ఏడాదిన్నరగా, వైరస్ భయం వల్ల, ఎవరింటికీ మనం వెళ్లేదీ, ఎవరన్నా మనింటికి వచ్చేదీ లేదు. శుక్రవారాలు, శనివారాలు అలవాటుగా వెళ్ళే దేవాలయ సందర్శన భాగ్యం లేక, అందరం ఒకరకమైన నిర్లిప్తతతో కాలం గడుపుతూ ఉన్నాము. మనవాళ్లవి ఎవరివన్నా పుట్టినరోజులో, పెళ్ళిరోజులో అయితే ఫోనులోనే మన సంతోషాన్నీ అభినందనలనూ తెలుపుతూ రోజులు గడుపుతూ ఉన్నాము.
మే 19న అడవులదీవి మధు, లలితల పెళ్ళిరోజు. శుభాకాంక్షలు తెలుపుదామని ఫోను చేశాము. అప్పుడు వాళ్లు ‘జన్నాభట్ల శాస్త్రి’ గారి నిర్యాణవార్త చెప్పి జిల్లెళ్ళమూడి అంతా విషాదంలో మునిగి ఉంది’ అని ఆవేదనతో చెప్పారు. ఆ వార్త విని మేమూ నిర్ఘాంత పోయాము. మనసు విచలితమైంది. కళ్ళు అశ్రుధారలు కురిపించాయి. ఆ రోజంతా శాస్త్రిగారి గురించిన వివరాలు చెప్పుకున్నాము. మేము పర్వటిరోజుల్లో తప్ప తరచూ జిల్లెళ్ళమూడి వెళ్లే అవకాశం ఉండేది కాదు. పరిచయస్తులను పలకరిస్తూ, కుశాలలను తెలుసుకుంటూ ఒక రోజున మాత్రమే ఉండేవాళ్లం. జన్నాభట్ల శాస్త్రి అన్నయ్య ఏదో కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండేవారు. ‘అమ్మ’ మీద అచంచలమైన భక్తి ఆయనకు. అమ్మకోసం ఆయన చేసే ఏర్పాట్లు కూడా అంతే భారీగా ఉండేవి. ఆయన మాటల మనిషి కాదు చేతలమనిషి. ఇలా చెప్పుకుంటూ ఉంటే, నా మనోయవనిక మీద, ఆ నాటి ఒక సంఘటన సాక్షాత్కరించింది. అది మీతో పంచుకుంటాను.
2003 సంవత్సరం. పవిత్ర గోదావరినదికి పుష్కరాల శుభదినాలు. అప్పుడు మేము గుంటూరులో ఉండేవాళ్లం. పుష్కరాల రోజుల్లో పితృదేవతలకు తర్పణాలు విడిచే సంప్రదాయం ఉన్నది కదా. వీలైనంత వరకు వాళ్ల తిథిరోజునే తర్పణం విడుస్తారు.
మేము అప్పటి కింకా ఆ కార్యక్రమం గురించి ఆలోచన కాని ప్రయత్నం కాని చేయలేదు. ఒకరోజు శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్యగారు ఫోను చేశారు. మన జన్నాభట్లశాస్త్రి నిడదవోలులో ఉన్నాడు కదా! కొవ్వూరులో పుష్కర సమయంలో పెద్దలకు తర్పణం వదిలే కార్యక్రమం చేయాలనుకొనే మన వాళ్లందరికి ఆ వూళ్లో ఏర్పాటు చేస్తాడట, ఎవరికి వీలైనప్పుడు వాళ్లు వచ్చి చేసుకోవచ్చు. ముందుగా నిడదవోలులో వాళ్లింటికి వస్తే, కావలసిన సంభారాలన్ని తను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. పొత్తూరి తిలక్ గారు, భవానిగారు వస్తామన్నారు. మీరు కూడా వస్తామంటే, అందరం కలిసి ఒక వ్యానులో వెళ్లాము అని చెప్పారు. ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ అన్నట్లుగా ‘ప్రయత్నమూ, ప్రయాస’ లేకుండా జరిగిన ఈ ఏర్పాటుకు, మా ఆమోదం తెలిపాము.
