అమ్మ-అది జనని- సకల చరాచర జీవలోకాలకు సర్వ దేవతలను మాతృభావంతో చూచి లాలించే అమ్మ- ఎవరు వచ్చినా ‘అన్నం తినిరా నాన్నా’ అనే అమ్మ. అమ్మ ఈ మాటలకు అమ్మకు ఆహారం మీద భ్రమ ఏమో అని భావించారేమో-ఒకరు ప్రశ్నించారు- “అమ్మా నీ వేదాంతము ఒమర్ ఖయమ్ వేదాంతమూ ఒకటేనా” అని దానికి అమ్మ “నాన్నా నీకు ఒమర్ వేదాంతము అర్థమయి, నా వేదాంతమా అర్ధమయితే-సరే ఒమర్ వేదాంతమే నా వేదాంతము” అన్నది…
నిసాపూర్ ఒమర్ గుడారాలు కుట్టుకునే వారికి జన్మించి ఖగోళ శాస్త్రంలో, వేదాంతంలో ప్రజ్ఞనార్జించి సూఫీ వేదాంతసారం అనదగిన రచనలు చేశారు. ఫిట్జ్ రాల్డ్ చేసిన ఆంగానువాదాలతో ప్రసిద్ధి పొందాయి ఒమర్ వ్రాసిన రుబాయిలు. కానీ ఆ రుబాయిత్లను లోతుగా పరిశీలించకుండా పైపైన చదివితే ఏర్పడే భావం- ఒమర్ ఖయామ్ కేవలం ‘తిను, తాగు- సుఖించు’ జీవితం అశాశ్వతం గనుక ఉన్నప్పుడే అనుభవించు అని బోధించాడు. అనిపిస్తుంది. అందుకే అమ్మ అనే మాటలను దీనికి అన్వయించి వచ్చిన వారందరినీ తిను అంటోంది అమ్మ అని. అందుకే అమ్మ ఒమర్ వేదాంతాన్ని అనుసరిస్తోంది అని హేళన.
మరి అమ్మ ఎందుకు ఆ మాటలు అంగీకరించింది? ఒమర్ మాటలలో – అమ్మ చేతలలో వేరే అంతరార్థం ఏదైనా ఉన్నదా? ఈ దృష్టితో రుబాయిలను పరిశీలిస్తే ఎలా ఉంటుంది?
రాయి విసిరితే పక్షులు చెల్లాచెదరైనట్లు సూర్యోదయంతో నక్షత్రాలు పారిపోతున్నాయి. తూరుపు వేటగాడు చక్రవర్తి కిరీటంపై చంద్రవంకను వెలుగుల వలలో పట్టేశాడు అని ప్రారంభం. రెండవ రుబాయిలో Voice within the Tavern పిలుపు వినిపిస్తుంది….. జీవన మధువు పానపాత్రలో ఎండిపోకముందే మీ పాత్రలు నింపుకోండి అని- ఎవరిదీ పిలుపు కలలో విన్పించినది? ‘అఖిలేశు హస్తమే అన్నపూర్ణమ్మ’ ఒక్క మెతుకు ఆరగించి కృష్ణుడు ద్రౌపది ఆపదలు కాచాడనిగదా! ఎన్ని జన్మల పాపాలో ఆ ఒక్క మెతుకు ప్రసాదంతో భస్మమయ్యేవి. మనకు తెలియకనే మనలో వైశ్వానరాగ్నిగా ప్రజ్వలమౌతున్న అమ్మ మన చేత ఆహుతులు వేయించి యజ్ఞము తానై యజ్ఞభోక్తయై. యజ్ఞప్రసాదాన్ని ఇచ్చి యజ్ఞఫలాన్ని ఇస్తున్నదనిపించడంలేదా.
తర్వాతి రుబాయిలో కోడికూతతో పానశాల ముందు నిలచిన వారు అంటారు తలుపు తీయండి – మీకు తెలుసు మాకున్న సమయం ఎంత కొంచెమో – ఒకసారి ఇక్కడనుంచి వెళ్ళిపోయాక తిరిగి వచ్చేదీ ఉండదని – వేగిరం తలుపు తీయమని”.
ఇది సాధకుని ఎరుక – అమ్మ అన్నది- “నాన్నా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి వెళ్ళమని”- మరీ ఇక కొద్ది మాసాలలో ఆలయ ప్రవేశం చేస్తారనగా మరీ ఎక్కువగా వచ్చినదెందుకు పిడకలు ఏరుకోడానికా అంటారు సాయిబాబా. పిడకలు ఏరుకోవడమంటే తన మృత్యువు సమీపించే కాలాన్ని గుర్తించడమే గదా- అందుకే ఆలోచించే వ్యక్తులు ఏకాంతంలో వెదకడం ఆరంభిస్తారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే అన్నట్లుగా రాజులు గడిచిపోతారు కానీ, ద్రాక్ష తీగకు మెరిసే కెంపులు కాస్తూనే ఉంటాయి. అందుకే అంటాడు ఒమర్ . పశ్చాత్తాపం పడే సమయం గూడా కాదు. వసంతపు మంటలో చలికాలపు పశ్చాత్తాప వస్త్రాన్ని పడేయి. కాల విహంగం ఎగిరిపోతోంది. కొద్దిసమయమే ఉంది. అని..
