1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ కుంకుమ మహిమ

అమ్మ కుంకుమ మహిమ

G V Kameswara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : November
Issue Number : 4
Year : 2013

నాది విశాఖపట్నం. నా పేరు జి.వి.కామేశ్వరరావు. కాని మా విశాఖపట్నం మాతృశ్రీ అధ్యయన పరిషత్ లో సివిల్ ఇంజనీర్ కామేశ్వరరావు, నేను ఉన్నాము. ఇద్దరు కామేశ్వరరావులతో అందరికీ కన్ఫ్యూజ్ వుంది కాబట్టి నాకు పూల కామేశ్వరరావు అని, శ్రీ చక్రవర్తిగారు, శ్రీమతి కుసుమాచక్రవర్తిగారు నామధేయం చేశారు. అందరూ పూలకామేశ్వరరావు అంటారు.

ఈ రోజు బుధవారం సాయంత్రం పూర్ణిమ వస్తుంది. కాని నేను చూడలేదు. విచిత్రం ఏమిటంటే నే జ్యోతిష్యుడిని. రాత్రి గల పూర్ణిమ ఈ రోజు. మాకు అమ్మ మందిరంలో పూజ జరుగుతుంది. నేను ప్రతి గురువారం, వారానికి సరిపడా పూవులు, అమ్మకి గజమాలలు ఇస్తాను. నేను camp వెళ్ళినా ఎవరికైనా చెప్పి వెళ్తాను. పువ్వులు ఎలాగైనా పంపిస్తాను.

నేను మొండిని. మిలటరీలో కూడా పనిచేసాను. ఏదీ ఖాతరు చేయను. నా తత్వం ఏది జరిగినా భయపడను. జయహోమాతా అనుకొని బయలుదేరుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా రోడ్డు ఖాళీగా ఉంటే కారు 100 కి.మీ. వేగంతో, బైకు అయితే 70, 80 కి.మీటర్ల వేగంతో వెళ్తాను. ఈ రోజు బుధవారం సాయంత్రం నా మనుమరాలు నాకు ఫోను చేసి 7.45 p.m. కి తాతా ! నువ్వు రా ! నాకు అర్జెంటుగా A4 size file కావాలి. రేపు నాకు పని వుంది అని చెప్పింది. మాకు 3 కి.మీటర్ల దూరంలో మా అమ్మాయి వుంది. సరే అని టి.వి. చూస్తున్న నేను ఆపి బయలుదేరాను. మావి B.R.T.S. Roads. అందరూ 80/100 స్పీడులో వెళ్తాము. చాలా Wide Roads. మంచి లైటింగ్ ఉంటుంది. కాని ఒక 4 లైట్లు మాత్రం వెలగలేదు. నేను వేగంగా వెళ్తూ వుంటే ‘చాలా పెద్ద ఇనుపరాడ్డు’ని నలుగురు. మనుషులు భుజం మీద ఎత్తుకొని చీకట్లో రోడ్డుకి అడ్డంగా క్రాస్ చేస్తున్నారు. అదే చీకట్లో నేను ఒక అడుగుదూరంలో చూశాను. ఆ స్పీడులో తలవంచి రాడ్డు క్రింద నుంచి దూరేను. బైకు మీద తలవంచి దూరేను కాని నేను బయట పడడం అసంభవం. వాళ్లు పెద్ద పెద్ద కేకలు వేసారు. నేను Height 5’11’ ఉంటాను. బైకు మీద కూర్చుంటే బాగా ఎత్తు వస్తాను. వాళ్ళ భుజం మీద రాడ్డు ఉంది. నేను ఎలా బయటకు వచ్చానా ! అని ఆలోచించాను. భయం వేసింది. ఇది నా జీవితంలో మొదటిసారి భయపడడం. తల్చుకుంటే భయం వేసింది. చీకట్లో అంత ఇనుపరాడ్డు కనబడదు. కనబడలేదు. నేను యాక్సిడెంట్ నుంచి తృటిలో బయటపడ్డాను. తప్పించుకోలేక పోయుంటే ఆ స్పాట్లోనే చనిపోయేవాడిని. ఇందులో అస్సలు అనుమానం లేదు. రాడ్డు క్రింద నుంచి బయటకు వచ్చిన తరువాత అమ్మా ! అన్నాను. అమ్మా ! ఎలా రక్షించావు తల్లీ అని.

