1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ కరుణ

అమ్మ కరుణ

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : July
Issue Number : 3
Year : 2016

ఒకసారి నేను అమ్మ గదిలో అమ్మ మంచం ప్రక్కనే కూర్చొని ఉన్నాను. అమ్మ దుప్పటి కప్పుకుని నిద్రిస్తోంది. కొంతసేపటికి “నాన్నా! సుబ్రహ్మణ్యం! వెళ్ళి అన్నం తినిరా” అన్నది. అమ్మ సన్నిధి ఆనందనిలయం. క్షణకాలం కూడా ఆ ఆనందపారవశ్యాన్ని ఎవరూ కోల్పోవటానికి ఇష్టపడరు. కనుకనే “నేను అన్నం తిన్నానమ్మా” అని అసత్యమాడాను. వెంటనే అమ్మ దుప్పటి లోంచే “నాకు తెలుసు, నాన్నా! నువ్వు తినలేదు. వెళ్ళి అన్నంతినిరా” అన్నది. ఒక వ్యక్తిని చూసి తాను అన్నం తిన్నదీ లేనిదీ చెప్పలేము. అదీ మన (మానవ) పరిస్థితి. మరి అమ్మ ఎట్లా చెప్ప గలిగింది? ఏమిటి అమ్మలో విశేషం?

‘నీకు ఇంటి దగ్గర తల్లి ఉన్నది కదా! అమ్మా! అమ్మా! అంటూ ఎందుకు జిల్లెళ్ళమూడి పరుగెడతావు?’ అని అడిగేవారు నన్ను మా బంధువులు, మిత్రులు. మాత బిడ్డల్ని మాత్రమేకన్నది. అనసూయమ్మ వాళ్ళరాతల్ని కూడా కన్నది. మాత పరిధి పరిమితం; జగన్మాత అమ్మ పరిధి అనూహ్యం.

అమ్మ నాకు బోధించినవీ, ప్రసాదించినవీ చాలా ఉన్నాయి. అందు నాకు అందినంత వరకు మూడు అంశాల్ని వివరిస్తాను – స్వధర్మానురక్తి, సంస్కారం, సద్వస్తు జ్ఞాన సంపద.

  1. స్వధర్మానురక్తి : బాల్యంలో నాకు నాలుగేళ్ళ వయస్సు వచ్చినా మాటలే సరిగా రాలేదు. మా తల్లిదండ్రులు నేనేమైపోతానోనని బెంగపెట్టుకున్నారు. మా అన్నయ్య తెలివైనవాడు; స్కూలు ఫస్ట్ వచ్చేవాడు. నేను చదువంటే భయపడి పుస్తకాలు, తరగతి గదిని వదలి పారిపోయేవాడిని. అమ్మ తన హృదయాంతరాళాల్లో నాకు ఒక సుస్థిర స్థానాన్నిచ్చింది. కనుకనే అమ్మ కృపవలన క్రమంగా ఎదిగి 22 ఏళ్ళు టీచర్ గా 14 ఏళ్ళు టీచర్ ఎడ్యుకేటర్గా పనిచేశాను.

అమ్మ అన్నది “నాన్నా! నీ పిల్లలే (విద్యార్థులే) నీకు అన్నం పెడుతున్నారనుకొని పాఠాలు చెప్పు. నీకు వేరే పూజలూ, యజ్ఞాలూ అవసరం లేదు” అన్నది. English, Maths, Science, Psychology ఎన్నో Subjects బోధించాను. విద్యాశాఖ గర్వించ దగ్గ విజయాలు ఎన్నో సాధించా. ఒక ఉదాహరణ : 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక Policy తీసుకుంది.

ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల భాషాబోధని స్కూల్ School Assistant (English) Posts మంజూరు చేసింది. మొట్టమొదటిసారి Teacher Recruitment (D.S.C) Question Paper తయారు చేయడానికి నాతోపాటు 8 మందిని ఎంపిక చేశారు. మా ముందు ఏ Model లేదు. నేను తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని మా డైరెక్టరు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యాధికులు గంపంత కళ్ళు. చేసుకుని ఎదురు చూస్తున్నారు. వేల మంది వ్రాస్తారు ఆ పరీక్ష. అది వారిలో కొందరికి ఇంచుమించు జీవన్మరణ సమస్య. 42 మార్కుతో ఉద్యోగం రావచ్చు, పోవచ్చు. విద్యాశాఖకైతే Prestige Issue. అమ్మ కొండంత అండ అనుకొని నేను అభిమన్యునిలా ధైర్యంగా దూసుకు పోయాను. Body of the Letterలో కేవలం ఒక్కవాక్యం ఉన్న చిన్న letter తీసికొని దాని మీద ఆరు ప్రశ్నలు సంధించాను. Question Paper ఇలా ఉంటుందా! అని మా డైరెక్టరు ఆశ్చర్యపోయారు. పరీక్ష రోజున ప్రశ్నపత్రాన్ని చూసి మేధావులూ దిగ్భ్రాంతి చెందారు.

