అమ్మ ఉపన్యాసాలు చెయ్యలేదు, ఉద్గ్రంథాలు వ్రాయలేదు, ఏమీ చదువుకోక పోయినా చదువులలో సార మెల్ల కనిపిస్తుంది అమ్మ మాటలలో. పైగా వేదాంత పారిభాషిక పద ఘోష ఉండదు. ఆధ్యాత్మికాను భూతుల గురించి అమ్మ ఎక్కడా చెప్పలేదు. అమ్మ మాటలు విజ్ఞానభారాన్ని మోసే శ్రామికులు కాదు. అనుభవ సారాన్ని అలవోకగా సంసారపక్షంగా సామాన్యుని సజీవభాషలో హితమితంగా చెప్పింది. అనితర సాధ్యమైన అద్వైత వాగ్విభూతి అమ్మది. అమ్మ తన పాదస్పర్శతో అనేక గ్రామాలు, ప్రదేశాలు పునీతం చేసింది. కానీ తన ‘పదస్పర్శ’తో ప్రపంచ మంతా చుట్టింది.
అమ్మ ఏమిచ్చింది? (అన్నపూర్ణాలయం తదితర సంస్థలను మించి) అంటే – లోకానికి ప్రాణవాయువు లాంటి అమృతవాక్యాలు ఇచ్చింది! అమ్మే వచ్చి ఎదురుగా నిలబడి చెపుతున్నట్టు ఎక్కడ నుంచో లీలగా వినిపిస్తాయి. అమ్మ ఒక ఆదర్శ సమాజాన్ని కలగన్నది. దాన్ని సాకారం చెయ్యటానికి మాతృ వాత్సల్యమనే వల పన్నినది. మనమంతగా పట్టించుకోము గాని మనకు తెలియకుండానే మార్గ దర్శనం చేస్తాయి అమ్మ మాటలు. అదొక నిశ్శబ్ద విప్లవ గాత్రం, మనల్ని నడిపించే జీవన సూత్రం. అమ్మ వచో “విభూతి” శరీరమంతా అలముకో గలిగిన వాళ్ళు అభినవ శంకరులే! “శం కరోతీతి శంకరః” అని గదా పురాణోక్తి.
అతి సాధారణ శబ్దంలో మనకు తెలియని అయస్కాంతశక్తి ఏదో నిక్షిప్తం చేసి ఆగామి తరాలకు కూడా అందేలా చేసిన మహత్తర ప్రక్రియ అమ్మ మాటలు. ఆ వాక్చాతుర్య ప్రభావం తరతరాలకు వెంటాడుతూ ఉంటుంది. సాహిత్యానికి సద్యః ప్రయోజనం విని లేక చదివి ఒక ఆత్మసంతృప్తిని పొందటం.
కావ్యం యశసే ర్థ కృతయే వ్యవహార విదే శివేతరక్షత యే
సద్యః పర నిర్వృతయే కాంతా సమ్మిత తయోపదేశ యుజే
అని కావ్యప్రకాశ కారుడు మమ్మటుని నిర్వచనం. కీర్తి, ధనము, అశుభ నివారణతో పాటు వ్యవహార జ్ఞానము, ఆనంద తన్మయత్వం కూడా కలుగుతుందని చెప్పాడు. మనం తిన్న అన్నం జీర్ణమై వేలాది రక్తనాళాలలో కలసి ప్రవహించి మనిషికి శారీరకంగా, మానసికంగా ఏ విధంగా బలమిస్తుందో, ఎలా చైతన్యవంతం చేస్తుందో అలాగే సాహిత్యాను శీలనం చేత ప్రభావితుడౌతాడు. ఇది సాధారణంగా సాహిత్యం కలిగించే ప్రయోజనం.
