ఏ పాదమూలమ్ము లీ ఇలాతలమున
సర్వతీర్థాలకు స్థానమయ్యే
ఎవరి దేహమునందు ఈ ప్రజావళికెల్ల
సర్వదేవతలు సాక్షాత్కరించె
ఎవరి వాక్కులలోన ఈ విశ్వమెల్లను
వేదనాదమ్ములు వినగనయ్యె
ఎవరి కన్నులలోన ఈ దిగంతము దాక
కరుణాసరస్సులే కదలియాడె
ఎవరి దర్శనమాత్రాన ఎల్లవారి
పాతకములన్నియును పటాపంచలయ్యె
ఆపవిత్రత ఆవాక్కు ఆమె కరుణ
సర్వసృష్టికి రక్షయై సాకు గాక!