కాగా నా ప్రశ్నపత్రంలో కొన్న తప్పిదాలున్నాయని కొందరు High Court ని ఆశ్రయించారు. జడ్జిగారు విచారణ ప్రారంభించారు. ఆరోజు నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నాను. ఈ పేపరు మీద కోర్టులో కేసులు వచ్చాయి. ఫైల్ తీసుకుని నేను వెడుతున్నాను అని ఒక లెక్చరరు నాకు ఫోన్ చేశారు. నేను మామూలుగా అమ్మాలయంలోను, హైమాలయంలోనూ ప్రదక్షిణలు చేసుకున్నా. జడ్జిగారు ఇంగ్లీషు తప్ప మిగిలిన సబ్జెక్టులు మీద వాదోపవాదాలను అనుమతించి తీర్పునిచ్చారు. చివరలో నా Question Paper మీద కేసులు మాత్రమే విచారణ జరపాల్సి ఉంది. జడ్జిగారు గంభీరంగా ‘ఇందులో వాదోపవాదాలకి అవకాశం లేదు. అంతా ఫెయిన్గా ఉంది’ అని తీర్పు నిచ్చారు.

మాటలు సరిగా ఉచ్ఛరించలేని నన్ను తిరుగులేని Academician గా నిలబెట్టింది అమ్మ. 14 ఏళ్ళు DIET Lecturer గా పనిచేశాను. ప్రభుత్వం తరఫున DIET-CET Question Paper తయారు చేశాను, విద్యార్థులను చేర్చుకుని శిక్షణ నిచ్చా, మళ్ళీ Year End Exam Question Paper తయారుచేశాను, అలా ఉత్తీర్ణులైనవారికి TRT/DSC Question Paper తయారు చేశాను, పిమ్మట జిల్లా కలెక్టర్గారి ప్రక్కన కూర్చుని DSC Interviews నిర్వహించాను; వాళ్ళు ఉపాధ్యాయులుగా పాఠశాలల్లో విధినిర్వహణ చేస్తూండగా State Resources Group Member గా Training నిర్వహించాను. విధినిర్వహణలో ఎన్నోసార్లు నిప్పుల బాటలో నడిచాను. కానీ అమ్మ కృపవలన అది పూలబాటే అయింది. డ్యూటీలో ఉన్నపుడు అమ్మే గుర్తుండేది; అమ్మ మాటలు గుర్తుకు వచ్చేవి. విధి-విధి నిర్వహణ – కర్తవ్యపాలన… ఇదే పూజ. ఒకసారి SSC Public Exams కి సంబంధించిన Question Paper Bundles (Cartons) ని Police Stationలో Deposit చేసే Route Officer Duty వేశారు. నేను అప్రమత్తంగానే ఉన్నా సక్రమంగానే చేశాను. కానీ ఆ సంగతి అర్ధం కాని D.E.O. నన్ను SUSPEND చేస్తానన్నారు ఆవేశంలో. నేను అమ్మ సహస్ర నామ స్తోత్రం చదువుకుంటూ కూర్చున్నాను. కొంత సేపటికి DEO తన పొరపాటు గ్రహించి “You are doing extremely well. నిన్ను చూసి గర్వపడుతున్నాను. పొరపాటు నీదికాదు, మా కార్యాలయ సిబ్బందిది” అన్నారు నా రెండు చేతులూ పట్టుకుని.

  1. సంస్కారం ః శ్రీ రామకృష్ణ అన్నయ్య రహి) రచించిన అమ్మ జీవిత చరిత్ర ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు” చదివి పరవశించి 1970 మే నెలలో మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాను. క్షణం ఆలస్యం చేయక అమ్మ నన్ను తన మమతల గర్భగుడిలోకి అనుమతి నిచ్చింది.