కానీ అమ్మ సూత్ర సాహిత్యానికొక ప్రత్యేక ప్రయోజనం ఉన్నది. అమ్మ మాటలు, శ్రవణ చక్షు రింద్రియాల ద్వారా వాగ్రూపంలోనో అక్షర రూపంలోనో ప్రవేశించి రక్తనిష్టమై మనోబుధ్యహంకారాలను స్పృశించి శరీరపరివ్యాప్తమౌతాయి. మన అలవాట్లను, ఆలోచనల్ని, స్వభావాన్నీ ప్రభావితం చేస్తాయి. అలా ఒక తరం వారిలో రక్త నిష్ట మైన భావజాలం తదనంతర తరానికి సంక్రమింప చేస్తాయి అమ్మ మాటలు. జన్యు కణాల్ని ప్రభావితమూ, ప్రచలితమూ చెయ్యగల జెనిటిక్ ఇంజనీరింగ్ సూత్రాలవలే పనిచేస్తాయి అమ్మ వాక్యాలు. ఈ మాటలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా మాన్యులు శ్రీ కొండముది రామకృష్ణ, ప్రసాదరాయ కులపతి, ఎక్కిరాల సోదరులు, మల్లాప్రగడ శ్రీరంగారావు, నారపరాజు శ్రీధరరావు, రావూరి నరసింహమూర్తి, దేశిరాజు కామరాజు, హనుమబాబు, రాజుపాలెపు రామచంద్రరావు, రామరాజు కృష్ణమూర్తి, మరకాని లలితాంబ, జన్నాభట్ల వెంకట్రామయ్య, వంటి వారెందరో కనిపిస్తారు. వీరందరూ మాతృసేవా యోగ్యమైన మనఃశరీరాలతో జన్మించిన ధన్యులు. మాతృసేవాదక్షమైన తరువాతి తరాన్ని ఇచ్చిన మాన్యులు,
అమ్మ వాక్యాలు, తాను లక్ష్యించిన, స్వప్నించిన సహజీవన సౌందర్యం తొణికిసలాడే అహంకార రహిత, ఆదర్శ సమాజం కోసం అమ్మ ఇచ్చిన ఆస్తి. ఇవి తెలుగు వారి, తెలుగు వారికి మాత్రమే దక్కిన తరగని, చెరగని సంపద. రక్షించుకోవాలి. ఎంతగా జన బాహుళ్యం లోకి వెళితే సమాజం అంతగా శాంతి అభ్యుదయాలకు నిలయం అవుతుంది. అమ్మ తన మాట ద్వారా చూపుద్వారా, ఆచరణ ద్వారా ఎందరో ప్రభావితులైనారు, చైతన్యవంతులయ్యారు. ఆ ప్రభావ ప్రక్రియ ఏ నిర్వచన పరిధిలోనూ ఇమిడేది కాదు. అహంకారం వదులుకున్నవారు, చెడ్డ స్వభావాన్ని మార్చుకున్న వారు, స్వార్థాన్ని పక్కన పెట్టిన వారు, సంప్రదాయానికి, కుటుంబ జీవనానికి ప్రముఖ స్థానం యిచ్చిన వారు, పక్కవాడికి పట్టెడన్నం పెట్టాలన్న దీక్ష పూనినవారు ఇలా ఎందరెందరో కనిపిస్తారు. ఇదంతా అమ్మ దివ్య వ్యక్తిత్వపు వెలుగులో, మానవాతీత ఆకర్షణ, ఆచరణాత్మక ప్రయోగంవల్లా అని వేరే చెప్ప పని లేదు. ఈ ధన్యజీవుల జీవితానుభవాలు, భక్తి ప్రపత్తులు తరువాత తరాలకు సంక్రమించి అమ్మ దారిలో నడవటం అమ్మ ప్రణాళిక, అమ్మ సంకల్పం. ఇదొక నిరంతర ప్రవాహమగు గాక.
స్వానుభవంతో తత్త్వసందేశాన్ని అందించిన మహనీయులు అరుదు. అతి సాధారణ శబ్దంలో అసాధారణ ఆకర్షణశక్తి నిక్షిప్తం చేసి, దాన్నొక జీవన సూత్రంగా మార్చే అయస్కాంత విద్య అమ్మకు తెలుసు. అనుభవం లేకపోతే మహావాక్యాలు మన వాక్యాలే అని అమ్మ చెప్పింది. అనుభవపూర్వకంగా చెప్పిన అమ్మ మాటలు మహావాక్యాలే అనటంలో సందేహం లేదు. అమ్మంత మాటల పొదుపరి మరొకరు కానరారు. అమ్మమాట ఒక ‘పన్’ చదార పలుకు. ఎప్పుడూ జీవిత సత్యాన్నే చిలుకు.
కాలగతిలో మార్పు అనివార్యం. సాంకేతిక పరిణామాలు, తద్వారా జీవనస్థితిగతులు అనూహ్య రీతిలో, అనూహ్య వేగంతో సాగిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థలో ఆచార, ఆధ్యాత్మిక, నైతిక, మానవీయ విలువలు తరిగిపోతున్న రోజులు. ఇట్టి అపూర్వ కుటుంబవ్యవస్థ సంఘర్షణకు లోనవడం, పతన మవటం ఎంత మాత్రం ఇష్టం లేదు అమ్మకు. పునరుజ్జీవనాన్ని కాంక్షించింది. నేటి ప్రపంచీకరణ ఝంఝామారుతంలో సనాతన సంస్కృతీ సందేశ మేమిటన్న సందేహానికి జవాబు నానా రుచిరార్థ సూక్తి నిధి లాంటి అమ్మ మాటలు.