గడచిన కాలం తిరిగిరాదు. ఆ పాప పుణ్యాల బేరీజు మనకెందుకు? పాపాల పుణ్యాల పాలికా నీకు పాపాయి పాపమే పుణ్యమ్ముకాదా అంటాడు. కీ॥శే బ్రహ్మాండం సుబ్బారావు. అన్నం తినమంటే తినడం. ఆడమంటే ఆడటమూ. అమ్మ వాత్సల్యాంబుధిలో మనల్ని పోగొట్టుకోవడమేగా విధి.
తర్వాత ఒక రుబాయిలో అంటాడు ఒమర్. మన అందరిమాట – చెట్టు నీడలో ఒక రొట్టె – ఆకలితీరేందుకు ఒక మధుకలశం దాహం కోసం – పద్యాల పుస్తకం – నీవు ఉంటే చాలు అని. అడవిలోని నీ పాట స్వర్గమే అవుతుంది అని ఆకలితో అమ్మ దగ్గర కుర్చున్నా వచ్చిపోయే వారు అమ్మకిస్తున్న పళ్ళమీదో, మిఠాయిమీదో దృష్టి ఉంటుందేగాని అమ్మ పాదాలపై, మాటలపై నిలువదుగదా! అందుకే అమ్మ అన్నం తిన్నారా’ అనేది. కడుపునిండాక పైకి చూస్తే అది మధుపాత్ర- ఆధ్యాత్మికత – పద్యాల పుస్తకమే ఒమర్ కురాన్ మనకు అమ్మ మాటల పుస్తకం- చీకటి తొలగుతున్న వేకువ- ఎక్కడి నుండో వినపడుతున్న అమ్మ పిలుపు ఉంటే- అదేకదా స్వర్గం
ఇక్కడ సూఫీ వేదాంతంలోని ఒక చిన్న రహస్యం చెప్పాలి. మన పురాణాల్లోలాగానే సూఫీలు గూడా ప్రతీకలను విస్తృతంగా వాడుతారు. పర్షియన్ సాహిత్యంలో మేలిముసుగు (veil) ప్రధానం. బయటికి కన్పించే అర్థం ఒకటైతే తెలిసినవారు మేలిముసుగు తొలగిస్తే ప్రత్యక్షమయ్యే సౌందర్యం మరొక అలౌకిక సౌందర్యం. వారి కౌగిలింత దివ్యత్యం పొందే అభేదభావన. వివాహం జ్ఞానం పొందే తొలిమెట్టు – ప్రవేశ ద్వారం. మధువు సూఫీజ్ఞానుల బోధలు. ద్రాక్ష తీగ, ద్రాక్షలు సూఫీమతం. పాఠశాల సూఫీ మతస్థుల పాఠశాల. ప్రేమికురాలు లేక ప్రేయసి భగవత్ స్వరూపం. ప్రేమికుడు సదా దైవసాన్నిధ్యాన్ని కోరి తపించే సాధకుడు. ఎర్ర రోజా, నైటింగేలు ప్రేయసి ప్రేమికుడు- దైవం, సాధకుడు. సూఫీ అనే పదం యోగిలాగానే జ్ఞానులకు వర్తించే పదం.
