1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ ఉన్నది – మన తోనే ఉన్నది మనలోనే ఉన్నది

అమ్మ ఉన్నది – మన తోనే ఉన్నది మనలోనే ఉన్నది

Parsa Hara Gopal
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 9
Year : 2012

‘అం ఆ’ అనేక విధాలుగా, మన జీవితంలో అనేక రూపాలలో కనిపిస్తూ వుంటుంది. అంతేకాదు. కనబడకుండా కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే అమ్మ విధానం. కదా ! ఉండి కూడలేనట్లుగా వుండటం, లేకుండానే ఉన్నట్లుగా అనుభవాలు ఇవ్వటం అమ్మ పద్ధతి. అందుకే అమ్మ ఉన్నదా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం, మన మొర వింటోందా? అన్న ప్రశ్నకు సమాధానం ఏ విధంగా వుండాలి ? ఏమో !

ఈ మధ్య తెలిసినవారితో అంఆ గురించి చెప్తున్నాను. అనుభవాలు వివరిస్తున్నాను.  అం ఆ గురించి విన్న ఒకతను  ఈ విధంగా అన్నాడు “అమ్మ” ఇప్పుడు లేరండి. 

ఆ మాటతో నా మనస్సు చివుక్కుమన్నది. కొంచెం బాధగా అనిపించింది. వెంటనే నేను ఈ విధంగా అన్నాను. 

“చూసే వాళ్లకు చూడగలిగే వాళ్లకు అంఆ ఎప్పుడూ వున్నది. ఇక్కడే వున్నది. చూడలేని వాళ్లకు అంఆ ఎప్పుడూ కనపడదు. అతనికి జవాబు చెప్పేసాను.  కాని ఆ ప్రశ్న మాత్రం నన్ను వెంటాడటం మానలేదు.

“అంఆ ఉన్నదా? లేదా? ఈ ప్రశ్నకు సమాధానం అమ్మ నా జీవితంలో ఎన్నో సార్లు తెలియజేసింది ఉన్నది ఉన్నది ఉన్నది. ముమ్మాటికి వున్నది. అంఆ తన జీవితంలో అన్నీ తెలిసి కూడా తనకు తెలియనట్లే ఎన్నోసార్లు సమాధానంచెప్పేది.

“నాకేం తెలుసు. నేను ఇక్కడే ఉంటాను కదా బయట తిరిగేవాళ్లు మీకే తెలియాలి” అనేది అమ్మ.

ఎవరైనా వచ్చి “ఇది ఎట్లా చెయ్యాలి అమ్మా! అంటే “నాకేం తెలుసురా నాన్నగారిని అడగండి” అనేది. ఈ విధంగా ఉండి కూడా లేనట్లే మసిలేది అంఆ ‘తనకు ఏమి అంటకుండా సాక్షీభూతంగా ఉన్నది అంతా. అన్నీ చూస్తూ అన్నీ తెలిసికూడా. ఏమీ తెలియనట్లుగా వుండిపోయింది. అమ్మ. దీనికి అర్థం … అమ్మ ఉన్నప్పుడు లేనట్లే వుంది.

 మరి లేనప్పుడు ఎలా వున్నదో చూద్దాం..

అమ్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఎందఱికో ఎన్నో అనుభూతులు ఎన్నో అనుభవాలు ఇచ్చింది. అటువంటి నా యొక్క అనుభవం ఇక్కడ వివరిస్తాను. 

ఈ మధ్య సెప్టెంబరు 2011లో నాకు ‘CURACAO’ అనే ద్వీపానికి వెళ్లే అవకాశం లభించింది. నా విమానం మధ్యాహ్నం 12.50 PM కి బయలుదేరుతుంది. అది అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి 2 గంటలు ముందుగా విమానాశ్రయానికి వెళ్లాలి. అంటే 10.05 కల్లా అక్కడ ఉండాలి. అనుకోకుండా బయలుదేరడం ఆలస్యం అయింది. 10.20 ని ఇంట్లో బయలు దేరి 10.40ని. కు విమానాశ్రయం చేరాము.

