శ్రీయుతులు పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు అమ్మకు అనుంగు పుత్రులు.
వారు అమ్మకు, అమ్మ సంస్థకు, అమ్మ సాహిత్యానికి చేసిన సేవ అనన్య సామాన్యమైనదని అందరికీ తెలిసిన విషయమే.
విశాఖ ‘లలితాపీఠం’లో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారి సమక్షంలో జరిగిన అనేక సభలలో ‘విశాఖ సాహితి’ కూడా పాలు పంచుకుంది. ఆయా సందర్భాలలో సభానిర్వహణ, రూపక పరికల్పన శ్రీ పి.యస్.ఆర్.గారు సమర్థవంతంగా, సభారంజకంగా నిర్వహించేవారు. వారి ఆహార్యానికి, వాచకానికి తోడు వారిలో సాహిత్యం పట్ల గల ఆరాధనా దృక్పథం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకునేది. సమయపాలన విషయంలో ఎంతో నిష్కర్షగా వ్యవహరించేవారు.
అందరినీ ఆత్మీయంగా పలుకరించడం వారికి అమ్మ పెట్టిన విద్య. నిరంతరం అమ్మ సన్నిధిలో ఉండడం వల్ల వారిలో ‘మాతృహృదయం’ చోటు చేసుకుంది.
శ్రీ పి.యస్.ఆర్.గారి నుండి ‘విశాఖ సాహితి’, సభానిర్వహణలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. ‘విశాఖసాహితి’ని వారు ఎంతగానో అభిమానించి ప్రోత్సహించేవారు. వారి ప్రోత్సాహం ఎన్నటికీ మరువ లేనిది. అమ్మ సేవే పరమార్థంగా జీవించిన ఆ ధన్యజీవికి ‘విశాఖసాహితి’ భక్తితో నివాళులర్పిస్తున్నది.