అమ్మ ఒడి అనురాగపు గర్భగుడి
అర్కుని కుంకుమబొట్టుగా పెట్టి
నభో సీమయే నగుమోముగా కలిగి
చిరునగవు చంద్రికలు వెదజల్లు జాబిలి !
అమృతంపు సోనలు తీయని పలుకులు
ఆప్యాయతను చిలుకు చల్లని చూపులు
శాంతికిరణములై భాసించు కరములు
కాంతిపథములే లలిత చరణములు
భక్తితో తాకగా ఆ పాదపద్మముల
భస్మమైపోవునట పాపరాశులెల్ల
పాపవినాశిని ! పతితపావని !
ప్రేమవాహిని ! ప్రణవరూపిణి !
కట్టువడునో లేదో, మంత్రతంత్రాలకు,
పట్టువడునా దయతో, జపతపాదులకు,
మనసార ఒకసారి పిలిచినా చాలు,
పరుగున దరిచేరి ప్రేమమయి బ్రోచు.
నమ్మిన వారికి పెనుయండగా నిలిచి,
కొండంత బాధ్యతను కొనగోట మోసి,
కంటికి రెప్పయై కాచు కన్నతల్లి !
అర్థిజనుల పాలిటి కల్పవల్లి !
అమ్మ మృదుహస్తాల కమ్మగా ఒదిగిన
అమర ప్రసూనమౌ ఆర్తి నిండిన ఎద,
వేదనాగ్నికీల విచ్చిన పూమాల,
అశృధారయే దివ్యమందాకిని.
జనని పూజ్య సన్నిధి, భక్తజనుల పెన్నిధి,
అంతరంగమంత పొంగు ఆనందవారధి,
అంతస్థుల అంతరాల, అహంత యధికారాల
మరచి మనసు పసిపాపగ మారు సమతా భవంతి.
మాత ఒడి, అనురాగపు గర్భగుడి,
పండిన ఆరాధనకు అందెడి ఆ కౌగిలి,
అజ్ఞాన తిమిరమును పోద్రోలు జ్ఞానజ్యోతి
అనంత సంపూర్ణ భావచైతన్యపు దీప్తి