అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
ఇతర చింతనలు లేకుండగ నా మీద భారం వేసిన భక్తుల యోగక్షేమములన్నియు నేను చూచుకుంటానని శ్రీ కృష్ణపరమాత్మ అభయం ఇచ్చారు. అన్నపూర్ణేశ్వరిగా వచ్చిన జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇటువంటి అభయాన్నే భక్తులకి ప్రసాదించింది” నాకు శిష్యులెవరూ లేరు అందరు. నా బిడ్డలే” అని చెప్పిన అమ్మ కొంచెము ముందుకు వెళ్ళి “మీరందరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అనుకుంటున్నాను. చెయ్యి నొప్పి కాలికి తెలియదు. కాలి నొప్పి కంటికి తెలియదు కానీ అన్నిటి నొప్పీ నాకు తెలుస్తుంది” అంటూ “బాధ ఎవ్వరిదైనా అనుభవం నాదే” అన్నది. ఎంతటి ఆర్ద్రత అమ్మది. అమ్మ మాటలు, చేతలు అర్థం చేసుకొని అంతర్ముఖంగా ఆరాధన చేసుకునే శక్తిమంతులం కాకపోయినా పరిస్థితుల కనుగుణంగా, జరిగిన సంఘటనల ఆధారంగా విశ్లేషణ చేసుకుంటే అమ్మ ఔదార్యం గాని అమ్మ సల్పే ప్రేమాభిషేకం గాని అనన్య సామాన్యం అనితర సాధ్యంగా గోచరిస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సు శరీరాన్ని ఆనందంగా ధృఢంగా వుంచుతుంది కదా ! ఒక సోదరుడు అమ్మతో “అమ్మా నా మనస్సులో దుఃఖం నివారణమయ్యే మార్గం చూపమ్మా” అని అడిగితే “నాన్నా నీ బిడ్డ కోసం నీవెట్లా దుఃఖిస్తావో, అందరి కోసం అదే విధంగా దుఃఖించ గలిగిన నాడు నీ దుఃఖం నివారణ జరుగుతుంది” అని అమ్మ చెప్పిందంటే అలా చెప్పటం అమ్మకే చెల్లింది. ఎంతటి రసజ్ఞత, ఎంతటి అవ్యాజమైన ప్రేమ! అమ్మ మాటలు కేవలం మాటలకే పరిమితం కాదు చేతల్లో కూడ అమ్మ ప్రేమ అపారం.
ఒక సోదరికి చేతికి దెబ్బ తగిలి చెయ్యి వాచింది. కానీ అమ్మసేవ చేసుకోవాలని వచ్చింది. చేతికి దెబ్బ, దాని వాపు అమ్మకి చేసే సేవకి అడ్డంకి కాకూడదని బాధని ఓర్చుకుంటూ అమ్మకి పాదసేవ చేస్తున్నది. అమ్మ ఒక కుంపటి తెప్పించి నీరు బాగా కాచి నీవు నా కాళ్ళు పట్టు. నేను నీ చేతికి కాపటం పెడ్తాను అని తనకి సేవ చేసే సోదరికి స్వయంగా సేవలు చేసిన ప్రేమమూర్తి అమ్మ. కనుకనే అమ్మ భక్తులు “మనస్సుతో కాక హృదయంతో ప్రేమించగల వెలుగు. నివ్వు. ఆ వెలుగులో శాశ్వతంగా నిన్నే సర్వత్రా చూడనివ్వు. ఆఅనుభూతిని శాశ్వతంగా అనుభవించనివ్వు” అని ఆరాటపడటం సబబే. సేవాతత్పరతే సాధకులకి స్వతంత్రమైన మనస్సును కలుగచేస్తుంది. అమ్మ మాటల్లోనే చెప్పాలంటే “స్వతంత్రమైన మనస్సే దైవత్వం’ అలాగే అమ్మ తరచు చెప్పే వాక్యం “దయలేని మనస్సులే దయ్యాలు”. ఎవ్వరి మనస్సులో దయ, కారుణ్యం, ప్రేమ యిమిడి యుంటాయో వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అసలు మనందరం ఆరోగ్యంగా ఉండాలంటేనిత్యం అమ్మసూక్తులు చదువుకొని జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని ఆచరిస్తే చాలు.
ఒక సోదరుడు అమ్మతో “అమ్మా నువ్వే నాకు గురువువి. నాకు మంత్రోపదేశం చేయి” అని ప్రార్థించాడు. అపుడు అమ్మ చెప్పిన మాటల మనందరికి శిరోధార్యాలు. “మనిషికి “మనస్సు”ని మించిన మంత్రము, దైవము, గురువు ఎక్కడో లేడు” అన్నది. మనస్సుకి అమ్మ కల్పించిన స్థానం మనం గమనించుకోవాలి. అప్పుడే అమ్మ చెప్పిన సిద్ధాంతం “భిన్నత్వం లేని మనస్సే దైవత్వం” అన్న విషయం నిరూపించబడుతుంది. అమ్మ సూక్తులు విశ్లేషించుకోవాలంటే ముందుగా మనం ఈ జీవుడెవ్వడు, ఈ మనస్సు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ క్రింది ఉదాహరణ అన్వయించుకుంటే పై ప్రశ్నలకి జవాబు లభిస్తుంది.
