“పెళ్ళిలో పెద్దపులి ఉన్నదని భయపడేవారి భయం పోగొట్టటానికే నేను పెళ్ళి చేసుకుంటున్నాను”.
అమ్మలో అలౌకికిత గుర్తించిన ఒకరు అమ్మ పెళ్ళి నిర్ణయమయినదన్న విషయం తెలుసుకుని “నీకెందుకమ్మా పెళ్ళి ?” అని అడిగినప్పుడు
చెప్పిన సమాధానమది. “ఎన్ని వచ్చినా మనస్సుకు ఏమీ సంబంధం లేదని చెప్పటం కోసమే నా యీ పెళ్ళి”.
అదే సందర్భంలో మరొకరికి తెల్పిన సత్యమది. సామాన్యంగా ప్రజాసమూహంలో వివాహం అధ్యాత్మిక సాధనకు విరుద్ధమనీ, సంసారం అనుల్లంఘనీయ సాగరమనీ కొన్ని భ్రమలు ఉన్నాయి. రాగం అనుబంధమై బంధహేతువవుతుందని కూడా అత్యధికుల మూఢవిశ్వాసం. గృహస్థాశ్రమము ఐహికానికే తప్ప ఆముష్మికానికి సరి అయిన రంగం కాదనే పలువురి నమ్మకం.
అట్లా చీకటిలో పడిపోయిన జనసందోహానికి వెలుగు ప్రసాదించటం కోసమూ, యథార్థం బోధించటం కోసమే అమ్మ వివాహం చేసుకున్నారేమో ననిపిస్తుంది. అమ్మ వివాహానికి, గృహస్తాశ్రమానికి అనన్యమైన ప్రాముఖ్యత నిస్తుంది.
అమ్మ వివాహానికి, యిచ్చిన నిర్వచనాలే క్రొత్త వెలుగులను ప్రసరిస్తున్నాయి. ఒక పెన్నిధి అండన జేరటమే పెండ్లిట. ఆ అండను చేరే పరిణామమే పరిణయమట. సర్వాన్నీ అనుభవిస్తూ, సర్వాన్నీ వదిలివేయటమే వివాహమట. కళంకరహితమయిన మనస్సును కళంకరహితంగా అర్పించుట కళ్యాణమట.
ఒక సంభాషణలో ఆశ్రమాల ప్రసక్తి వచ్చినప్పుడు గృహస్థాశ్రమాన్ని చిన్న చూపు చూడరాదని చెప్తూ అన్నది.
“ఏ ఆశ్రమానికి ఆ ఆశ్రమం అన్నీ గొప్పవే. ఎందులో ఉండే కట్టుబాట్లు అందులో ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్లు అనుభవించగలిగి చెప్పినవి చెప్పినట్లు చేయగలిగితే, తెలుసుకున్నా ననుకునేది తెలుసు కోగలిగితే అన్నిటికీ ఒకటే స్థితి. అప్పుడు అన్ని ఆశ్రమాలకూ ఒకే విలువ, అన్ని ఆశ్రమాలూ ఒక స్థితినే ఆశ్రయించి ఉన్నాయి.
ఈ భార్యా, సంతానమూ సంసార బాధ్యతలతోనే జీవితమంతా వ్యర్థమౌతున్నదనీ, ఆధ్యాత్మిక సాధనకు సమయం సమకూరటం లేదని వాపోయిన ఒకరితో అన్నది.
“సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన, నాయనా! ఆధ్యాత్మిక సాధన అంటే వేరే అదేదో కాదు. నువ్వు చేసే ప్రతి పనీ భగవత్సేవయనీ, భగవదాజ్ఞాను సారమే ననీ అనుకోగలిగితే .. యీ సంసారం ప్రతిబంధకం కానేరదు. అనగా నీ దృష్టిలో, భావనలో మార్పు తెచ్చుకోవటమే.”
మరొకసారి తన ఆధ్యాత్మిక సాధన యేమిటి? అని అడిగినవారితో… “పిల్లలను కనడమే…” నని నిర్లిప్తంగా చెప్పింది.
అమ్మ దృష్టిలో భార్యాభర్త లుభయలూ సమమే. “భార్యకు భర్త ఎలా దైవమో, భర్తకు భార్య కూడా అలాగే దేవత” అని అమ్మ సందేశం. సాకారోపాసనకు అంతకన్న సులభమయిన, సుగమమయిన మార్గం లేదని అమ్మ ఉద్దేశ్యం. అందుకే అమ్మ జరిపించే వివాహాల్లో వధువు వరుని పాదాలు కడగటమే కాకుండా, వరుడు వధువు పాదాలు కడగాలని అమ్మ ఆదేశం.
భార్యాభర్తలకు వియోగం అనేది లేదని కూడా అమ్మ భావన. మంగళ సూత్ర రూపేణా భర్త పాదాలు భార్య కంఠాన ఎలా బంధింపబడి ఉంటయ్యో యజ్ఞోపవీత రూపేణా భార్య భర్తతోటే సదా ఉంటుందని అమ్మ అభిప్రాయం. భర్త అంటేనూ, భార్య అంటేనూ శరీరాలు మాత్రమే కాదు గదా అని అమ్మ అంటుంది.
అమ్మ దృష్టిలో వితంతువు కూడా లేదు. భర్త స్మృతి ఉన్నంతవరకూ ఎవరూ వితంతువులు కారని అమ్మ భావం.
ఒకప్పుడు ఒకరు సన్యాసం తీసుకొనవలె ననుకుని అమ్మ అనుజ్ఞకోసం వస్తే అప్పుడు అమ్మ అన్నది.
“వివాహం చేసుకుని గృహస్థుగా ఆధ్యాత్మిక సాధన చేయటం కోటలో ఉండి యుద్ధం చేయటం; సన్యసించటం కోట విడిచి యుద్ధానికి వెళ్ళటం.”
అందుకనే అమ్మ ముక్కు మూసుకు కూర్చున్నదే తపస్సూ, యోగసాధన కాదని అంటూ, విరాగమంటే ప్రపంచమందు విముఖత కాదనీ, సర్వత్రా అనురాగం కలిగి యుండడమేననీ విశదీకరిస్తుంది.
పరిమితమైన మమకారాన్ని అపరిమితం చేయమంటుంది. నీ బిడ్డను ప్రేమించినట్లు లోకంలో ప్రతిజీవినీ, ప్రతి వస్తువునూ ప్రేమించమంటుంది. అంతే కాని యీ ప్రేమ బంధమౌతుందని రసవిహీనులు కావద్దంటుంది.
అందుకే అమ్మ తనకు పూజలు చేసే వేళలకంటే వివాహాలు జరిపించే సమయాల్లో అత్యంతమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది.
ఆ కళ్యాణమూర్తికి నేడు కళ్యాణదిన మహెూత్సవం. ఈ శుభవేళలో అమ్మకు ఒక అభ్యర్థన చేసుకుంటున్నాము. జగత్కళ్యాణం కూడా చేయమనీ, విలంబం లేకుండా పందిళ్ళు వేయించమనీ, పచ్చతోరణాలు కట్టించమనీ, మంగళ వాద్యాలు పిలిపించమనీ, మహదాశీస్సులు కురిపించమనీ…
(మే, 1966 ‘మాతృశ్రీ’ మాస పత్రిక సంపాదకీయం)