బాల్యం నుంచీ అమ్మ తన ఒంటి మీద నున్న నగలు, కట్టుకున్న గుడ్డలు నోటి వద్ద అన్నం సైతం తీసి బాధితులకి, పీడితులకి ప్రేమతో పంచి ఆనందించింది. అయితే వాళ్ళంతా బిచ్చగాళ్ళు – అనాధలు అని కాదు. తన సంతానం అని. దానం – త్యాగం అని కాదు; మాతృధర్మం అని. అటువంటి దివ్యమమకారామృత రూపిణి అమ్మ. అమ్మ చెప్పింది” బాధితుల ఎడకలిగే కరుణారస భరిత హృదయ స్పందనయే దైవత్వం” అని.

1972 జనవరిలో నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. జీవితం రు.220లు. మొదటి నెల జీతం తీసుకుని నరసాపురం మా ఇంటికి బయలుదేరా. బస్సు దిగాను. వెంటనే ఆ సమీపంలో సంతపేటలో కుష్ఠురోగులుంటారని గుర్తుకు వచ్చింది. వెళ్ళిచూశాను. ఎనిమిది మంది ఉన్నారు. బజారులోకి వెళ్ళి 8 దుప్పట్లు, 8 బాదుషా (స్వీట్స్), 8 ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నా. వాళ్ళ వద్దకు వెళ్ళా. వారి చేతికి నీళ్ళగ్లాసులు, నోటికి బాదుషా ఒంటినిండా దుప్పటి కప్పి, చేతులు జోడించి నమస్కరించా, ‘నువ్వు ఎవరు బాబూ?’ అని అడిగారు వాళ్ళు. ‘మీకు – నాకు తెలిసినా తెలియక పోయినా మనమంతా ఒకే తల్లి పిల్లలం’ అన్నాను. ఇది అమ్మ ప్రసాదించిన సంస్కారము.

బంధువులు, ఇరుగుపొరుగువారు ఆపదలో ఉంటే ఆదుకునే వాడిని. చిన్న ఉదాహరణ. 1975లో ఒక U.P. School H.M. గా పనిచేస్తూండే వాడిని. అది EMERGENCY సమయం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా Suspend చేసేవారు Special Officer. మే నెల. స్కూలుకి సెలవలు. సహోపాధ్యాయు లంతా వారి ఇళ్లకి వెళ్ళిపోయారు. ఒక ఉపాధ్యాయునికి Census duty వేశారు. ఆయన లేరు అని report చేస్తే ఆయన ఉద్యోగం ఊడిపోతుందని ఆ duty నేను చేశాను. 15 రోజులు కష్టపడినందుకు రు. 25లు ఇచ్చారు. వేసవికాలంలో పని చేసినందుకు 1 నెల E.L. ఇచ్చారు.

30 ఏళ్ళ తర్వాత E.L. వలన 20 వేల రూ.లు ఆదాయం వచ్చింది. అపుడు నా జీతం 20 వేలు. ఇంత మంచి పని చేస్తే దాని విలువ అంత అని అంచనా వేయలేము. ఈ రహస్యాన్ని అమ్మ హృద్యంగా మనోజ్ఞంగా వివరించింది “జరిగేది మంచి పనే అయినప్పుడు ఖర్చు పడ్డా, మాట తప్పినా ఇష్టమే” అని. దీనినే Shakespeare మహాకవి “Do a little wrong to do a great right” అంటారు (The Merchant of Venice, Court Scene). ఆ సంస్కారాన్ని ఉగ్గుపాలతో రంగరించి మనకి పోసింది అమ్మ.

  1. సద్వస్తుజ్ఞాన సంపద :- శ్రీరాధాకృష్ణ శర్మ గారి కుమార్తె చి.సౌ. శైలజ అప్పుడు ఏడాది పిల్ల. ఒకనాడు ఆ పాపని ఒడిలో వేసుకుని జోకొడుతున్నా. ఎదురుగా కుర్చీలో అమ్మ ఉన్నది. శ్రీమత్సింహాసనేశ్వరిని తలపిస్తోంది. అప్రయత్నంగా నేను “అమ్మా! నాకు ముందుగా ఆడపిల్ల పుట్టాలి. నువ్వే పుట్టావు అనుకుంటాను. నీ పేరు పెట్టుకుంటాను” అన్నాను. అమ్మ చిరునవ్వు చిందించింది. ఆ మాటలు ఆనాడే మరిచిపోయినా. ఎనిమిది ఏళ్ళ తర్వాత నాకు వివాహమైంది. ఆడపిల్ల పుట్టింది. నామకరణం, అన్నప్రాసన కోసం జిల్లెళ్ళమూడి వచ్చాం. పాపని అమ్మకి అందించా. అమ్మ ఆ చిన్నారిని తన తొడపై కూర్చోబెట్టుకుని, బొట్టుపెట్టి, తల మీద పూలు చల్లిపాయసం తినిపించింది. “ఏ పేరు పెట్టమంటావు, నాన్నా!” అని అడిగింది. “అమ్మా! నీ ఇష్టం” అన్నాను. “నువ్వేదో అనుకున్నావు కదా!” అన్నది. నాకు గతం గుర్తు లేదు. “నీ ఇష్ట మమ్మా” అన్నాను మళ్ళీ. “నువ్వు చెప్పు, నాన్నా! నువ్వు చెప్పినా అది నేను అనుకుంటేనే అన్నది. అప్రయత్నంగా ‘నీ పేరు పెట్టు” అన్నాను. “అనసూయ” అని నామకరణం చేసింది.