కొబ్బరికాయ పీచుతో నిండి యుంటుంది. పీచు తీసి వేస్తే పెంకు కనబడుతుంది. పెంకులోపల తెల్లని కొబ్బరి దాంట్లో నీరు ఉంటుంది. ఈ నీరుగాని కొబ్బరి గాని తనంతట తానుగా బయటకు రాలేవు. కొబ్బరి నీరు జీవతత్వ తుల్యాలు. వీటికి అడ్డంకులు పీచు, పెంకులు. ఇవి జడత్వ ప్రకృతి తుల్యాలు ఈ పీచు పెంకు ప్రకృతి ధర్మములనబడే శీతోష్ణ భావములచే వాటి ప్రభావం కోల్పోయినప్పుడు జీవతత్వ తుల్యమైన నీరు యింకిపోయి కొబ్బరి కురిడీ కట్టి తన స్వరూపములో మార్పు కలిగినా పెంకు నుండి విడివడి తనకు తానుగానే యుండును. ఇక్కడ నీరు ప్రకృతి యందలి సూక్ష్మాంశమగు మనస్సుగా గమనించాలి. ఇక కొబ్బరి జీవుడు. మనస్సు ఆహ్లాదకరంగా యున్నంత వరకు దేహము నశించలేదు లేదు వ్యాధిగ్రస్తమవదు. ఎట్లన. కొబ్బరికాయ యందు నీరు (మనస్సు) యున్నంత కాలం కొబ్బరి (జీవుడు) వృద్ధి పొందుతునే యుంటుంది. కనుక జీవతత్వ తుల్యాలు వృద్ధి పొందాలంటే మనస్సు ప్రధానమని గ్రహించాలి. ఇదే అమ్మ మనందరికి అందించిన మంత్ర విధానం. శుద్ధమైన మనస్సుతో ఏకాత్మ మానవతా వాదం జీర్ణించుకొని అందరి యందు అన్నిటి యందు అమ్మను దర్శించుకోగల దార్శనికత పెంపొందించుకోవాల్సి యుంటుంది. మనలో చాలా మంది అమ్మ నన్ను ఇలా కాపాడింది, అలా రక్షించింది యని అందరితో చెప్పుకుంటారు. “అమ్మ అమ్మే” కనుకనే అందరినీ కాపాడుతుంది. రక్షిస్తుంది. అమ్మ గుణగణాలు కేవలం కీర్తిస్తు పదిమందికీ తెలియపర్చు కోవటంతో సరిపెట్టుకుంటే అమ్మకి మనం నిజమైన బిడ్డలం కాబోమని తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన మనస్సుతో అమ్మలా అందరిని చేతనయినంతలో ఆదరిస్తూ ప్రేమించగలగాలి. “గడ్డయైనా చెప్పదు. నా బిడ్డే” అన్న అమ్మ మమతామాధుర్యాన్ని వంట పట్టించుకొని అమ్మ చూపిన మార్గాల్లో నడవగలగాలి. వ్యష్టిగా మనం “మంచిమనస్సుకి దూరం కావటం అమ్మకి ఇష్టం కాదు. కారణం వ్యష్టిగా మనకి కలిగిన అనారోగ్యాలు సమిష్టిగా సమాజంపై ప్రసరిస్తుంది. అది మనందరిని నిర్వీర్యం చేస్తుంది. అమ్మ ఏదైతే మనకి ప్రసాదించిందో, అదే విధంగా అమ్మ ఇచ్చి దానిని అందరికి ఆనందంగా పంచుకోగలగాలి. అమ్మకి అప్పుడే తృప్తి. కనుక ఈ మనస్సుని గమనిస్తూ మనందరం అమ్మ బిడ్డలుగా బ్రతుకుదాం.
ఆయుర్వేదశాస్త్రం కూడా ఈ మనస్సుకి పెద్ద పీట వేసి ఆపరాత్పరికి ఏ విధంగా నమస్కరిస్తున్నదో చూడండి.
శ్లో॥ రాగాది రోగాన్ సతానుషక్తాన్
అశేషకాయ ప్రవృతానశేషాన్
ఔత్సుక్య మోహారతిదాన్ జఘా న
యో పూర్వ వైద్యాయ నమోస్తు తస్మై॥
అనగా మనస్సు వ్యాధిగ్రస్తమైన – శరీరముపై ఆ మానసిక వికారము యొక్క ప్రభావం ప్రసరించి దేహం కూడా వ్యాధిగ్రస్తమగును. దేహధారులందరికి ప్రాప్తించు ఈ రుగ్మతలను చక్కపరచగల వైద్యుడగు పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఇది హైందవత్వ ఔదార్య సంపద. కనుకనే అమ్మ చెప్పింది ఎక్కడో ఉంటుంది ఎక్కడా లేనిది అమ్మ చెప్పాదు.
“అందుకనే అమ్మ చెప్పింది వేదం” అమ్మ ఏది చెప్పినావేదమే.
సంఘటనలో బలం ఉంటే భాషలో పటుత్వం వుంటుంది.