లగేజి చెక్ఇన్ (సామాను అధికారులకు వప్పజెప్పాలి) చేద్దామని వెళ్తే పాస్పోర్టు అడిగాడు. కోటుజేబులో పాంటు జేబులో సూటుకేసులు అయిదు నిమిషాలు వెతికి నా పాస్పోర్ట్ కనబడలేదు. వెంటనే మా వెంటనే ఆవిడకు సామాను అప్పజెప్పి అక్కడే వుండమని కారులో ఇంటిదారిపట్టాను. టైము 10.53 నిమిషాలు. ఎంత వేగంగా వెళ్లినా ఇంటికి వెళ్లి రావడానికి 40. నిమిషాలు పడ్తుంది. ఇంకేమీ ఆలోచించకుండా ‘అంఆ’ నామం చేస్తూ 95-100 MPH వేగంతో ఇంటికి వెళ్లి పాస్ పోర్టు తీసుకొని అదే వేగంతో విమనాశ్రయానికి తిరిగి వచ్చాను..

 టైము 11-20 అయ్యింది. కౌంటరు దగ్గరికి వచ్చేసరికి మా ఆవిడ సామానుతో గాభరాపడ్తూ నిలుచునివుంది. ఇంటర్నేషనల్ ఫ్లయిట్ కనుక 11-25 తర్వాత సామాను తీసుకోరు అన్నాడు. అయినా ప్రయత్నిస్తానన్నాడు. నేను ఆపకుండా ‘అంఆ’ నామం చేసుకుంటూనేను వున్నాను. చివర 2 నిమిషాలలో నా సామాను తీసుకున్నాడు. అయినా సామాను ఆదేశానికి నా విమానం చేరేసరికి చేరుతుందని నమ్మకం లేదన్నాడు. ‘అఆ’ మీద భారం వేసి అలాగే కానియ్యమన్నాను. సామాను అప్పజెప్పేతంతు పూర్తయ్యేసరికి ఇంకా 35 నిమిషాల సమయం మాత్రమే వుంది విమానం ఎక్కడానికి.

మా ఆవిడకు కారు తాళం చెవులు ఇచ్చి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లాను. తీరా సెక్యూరిటీ గేటు వరకు వెళ్ళేసరికి 45-60 నిమిషాలకు సరిపడ్డా లైనులో జనం నిల్చొని వున్నారు. నేను 30 నిమిషాలలో వెళ్లిపోవాలి. ఏం చేయాలో తోచక ముందున్న వాళ్లను ప్రార్థించాను. అర్జంటుగా వెళ్లాలి టైము లేదు నన్ను ముందుకు పోనివ్వండి అని అడిగాను.

మేము గూడా చాలా అర్జంటుగా వెళ్లాలి. మేము పోనివ్వమంటూ నిష్కర్షగా చెప్పారు. ఇద్దరు ముగ్గుర్ని అడిగాను. ఎవరూ ఒప్పుకోలేదు. ‘అంఆ’ నామం మనసులో ఆగలేదు.

ఇంతలో అకస్మాత్తుగా ఆరు అడుగుల ఎత్తుతో దృఢమైన శరీరంతో ఆఫ్రికన్ అమెరికన్ T.S.A. Officer నాదగ్గరకు వచ్చాడు. తను ఇట్లా అడిగాడు.

“నీవు ఒక్కడివే ఉన్నావా?”

“అవును” అన్నాను. “అయితే నాతో రా” అని నన్ను తీసుకొని పోయి వేరే గేటులో అందరికన్నా ముందు నిలబెట్టాడు. ప్రయాణం తొందరలో, విమానం తప్పుతుందేమో అన్నగాభరాతో నేను వెనుకాముందు చూడకుండా సెక్యూరిటీ గేటులోంచి వెళ్లిపోయాను. ఆశ్చర్యం ఏమిటంటే నన్ను ఒక్కడినే T.S.A. Officer తీసుకెళ్తుంటే ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కొందరు గమనించలేదు కూడాను. బహుశా “అంఆ” దయ (మాయ) వల్ల వాళ్లకు ఇవేమీ కనిపించలేదు కాబోలు.

