వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత 2015 అక్టోబరు మాసంలో మా దంపతులం తిరుపతి వెళ్ళాము.
ఎప్పటి వలెనే రైలు దిగగానే క్రింద హోటల్లో గది అద్దెకు తీసుకుని, స్నానాదికాలు గావించి కొండపైకి వెళ్ళాము.
అక్కడ వికలాంగుల కొరకు, వృద్ధుల కొరకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన హాలులోనికి ప్రవేశించాము. ప్రతిరోజు అక్కడ నుంచి వృద్ధులను, వికలాంగులను, వారికి సహాయకులుగా వచ్చిన వారికి (సహాయకులు ఒక్కరిని మాత్రమే) ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా మహాద్వారం గుండా దైవదర్శనానికి ప్రవేశం కలిగిస్తారు..
అయితే మేము వెళ్ళేసరికి ఆలస్యమయి పోయింది. 15 నిమిషాలే వ్యవధి వుండటంతో ముందుగా వరాహనరసింహస్వామిని దర్శించకుండా, హాలులోకి ప్రవేశించే ముందు జరగవలసిన లాంఛనాలను పాటించకుండా, అంటే – I.D. కార్డుచూపి, ఫింగర్ ప్రింట్స్ వేయించుకుని, లడ్డుకూపన్ తీసుకుని హాలులోకి ప్రవేశించాలి. అవేమీ లేకుండా I.D. కార్డుమాత్రమే చూపి నేరుగా హాల్లోకి ప్రవేశించాము. అక్కడి సిబ్బంది కూడా మాకు మిగతావేమి చెప్పలేదు.
తీరా క్యూలోంచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చాకగాని తెలియలేదు. కూపన్ చూపితే గాని లడ్డు ఇవ్వరని. ఎక్కడకు వెళ్ళినా లడ్డు దొరకలేదు. “లడ్డు లేకుండా జిల్లెళ్ళమూడి ఎలా వెళ్ళటం? అక్కడ ఎవరికీ ఇవ్వకపోయినా కనీసం మేము తినటానికైనా ఒక్క లడ్డు లేదే” అని మధన పడుతూ శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని ముందుకు వెడుతూంటే అక్కడ ఒక నడివయసుగల మహిళ నుంచుని వుంది. ఆవిడ చేతిలో పేపరు బ్యాగు అందులో లడ్లు వున్నవి.
నేను ముందుకు పోతూంటే మా ఆవిడ ఆమె దగ్గరకు వెళ్ళి ” ఈ లడ్లు మీకెక్కడివి?” అని అడిగింది.
అందుకావిడ “ఎక్కడవేమిటి? తీసుకున్నాను. మీరు తీసుకోలేదా?” అని అడిగింది.
“లేదు. మేము కూపన్ తీసుకోలేదు. అది లేనిదే లడ్లు ఇవ్వమంటున్నారు. కౌంటర్లో ” అంది.
ఆవిడ “సీనియర్ సిటిజన్ కౌంటర్ లో కూపన్ యిస్తారే..” అంది.
“అది మాకు తెలియక దర్శనం మాత్రం చేసుకువచ్చాము. ఒక్క లడ్డు కూడా మా దగ్గర లేదిప్పుడు” అన్నది మావిడ.
“అయితే నా దగ్గర ఇవిగో ఆరులడ్లు వున్నవి. మీకు కావలసినన్ని తీసుకోండి” అన్నది తన చేతిలో పేపరు బ్యాగు తెరచి చూపుతూ.
తీసుకుందుకు మేము మొహమాటపడుతూంటే, ఆవిడే ఒక లడ్డూ తీసి మా ఆవిడ చేతిలో పెట్టి “ఇంకా తీసుకోండి” అంది నా వైపు తిరిగి. “ఒక లడ్డూని ఒక బంగారం నాణెంలా అందరూ భావిస్తున్న ఆతరుణంలో ఈవిడేమిటి ఇలా ఇస్తోంది?” అని ఆశ్చర్యపోతూ నేనూ ఒక లడ్డూ తీసుకుని వాటి ఖరీదు ఇవ్వబోయాను.
“వద్దు వద్దు. మీరు డబ్బులేమీ ఇవ్వనక్కరలేదు. ముందు ఇవి తీసుకుని వరాహస్వామిని దర్శనం చేసుకుని, మళ్ళీ వెళ్ళి క్యూలో నుంచుని కూపన్ తీసుకుని స్వామిని దర్శించుకుని వెళ్ళండి”. అందావిడ. డబ్బు తీసుకోవడానికి తిరస్కరిస్తూ.
అప్పుడనిపించింది మాకు – లడ్లు లేవని బాధడుతున్న మమ్మల్ని చూసి ఆవిడ రూపంలో ‘అమ్మే’ మా ముందుకు వచ్చి లడ్లు అందించిందని.
“అంటే ఎక్కడకు వెళ్ళినా అమ్మ మావెంటే వుంటూ మమ్మల్ని గమనిస్తోందన్న మాట” అని అనుకుంటూ వెళ్ళి శ్రీ వరాహస్వామిని దర్శించుకుని వెంటనే తిరిగి వచ్చేసరికి ఆవిడ అక్కడ లేదు.
అక్కడ లేదు. గాని మేమెక్కడకు వెళ్ళినా ‘అమ్మ’ వుండి మమ్మల్ని నడిపిస్తోందన్న గాఢనమ్మకం మాకు కలిగింది
ఆవిడ చెప్పినట్లే – ఆపూట మాకు భోజనం లేకపోయినా వెళ్ళి, మళ్ళా క్యూలో నుంచుని, కూపన్ తీసుకుని, మరలా శ్రీ స్వామివారిని కనులారా దర్శించుకుని, మాకు కావలసిన లడ్లు సంపాదించి, తృప్తిగా మా తిరుపతి యాత్రను ముగించుకుని సంతృప్తిగా ఇల్లు చేరాము.
అంతా ‘అమ్మ’దయ! ‘శ్రీస్వామి వారి దయ! “స్వామి వారి దయ” అని ఎందుకంటున్నానంటే ఆ పూట భోజనం లేదనుకునే మాకు స్వామి వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టించాడు మరి !
దటీజ్ అమ్మ ! దటీజ్ స్వామి !