ఆశ్చర్యం. ఆ సందర్భంగా ఒక నిత్యసత్యాన్ని, శివసంకల్ప రీతిని ప్రబోధించింది. అమ్మ అనుకోనిదీ, చేయించనిదీ మనం అనుకోలేం, చేయలేం. ఈ విధంగా అమ్మ జ్ఞాన భిక్ష పెట్టిన సందర్భాలు కోకొల్లలు.

మరొక ఉదాహరణ.

అది వేసవికాలం. ఒకనాటి సాయం సమయం. అమ్మ మంచం మీద పడుకున్నది. మెలకువగానే ఉంది. “తలనెప్పిగా ఉంది, నాన్నా! రెండు చేతులతో గట్టిగా పట్టుకో” అన్నది. అమ్మ సర్వసంగపరిత్యాగి కాదు; విశ్వకుటుంబిని. కావున తీవ్రస్థాయిలో అమ్మకి సమస్యల సుడిగుండా లుంటాయి. నా శక్తి మేర అమ్మ తల గట్టిగా అదిమి పట్టుకున్నాను. అది అమ్మకి ఎంతో హాయినిచ్చింది.

ఆ సమయంలో 13 లేక 14 ఏళ్ళ వయస్సుగల ఇద్దరబ్బాయిలు అమ్మ దర్శనానికి వచ్చారు. తత్కాల పూజారిని నేనే. వారు తమ వెంట కొబ్బరి కాయలు తెచ్చుకున్నారు. 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులై ఉండవచ్చు. కొబ్బరికాయలు కొట్టి తెచ్చారు. వాటిని అమ్మకి అందించాను. అమ్మతాకింది. నాలుగు కుంకుమ పొట్లాలు చేర్చి ప్రసాదంగా తిరిగి ఇచ్చా. వాళ్ళు అమ్మకి నమస్కరించుకుని వెళ్ళిపోయారు అంతే. చాల చిన్న సంఘటన.

ఆ తర్వాత అమ్మ నాతో అన్నది, “వాళ్ళు ఏటా వస్తారు, నాన్నా! ఏటా పరీక్షల్లో Pass అవుతున్నారు. ఈ సారి Fail అయ్యారు” – అని. నేను అమ్మ తల వైపు ఉన్నాను, వాళ్ళు అమ్మ పాదాల వైపు వచ్చి వెళ్ళారు. అసలు వాళ్ళని అమ్మ కళ్ళతో చూసిందో లేదో కూడా తెలియదు. అది సరే వాళ్ళు అమ్మతో ఏ సంభాషణా చేయలేదు. ప్రతి ఏడూ Pass అవుతున్నారట; ఈ ఏడు Fail అయ్యారట. ఎలా చెప్పగలిగింది?

ఆ పిల్లలు సామాన్యులు కారు; Fail అయినా వారి భక్తి భావంలో మార్పు రాలేదు వాళ్ళు దేవునితో వ్యాపారం చేయటంలేదు. వారి పరిణతస్థితి సనకసనందనాది మహర్షులను తలపించింది. కాగా అమ్మ సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ లక్షణాలకి ప్రత్యక్ష సాక్షులు ఎవరు? అమ్మకి సన్నిహితంగా మెలిగే అదృష్టవంతులు. వారే శ్రీమంతులు. కనుకనే మా నాన్నగారు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ శ్రీచరణాలకి నమస్కరించి “అమ్మా! వీడు ధృవుడులా నీ పాద పద్మాలను చేరుకున్నాడు” అన్నారు.

అది అమ్మ కరుణ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!