ప్రపంచాన్ని వదలినవాడు సూఫీ. ప్రపంచం వదలి పెట్టినవాడు ఫకీరు. సర్వవ్యాపి, సర్వ సృష్టికర్త అయిన శక్తి (భగవంతుడు) ఉన్నదనీ ఉన్నాడనీ ప్రేమతో భక్తితో చేరుకోవచ్చనీ భోదించేది సూఫీ భావన. బయాజిద్ అనే సూఫీ సన్యాసి సమాధి లేక ఉత్కటానందస్థితిలో ఉన్నప్పుడు నేనే భగవంతుడిని అన్నాడు. తిరిగి సృహ వచ్చాక శిష్యుల్లో కొందరు, మీరు దైవదూషణ చేశారన్నారట. ఈ సారి తను దైవ దూషణ చేస్తే పొడిచి చంపమన్నాడు. బయాజిద్. మరోసారి సమాధిలోకి వెళ్లినప్పుడు నా దుస్తులలో, నాలో అణువణువునా భగవంతుడే! ఎక్కడ వెతుకుతారని స్వర్గంలోనూ, భూమిలోనూ అన్నాడు. వెంటనే శిష్యులు అతనిని కత్తులతో పొడిచారు. అతనికేమీ కాలేదు గానీ పొడిచిన వారికి గాయాలయ్యాయి. బయాజిద్ అన్నాడు నేను కేవలం ఒక అద్దంలాంటివాడిని (సమాధిలో) అందుకే అద్దంలో తమని తామే పొడిచి గాయపడ్డారు వీళ్లు అని. అమ్మ చెప్పే ‘నేను నేనైన నేను’ ఇదేనా? రెండే నిజాలు సూఫిజమ్ – ఒకటి అహద్. ఇది మన వేదాంతంలో సర్వం ఖల్విదం బ్రహ్మ . రెండవది ‘తరీకత’ – తెలిసే మార్గం – భక్తియోగం అంతకంటే మించిన ప్రేమయోగమే ఆ మార్గం. అమ్మ చెప్పిన- కాదు చూపిన ఒకే కుటుంబం భావన – కేవలం భావన కాక ఆచరణలో చూపిన అన్నయ్యలు, అక్కయ్యలతో కూడిన అందరి ఒమర్ అంటాడు “కొందరు అనుకుంటారు మానవ జీవితం అద్భుతం అని మరికొందరు స్వర్గం ఎంత అద్భుతమో అని కలలుకంటారు. ఒమర్ అంటాడు. చేతిలో ఉన్న డబ్బు జాగ్రత్త చేసికో, దూరాన వినిపించే సంగీతం విను అని. ఇక్కడ చేతిలోని డబ్బు తనలోని ఉత్తమ సంస్కారాలు వీటిని భద్రపరచుకొని భగవంతుని గొంతు (సంగీతం) అన్నిటిలో వినడం నేర్చుకో అని భావం. ఒకప్పుడు సుల్తానుల భవనంలో కాలక్రమేన తొండలుండవచ్చు. ఉండేది కొద్ది కాలం. ఇంతకు ముందు కొందరు ఈ జీవన రసాన్నిన అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారు. కనుకనే వర్తమానంలో మన ప్రయత్నం చేయాలి. ఒకనాడు మనమూ మట్టిలో చేరిపోతాం గదా. అందుకే ఇవ్వాల్టికోసమో, రేపటికోసమో తాపత్రయపడేవారికి ముయిజ్జన్ పిలుపు – మూర్ఖులారా మీ ఫలం ఇక్కడా కాదు – అక్కడా కాదు అని. కేవలం ‘మాటల వల్ల ప్రయోజనం లేదు” అని భావం.
ఖయాను తమాషాగా అంటాడు – నేను నేర్చుకున్నదల్లా ఒకటే “నేను నీరు లాగావచ్చాను. గాలిలాగా వెళ్ళిపోతాను” అని. అమ్మ అంటుంది. శుక్లశోణితాలదే నా కులం అని, ద్రవపదార్థాల సంయోగం వల్ల వచ్చినది ఈ దేహం – గాలిలాగా చైతన్యంలో చైతన్యం కలవడం మరణం. ‘అడిగి ఇక్కడికి రాలేదు. ఎక్కడికి పోతామో తెలీదు. మరో కప్పు మధువు’ అంటాడు ఒమర్. ఉన్నప్పుడు దైవ సాన్నిధ్యాన్ని మరింతగా అనుభవించడమే – ఆ ఆనందాన్ని పొందడమే. ఇక్కడ కొద్దిసేపు నీవు, నేను అనే కబుర్లు. ఆ తర్వాత? ఆ తెర దాటి చూడలేను. ఆ తలుపు తాళం చెవి నా దగ్గర లేదు అంటాడు ఒమర్. అందుకే దైవాన్ని ప్రశ్నిస్తాడు “చీకటిలో దేవులాడే పిల్లలకు దీపం ఏది?” అది ‘విశ్వాసం’ అని సమాధానం.
ఒమర్ ఒకసారి సంతలో కుమ్మరి చేసే కుండలను చూస్తాడు. కుమ్మరి చేతిలో ముద్దగా ఉన్న మట్టి ముద్దలు ‘కొంచెం నెమ్మదిగా కొట్టు” అంటున్నట్లు అన్పిస్తుంది. జన్మముందు జీవుల ప్రార్థన ఇదేనేమో. కొంచెం మంచి జన్మ -కొంచెం సుఖం- భూతం తిరిగి వర్తమానం – అది తిరిగి భవిష్యత్తు అందుకే ఒమర్ అంటాడు ఎందుకు ఫలాలగురించి ఆలోచన. ద్రాక్ష అంటే భగవత్ప్రేమలో ఆనందం పొందక? తమాషాగా చెప్తాడు – తర్కం అనే భార్యకు విడాకులిచ్చి భగవద్భక్తి అనే రెండవ భార్యను వివాహమాడాను అని. ఇక్కడ మళ్ళీ గుర్తుకొచ్చి మనస్సు కలుక్కుమంటోంది అమ్మ చెప్పిన మాట- “అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చిపోతుండండి నాన్నా” అని.
