ఏసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్త అంటాము.
శంకరాచార్య ఎవరు అంటే గురువు అంటాము.
దత్తాత్రేయుడు ఎవరు అంటే అవధూత అంటాము.
కృష్ణుడు ఎవరు అంటే నారాయణుని అవతారము అంటాము.
మరి జిల్లెళ్ళమూడి అమ్మగా పేరు పొందిన బ్రహ్మాండం అనసూయాదేవి ఎవరు? అంటే ఏమి సమాధానం చెప్పాలి? ఎవరు చెప్పాలి?
ఎందుకంటే 1985 లో అమ్మ ఆలయప్రవేశం చేశాక, సమాజంలో, ఆలోచనల్లో, జీవనశైలిలో, బోధనావిధానాలలో, మతపరమైన భావాలను అర్థం చేసుకోవడంలో అనేక రకాల భావాలు ఏర్పడ్డాయి.
మనం సమాజంలో ప్రవక్త అంటే కొత్త మతం స్థాపించినవాడు, గురువు అంటే శాస్త్రాలు బోధించేవాడు, అవతారం అంటే దివ్యశక్తి దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం మానవరూపంలో వచ్చింది, అవధూత అంటే అన్నీ వదిలివేసినవాడు అనే అర్థాలు ఉన్నాయి. వీటిని దాటి మన మనస్సు, బుద్ధి, మేధస్సు ఆలోచించ లేవు.
అమ్మను ఏమనాలి అన్న చర్చ ఈరోజు వచ్చింది కాదు.
అమ్మ తాతగారు చిదంబరరావు గారు “ సరే వీళ్ళందరిని గురించి చెప్పావు గాని, నీవు యెందుకొచ్చావో చెప్పమ్మా నీ అవతారమేమిటో? అని అడుగుతారు.
అమ్మ దానికి సమాధానంగా, నాది అవతారమని ఎవరు చెప్పారు? నేనేదీ పెట్టుకు రాలేదు. నాకేమీ తెలియదు. ప్రత్యేకించి ఒక పని అంటూ లేదు. సృష్టి ఏ వుద్దేశంతో జరుగుతున్నదో” (మాతృశ్రీ జీవిత మహోదధి పేజీ 185) అంటారు. అమ్మ ఇంకొక సందర్భంలో తమ తాతమ్మ మరిడమ్మ తాతమ్మతో, నేను “అమ్మగా నిర్ణయించబడ్డా, అమ్మ అమ్మగా కనుపించక పోయినా, అన్నీ తను యేర్పరచుకొన్నవైనా యేర్పాటు సక్రమంగా నెరవేర్చవలసిందే” (మాతృశ్రీ జీవితమహోదధి పేజీ 160) అంటారు. ఈ సంభాషణ అమ్మ తల్లి రంగమ్మ గారి సంవత్సరీకాలు జరిగి బాపట్ల వచ్చాక జరిగినదే. అప్పటికి అమ్మ వయస్సు ఐదు సంవత్సరాల ఆరు మాసములు (మాతృశ్రీ జీవిత మహోదధి పేజీ 119). అమ్మ 28-03-1923లో జన్మించగా, ఈ సంభాషణ 1928 ఆగస్టు తరువాత జరుగుతుంది.
ఇదే విధంగా తెనాలిలో విన్నకోట వెంకట రత్నశర్మగారితో, వారు “కలియుగానికి కావలసిన అవతారమా అమ్మా నీవు?” అని అడిగితే, అమ్మ “యేం కాదు. అందరం కలియుగానికి అవసరమయ్యే అవతారమెత్తాము. మనమే కాదు, కుక్క నక్క దోమ చీమ కూడ అవసరమయ్యే పాము తేళ్ళతో సహా వచ్చినాము” (మాతృశ్రీ జీవితమహోదధి పేజీ 654) అన్నారు. అప్పుడు అమ్మ వయస్సు రెండు మూడు నెలల్లో పదమూడవ సంవత్సరం నిండుతుంది. అనగా ఫిబ్రవరి 1936 (ప్రాంతంలో జరిగిన సంభాషణ).
ఇవి స్వయంగా తనతో బాటు ఉంటూ, తన సాహచర్యం అనుభవిస్తున్న బంధువులు, హితైషులు అడుగగా అమ్మ చెప్పిన సమాధానాలు.
05-05-1936న అమ్మ వివాహం జరిగింది.
17-04-1941న జిల్లెళ్ళమూడి వచ్చారు. 12-06-1985 వరకు పాలించారు. ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమ్మ లేరు.
అమ్మ ప్రవక్త కాదు కనుక ఏ మతమూ బోధించలేదు. అమ్మ గురువు కాదు గనుక ఏ శాస్త్రాలకు భాష్యం చెప్పలేదు.
అమ్మ అవతారం కాదు గనుక దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయలేదు.
అమ్మ అవధూత కాదు కనుక వేటినీ త్యజించలేదు.
విన్నకోట వెంకటరత్నశర్మగారి మాటలలో అమ్మ వివాహం చేసుకొని, “ధర్మమనే ఖడ్గాన్ని చేతబట్టి యుద్ధం చేయడానికి పోతున్నది” (మాతృశ్రీ జీవితమహోదధి పేజీ 662). అమ్మ ప్రకారం “సత్యమైన ధర్మాన్ని చేతబడితే, నిత్యమైన వస్తువేదో తెలుస్తుంది. పెళ్లి తోనే నిత్యానిత్య వివేకాన్ని తెలుసుకోవట మన్నమాట” (మాతృశ్రీ జీవితమహోదధి పేజీ 663).
ఈ గడుసైన భావాలు, నర్మగర్భంగా చెప్పిన సృష్టి రహస్యాలు అమ్మ కాక ఎవరు చెప్పగలరు? అమ్మకు కాక ఎవరికి అర్థం కాగలదు?
ఈ రకమైన తీర్మానం అనుకొన్న సమస్యకు సమాధానంగా కాని, పరిష్కారంగా కాని ఉండలేదు.