, “కాదు, నాన్న! ఆ భాగ్యం, ఆ అదృష్టం మీవికాదు, నావి” అన్నది.
ఈ నేపథ్యంలో ‘నిత్యాన్నదాన పథకం నిర్వహణ’ కొరకు విశేష కృషి సల్పిన శ్రీ బి.యల్.యన్. శాస్త్రిగార్ని, ‘మాతృశ్రీ విద్యాపరిషత్’ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్న శ్రీ బి. రామబ్రహ్మం గార్ని, ‘యాగశాల, సంస్థభవన నిర్మాణములలో అమోఘ సలహా సహకారాలనందించిన శ్రీ సి. రాజగోపాలరావు గార్ని, ఇటీవల కాలంలో అన్నపూర్ణాలయంకు వెన్నెముకగా నిల్పిన ‘ధాన్యాభిషేక పవిత్ర కార్యక్రమ రచన’ చేసిన శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గార్ని సంస్థ ఘనంగా సన్మానించింది. ఈ సముచిత సన్మాన కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ.వి. ధర్మసూరి శ్రీకారం చుట్టారు. సంస్థ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ నిండు మనస్సుతో ఆమోదముద్ర వేశారు. సంకల్పం సమర్థవంతంగా కార్యరూపం ధరించటానికి సంస్థ పాట్రన్ శ్రీ బి. రవీంద్రరావు సహకరించారు.
ఈ సన్మాన సభను శ్రీ విశ్వజననీ పరిషత్ నాన్నగారి ఆరాధనోత్సవాల్ని పురస్కరించుకొని ది. 16.02.2012 తేదీన అమ్మ ఆశీః పూర్వకంగా జిల్లెళ్ళమూడిలో రమణీయంగా నిర్వహించింది. సో॥ శ్రీ రావూరి ప్రసాద్ ప్రార్థనాగీతంతో సభ ఆరంభమైంది. సో॥ శ్రీ బి. రవీంద్రరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. డా॥ యు. వరలక్ష్మి, డా. బి.యల్.సుగుణ, డా॥ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి, శ్రీ యన్. లక్ష్మణరావు గార్లు సన్మానగ్రహీతల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.
సోదరీ సోదరులు సన్మానగ్రహీతల్ని సుమహారాలతో, దుశ్శాలువలతో, నూతన వస్త్రాలతో, రుద్రాక్షమాలలతో, సన్మాన పత్రంతో సన్మానించారు.
పెదపులిపాక శ్రీలలితాపీఠాధిపతులు శ్రీవాసుదేవానందగిరి స్వాములవారు, “మానం అంటే కొలవటం, సన్మానం అంటే సరిగా విలువ కట్టడం. మనం చేసే సన్మానం అక్షరాల వరకే పరిమితం. కానీ అక్షర రూపిణి అమ్మ వాస్తవానికి వారి సేవానిరతికి విలువ కట్టి అనుగ్రహిస్తుంది. జగన్మాతని ‘చతుర్భుజ’ అని కీర్తిస్తాం. ఈ నలుగురు సోదరులు అమ్మకి నాలుగు భుజాలు, సంస్థకి నాలుగు మూలస్థంభాలు. వీరంతా కమిట్మెంట్ కలిగిన కమిటీ మెంబర్లుగా తమ అమూల్య సేవలను అందించారు” అంటూ ఆశీః పూర్వక అనుగ్రహభాషణం చేశారు.
సన్మానగ్రహీతలు సముచిత రీతిలో స్పందించారు. తమ ప్రయోజకత్వం ఏమీలేదనీ, అమ్మ అనుగ్రహం ఆశీర్వచనం బలంతోనే తాము ఏ సందర్భంగానైనా కృతకృత్యులమయ్యామనీ, అమ్మ సేవ చేసుకోవటమే జన్మ సాఫల్యతనీ కృతార్థత చరితార్ధత అనీ సవినయంగా మనవిచేశారు. వారు నుడివిన సంగతి యదార్థం.
‘సిద్ధ్యన్తి కర్మసు మహత్స్వపియన్నియోజ్యాః
సంభావనాగుణమవేహి తమీశ్వరాణాం’
ఎవరైనా ఘనకార్యములు సాధించగలిగారంటే అందుకు హేతువు వారిని ఆయా స్థానాల్లోనియోగించిన ప్రభువుల ఔన్నత్యం అని అంటారు. మహాకవి కాళిదాసు శాకుంతంలో
‘ధన్యాస్తే భవ దీక్షణ క్షణ గతేః
పాత్రీకృతాః స్వీకృతాః’
దైవం ఎవరిని తనవారుగా స్వీకరిస్తుందో, ఎవరిపై తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరిస్తాయో… వారే ధన్యులు అని అంటారు శంకరాచార్యులు వివేకచూడామణిలో.
ఒకసారి రామకృష్ణ అన్నయ్యతో అమ్మ, “నువ్వు అప్పికట్లకు కరణం. నాకు ఉపకరణం” అని అన్నది. అమ్మ (సంస్థ)కి ఉపకరణాలుగా సేవలు చేసే మహద్భాగ్యాన్ని పొందిన ఆ నలుగురు అన్నయ్యలు ముమ్మాటికీ ధన్యులే.
నాన్నగారికి ఆటలన్నా సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఎంతో ఇష్టం. కనుకనే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడలలో విజేతలైన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు సంస్థ కార్యనిర్వాహక సభ్యులు బహుమతి ప్రదానం చేశారు.
‘ఎందరో మహానుభావులు – అని త్యాగరాజస్వామి అంటే అమ్మ “అందరూ మహానుభావులే” అని అన్నది. ఈ సభను దిగ్విజయం చేసిన చిన్నారులు, అన్నయ్యలు, అక్కయ్యలు… అందరికీ సంస్థ తరపున కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను’ అంటూ సంస్థ కార్యదర్శి శ్రీ వి. రమేష్బాబ్బు వందన సమర్పణ చేశారు, ఈ మహత్కార్య నిర్వహణ ద్వారా తమను తాము సన్మానించుకొన్నామని ఆనందించారు.
ఆర్షవిజ్ఞాన నిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి సభను ఆద్యంతము రసవత్తరంగా నిర్వహించారు. సంస్థ సభా నిర్వాహకుల్నీ సముచితరీతిలో సత్కరించింది.