ఇంతటితో నా ప్రయాణం ఆగిపోలేదు. ‘అంఆ’ నామం ఎన్ని వేలుచేయాలో, గుండె ప్రతిచప్పుడుకు ఒక నామం కావచ్చు. సెక్యూరిటీ గేటులోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా ‘MONORAIL’ ఎక్కి ఇంకొక గేటు దగ్గరకు వెళ్లాలి. వీలయినంత గబగబా అడుగులు వేస్తూ Monorail ఎక్కి 5 నిమిషాలు ప్రయాణం చేసి రిట్రెయిన్ దిగి పరుగెత్తుకుంటూ, వెతుక్కుంటూ నేను విమానం ఎక్కవలసిన గేటు దగ్గరకు వెళ్లాను. పరుగెత్తి పరుగెత్తి, ఆందోళనతో గుండెచప్పుడు వింటూ దానికి ‘అంఆ’ నామం జోడిస్తూ వచ్చిన నాకు రొప్పు వచ్చింది. ఆయాసం వచ్చింది.

విమానం బయలుదేరవలసిన సమయం 12.05 PM. నేను అక్కడికి చేరేసరికి 11.57 నిమిషాలయింది. ఇంకా 7 నిమిషాల సమయం వుంది.

అప్పుడే చాలామంది ఎక్కేసారు. ఇంకా కొద్ది మంది మాత్రమే వున్నాము. నేనే చివరివాడిని. అమ్మను శ్రమ పెట్టిన చివరివాడిని. ‘చిరు’ వ్యక్తిని. ఎలాగో 7 నిమిషాలలో అందరం విమానం ఎక్కాము. ఆరాత్రి 8-20 నిమిషాలకు విమానం ‘CURACAO’ ద్వీపం చేరుకుంది. కట్టుబట్టలతో చిన్న చేతి బాగుతో అక్కడికి చేరాను.

అత్యాశ్చర్యకరమైన విషయం. చేరుతుందో చేరదో అని సందేహాస్పదంగా చెప్పిన నా సామాను నాకంటే ముందే చేరింది. అంటే నేను చూసేసరికి సామాను వచ్చేసింది. ఆ రాత్రి హోటలుకు వెళ్లి మా ఇంటికి ఫోను చేసి “అంఆ” నన్ను క్షేమంగా చేర్చిందని చెప్పాను.”

“మీ ‘అంఆ’ నిన్ను ఎప్పుడూ అలాగే చూస్తూ వుంటుంది. చేరుస్తూ వుంటుంది” అన్నది మా ఆవిడ. ‘అంఆ’ నా వెంట వుందా? లేదే? చేస్తానని చెప్తోందా? లేదే? నన్ను హాయిగా చేర్చిందా? ఉరుకులు పెట్టించిందే? నన్నే కాదు నాకు సహాయం వచ్చిన నా భార్యకు కూడా ఆందోళన కలిగించిందే? అయినా మానసికంగా నా వెంటనే వుంది. నాతో పాటు తాను పరుగెత్తింది. అయినా నిరాశ పరచక గమ్యం చేర్చింది. సంతృప్తిని ఇచ్చింది. తిరిగి తిరిగి తననే తలచుకునేట్లుగా పాఠం నేర్పింది. “నీ తప్పిదాలకు, నీ మతిమరుపుకు అమ్మను కష్టపెట్టావు కదా” అని మనసు పొరల్లోంచి అమ్మ చెప్పకనే చెప్పింది.

ఈ విధంగా ఇంకా ఎన్నోవిధాలుగా ‘అంఆ’ చర్మ చక్షువులకు కనిపించకపోయినా ఉన్నాను అని చెప్తోంది. చూపిస్తూవుంది. కాబట్టి ‘అఆ’ ఇప్పుడు ఉన్నదా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ‘లేదు’ కాని అమ్మ వుంది.

నమ్మిన వాళ్లకు (ప్రహ్లాదుడిలాగా) ‘అంఆ’ ఇక్కడే వున్నది. ఇక్కడే వున్నది. మనతోనే ఉన్నది.

మనల్ని చూస్తోంది. మన గురించి ఇంకా విచారిస్తూ వుంది. మనకన్నా శతాధికంగా మన గురించి ఆలోచిస్తోంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!