ఉదయాన్నే అందరం నిడదవోలులో శాస్త్రిగారింటికి చేరాము. గుమ్మంలో అడుగుపెట్టగానే పసుపుకుంకుమలతో కళకళలాడుతూ పచ్చగా గుమ్మటంలా పెరిగిన ‘తులసి’తో తులసికోట కనువిందు చేసింది. పూజకు పూలనిచ్చే పూలమొక్కలూ, అవసరానికి ఆదుకునే కూరల పాదులూ, ఆశ్రమాన్ని తలపించే ఆ పరిసరాలు, నిరాడంబరమైన ఆ గృహస్తు అంతరంగాన్ని ఆవిష్కరించాయి. లోపలికి వెళ్ళాక, పరస్పర అభివాదాలు, కుశలాలు, వేడిపానీయ సేవనాలు అయ్యాక శాస్త్రి మీరు ఇప్పుడు బయలుదేరితే, సకాలంలో మీ కార్యక్రమం పూర్తి చేసుకురావచ్చు అన్నారు. కావలసిన వస్తువులన్ని పొందికగా ఒక సంచిలో సర్దబడి వున్నాయి. ఆ వస్తువులకు ‘వెచ్చించిన మూల్యం’ ఒక చిన్న కాగితం మీద వ్రాసి ప్రతి సంచివద్ద ఉంచారు. మొహమాటానికి తావులేని ఆ అమరిక ఎంతో ‘రిలీఫ్’ ఇచ్చింది. ఎవరి సంచి వాళ్ళు తీసుకుని, పుష్కర ప్రదేశం చేరుకున్నాము. శాస్త్రిగారు ఏర్పాటు చేసిన పురోహితుడు ఎదురు చూస్తున్నారు. అందరం పవిత్ర పుష్కర నదీస్నానం చేశాము. పితృదేవతలకు సమర్పించే తర్పణాలు తీర్థ విధులూ సక్రమంగా పూర్తి చేసుకొని, తేలికపడ్డ మనస్సుతో తృప్తిగా తిరిగి శాస్త్రి గారింటికి చేరాము. అప్పటికే పితృకార్యక్రమం తర్వాత భోజనంలో ఉండాల్సిన పదార్థాలన్ని వండించి ఏర్పాటు చేశారు. ఆ రోజు వడ్డించిన దోసకాయ ముక్కలపచ్చడి రుచి ఇంకా జిహ్వపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. తర్వాత ఆ దంపతుల వద్ద మాతృమూర్తి జన్నాభట్ల అక్కయ్య వద్ద వీడ్కోలు, వాళ్లు చేసిన ఆ ఏర్పాట్లకు మా సంతోషాన్ని తెలిపి తిరిగి గుంటూరు చేరాము.
2005 కావేరి పుష్కరాలకు, శ్రీ తిలక్ గారు, భవాని, మేము జన్నాభట్ల అక్కయ్య అందరం కలిసి ‘ఇన్నోవా’ కారులో శ్రీరంగం వెళ్లాము. శ్రీరంగనాధుని దర్శనం, పుష్కర నదీస్నానం ఎంతో తృప్తిగా, సంతోషంగా చేసుకున్నాము. దగ్గర ఉన్న చూడాల్సిన ప్రదేశాలన్నీ చూస్తూ ఒక వారం రోజులు హాయిగా తిరిగాము. జన్నాభట్ల అక్కయ్య మా కన్నా హుషారుగా, ఒక అడుగుముందు నడుస్తూ, మాకెంతో స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా ఉండేది. అన్నిరోజులూ ఆహారంగా పెరుగులో అటుకులు నానబెట్టి తింటూ ఆచారాన్ని నిష్ఠగా పాటించేది.
శాస్త్రిగారి అస్తమయ వార్తతో, వృద్ధురాలైన మాతృమూర్తి అక్కయ్యను తలచుకుని, ఈ ముది వయసులో ఈవిషాదాన్ని ఆ తల్లి ఎట్లా భరించకలదు అని దుఃఖపడ్డాము. ఆ తల్లిగర్భశోకాన్ని మరచి, నీ భక్తుడిని నీ దరిచేర్చుకున్నావా అని ‘మన అమ్మ’ ని నిష్ఠూరమాడాలనిపిస్తోంది.
కంటికి కనుపించని సూక్ష్మజీవి, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా, అమ్మ ‘క్షమాశీలి’ కదా, ఆ దుష్టక్రిమిని కూడా క్షమించిందేమో మరి. లేకపోతే ‘విశ్వజనని’ కి ఈ కల్లోలాన్ని ఆపి, తిరిగి లోకంలో సుఖసంతోషాల్ని ఆరోగ్యాన్ని ఇవ్వడం తృటిలో పని.
‘ఆత్మకు శీతోష్ణ సుఖదుఃఖాలు అంటవు’ అని భగవద్గీత చెబుతున్నా మనందరం వారి ఆత్మకి శాంతి కలుగుగాక అని వీడ్కోలు పలుకుతాము. ఇష్టమైన ‘అమ్మఒడి’ చేరినవాళ్ళకి శాంతికి కొదవేముంది. అంతేగా తల్లీ! మరి.