ద్వంద్వాలు : అస్తి – నాస్తి, పైన – క్రింద వీటితో సతమతమయ్యే పనే లేదు. ఒకసారి దైవపద స్పర్శతో పునీతమైతే ఆ ఆనందం జీవితాన్ని పరుసవేది ఇనుమును బంగారం చేసినట్లు మారుస్తుంది.
ఒమర్ ఈ ప్రపంచాన్ని ఒక చదరంగం ఆటతో పోలుస్తాడు. పగలు, రాత్రి అనే తెలుపు, నలుపు గళ్ళ చదరంపై మానవులే పావులుగా ఆడి, ఒక పావు తర్వాత ఒక దానిని పావులపెట్టెలో వేసి పెట్టెమూస్తాడు ఆట తర్వాత అని. బంతి అవును కాదు అనదు కాని ఆటగాడు తన్నినట్లు కుడికీ, ఎడమకూ పోతుంది. ఈ ఆట గురించి తెలిసింది బంతిని మైదానంలోకి విసిరిన ఆటగాడినే అంటాడు.. విధి వ్రాసిన రాతను మన తెలివితేటలుగాని, పవిత్రతగాని ఎంతమొత్తుకున్నా మార్చలేవు. అమ్మ అంటుంది విధే విధానమని. మన విధానము విధిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సంఘటన. అమ్మ స్నానానికి కూర్చొని ఉన్నది. ఒకరు ప్రశ్నించారు: “అమ్మా! ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు నష్టాలు ఎందుకు కొందరు సుఖపడటమూ, కొందరు దుఃఖించడమూ, కొందరికి దీర్ఘాయుర్దాయమూ, కొందరు అల్పవయుస్సులో మరణించడము ఏమిటిదంతా” అని అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు నీటి తొట్టిలో చేతిని ముంచి తీసి గోడపై వేళ్ళు విదిలించింది. కొన్ని బిందువులు తొట్టిలోనే జారాయి. కొన్ని గోడతాకి కొద్ది దూరమే ప్రయాణం చేశాయి. మరికొన్ని చాలాసేపు, చాలా క్రిందకి జారాయి వీటికేది కారణం? అమ్మ ఏమీ మాటాడకే – చేసిన మౌన వ్యాఖ్యా ఇది ? నీ చేతులు ఆకాశం వంక చాచకు అంటాడు ఒమర్. అంటే భగవంతుడు అక్కడ లేడని. సృష్టి ప్రారంభం నాడే ప్రళయ ముహూర్తం గూడా నిర్ణయమయే ఉన్నదని. ఈ దేవాలయం – దేహం గురించి ఆలోచిస్తూ జీవితం గడిపేస్తూకంటే ఎక్కడో ఒకచోట ఒక్కక్షణం దైవదర్శనం దొరికితే చాలునంటాడు ఒమర్. అలాగే అన్ని రకాల మట్టిపాత్రల సంభాషణ ఒకే మట్టిలోంచి భిన్నరూపాలు – చివరికి అన్నీ మట్టిలోనే. కాని కొన్నిటిలో సువాసనలు – దోవనపోయే పాంధుడికి గూడా ఒళ్ళుపులకరించే సువాసనలు – కీర్తికండూతితో ఇవి లభ్యం కావు. పశ్చాత్తాపం నిజం లేకుంటే వసంత గమనంతో నియమనిష్టలు గాలిలో కలుస్తాయి. చివరి ప్రార్థన కూడా తమాషాగానే ఉంటుంది. ‘నీవు, నేను మట్టిలో కప్పబడి ఉండిన చోటికి వచ్చినపుడు నీ చేతిలోని ఖాళీ మధుపాత్రను ఒక్కసారి నాపై వంచవూ’ అని.
అమ్మకు మన ప్రార్థన కూడా అదే కదా. ఆఖరి క్షణాలలో అయినా, ఎపుడో ఒకసారి – నీ పాద పరిమళంతో నా శ్వాసను కలుపుకోమనేగా!!
ఒకటియే రెండుగా కనిపించు మాకు, ఆ రెండూ ఒకటిగా అనిపించు నీకు-అంటారు. అమ్మ అద్వైతమూర్తి అని, అమ్మ తత్త్వమెరిగిన రాజు బావగారు. ఇప్పుడు చెప్పండి మీరు అమ్మతత్త్వం, ఒమర్ ఖయమ్ తత్త్వము నిజంగా ఒకటే గదూ!!!