నేను కారులో అయినా, బైకులో అయినా బొట్టు పెట్టుకుని జయహోమాత అని అమ్మకి దణ్ణం పెట్టుకుని ఎల్లప్పుడూ బయటకు వెళ్తాను. నా ముద్దుల మనుమరాలు అర్జెంటుగా రమ్మని పిలచింది అని వెంటనే స్నానం చేసి బయలుదేరి బొట్టు పెట్టుకోకుండా బయలుదేరాను. కనీసం అమ్మని తల్చుకోలేదు. జయహోమాత అని కూడా అనలేదు. నా మనుమరాలికి ఫైల్ కొని ఇచ్చి ఇంటికి వచ్చి, బట్టలు మార్చుకున్న సమయంలో నా ముఖం మీద బొట్టులేదు. ఏమిటి? అని ఆశ్యర్యం వేసింది. అమ్మని తల్చుకోకపోయినా చూడండి. అమ్మ మనల్ని తలుచుకొని, తన బిడ్డల్ని ఎలా రక్షించిందో. అమ్మ మనల్ని ఎలా అనుక్షణం కాపాడుతుందో ఈ సంఘటనను బట్టి అవగతమగుచున్నది. శ్రీ చక్రవర్తి గారు మన విశ్వజననిలో రాసిన ఆర్టికల్స్ చదువుతూ ఆనందిస్తూ వుంటాను. నేను జిల్లెళ్ళమూడి వచ్చినా అంతే. మద్రాసులో, హైదరాబాదులో ఎన్నిసార్లు అన్ని ట్రైన్సు జయహోమాత అంటే 30, 40 ని.లు ఆగిన సందర్భములు

ఎన్నో ఉన్నాయి. ఇది మన అమ్మ కుంకుమ మహిమ.

జిల్లెళ్ళమూడిలో అమ్మ అందరికి బొట్టు పెట్టి పంపేది. ఇప్పుడు అర్థం అయింది. అమ్మ ఎందుకు బొట్టుపెడుతూ ఉంటుందో.

నేను జిల్లెళ్ళమూడి వచ్చినపుడల్లా అనసూయ ‘ ఆలయంలో ఖాళీకవర్లో కుంకుమ పట్టుకొని విశాఖపట్నం వచ్చేస్తాను. నేను జాతకములు చెప్పు సమయంలో పెళ్ళికాని పిల్లలు, వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళందరికీ అమ్మ కుంకుమ ఇస్తాను. వాళ్ళు అందరికీ జయం కలుగుతున్నది. ఇది అక్షర సత్యం. నా అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ కుంకుమ బొట్టు ధరించవలసిందిగా కోరుతున్నాను. ఇది బొట్టు మహిమ. ఎందరికో ఎన్నో శుభాలు జరిగినవి. శ్రీ చక్రవర్తిగారు క్షణక్షణం అనుక్షణం అంటే ఇప్పుడు పూర్తిగా ఈరోజు నాకు అర్థం అయింది. క్షణక్షణం అమ్మ కాపాడుతున్నది అని.

నాకు ఈ రోజు సివిల్ ఇంజనీర్ శ్రీ కామేశ్వరరావు గారు ఇచ్చిన జాతకాలు కూడ వ్రాయకుండా ఈ జరిగిన సంఘటనలు నా స్పందన వ్రాయాలని బుద్ధి పుట్టింది. ఇది ప్రచురించి అమ్మ కుంకుమబొట్టుమహిమ గురించి తెలియజేయ గోరుచున్నాను. ఎక్కడికి వెళ్ళినా రోడ్డుపైనా ఈ రోజుల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.మన అమ్మ బిడ్డలు అందరూ అమ్మ కుంకుమ పెట్టుకుని అమ్మని తలుచుకొని వెళ్ళమని నా అభ్యర్ధన. ఈ రోజు నేను బతకడానికి ఏమాత్రము స్కోపులేదు. కాని ఎలా బతికేను అమ్మా! అని అనుకున్నాను. నా కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా వచ్చాయి. కరుణామయి ! ఎలా బ్రతికించావు నన్ను ? జయహోమాతా, శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని అందరూ అనండి.

నేను ఇది రాసిన మరునాడు అంటే 18.9.13 న ఇద్దరు ముస్లిం స్త్రీలు వచ్చారు. వాళ్ళకి ఎల్లప్పుడూ అమ్మ కుంకుమ ఇస్తాను. ముస్లింలు కూడా ఇప్పటికి కనబడకుండా కడుపుమీద గాని, చాతిమీదగాని బొట్టుపెట్టుకొని Inter views కి, పెళ్ళిచూపులకి వెళ్తున్నారు. జయం పొందుతున్నారు. కుల, మత, విచక్షణ లేకుండా అందరికి అమ్మ కుంకుమ పనిచేస్తుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!