ఆడుదము మనము హరి రతి
బాదుద మే ప్రొద్దు విష్ణు భద్రయశంబుల్
వీడుదము దనుజసంగతి.
గూడుదము ముకుంద భక్తకోటిన్ సూటిన్
(రండు. మనమూ శ్రీహరియందు భక్తి ప్రేమలతో ఆడుకుందము.
విష్ణువు యొక్క కీర్తి గాథలను, రక్షక చరిత్రలను పాడుకొందము.
అసురసాంగత్యం వీడుదము. గోవిందుని భక్త కోటితో కూడి ఉందము).
శ్రీమద్భాగవతం- సప్తమస్కంధం – మహాకవి పోతన
శ్రీ వల్లూరి బసవరాజు అన్నయ్య ఒకే లక్ష్యం కోసం క్షణక్షణమూ మధన పడ్డ వ్యక్తి. తపన పడ్డ మనీషి. ఆ లక్ష్యం మనందరికీ ఎరుక ఉన్నదే. మన ఆలోచనలలో నిరంతరం తిరుగాడేదే. అయితే నిరంతర తపనతో అది ఆయన తపస్సు అయింది. అదే అమ్మ సంస్థలను అనేక కోణాలలో అభివృద్ధి చేయాలని ఆ లక్ష్యంతో ఆయన నిత్యం ఎన్నో పథకాలను ఆలోచించేవాడు. అమ్మకు రథం ఏర్పాటు చేయాలనీ అమ్మ దర్శనానంతరం తిరిగి వెళ్తున్న వారికి ప్రసాదం ఇచ్చి పంపితే బాగుంటుందనీ అమ్మ సేవలో అమరులైన ఆత్మీయసోదరుల చిత్రపటాలు వాత్సల్యాలయ రెండవ అంతస్తు గోడలపై అలంకరింపచేయాలనీ, జిల్లెళ్ళమూడి వచ్చే సోదరులకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలనీ, అవి నిత్యం పర్యవేక్షణలో ఉండాలనీ, అమ్మ సేవలో తాను అనేకరకాలుగా పాలుపంచుకుని సోదర లోకానికి మార్గదర్శకుడు కావాలనీ, అమ్మను అర్కపురీశ్వరిగా సంభావించాలని ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. అవి కార్యరూపంలో పెట్టాలని తపనపడే సమయంలో ఎవరినీ లక్ష్యపెట్టని తత్వం. ఆయన “మనసు వెన్న! మాట కఠినం” అనే భావన కలిగించి ఉండవచ్చు. అభిప్రాయ భేదం కలిగినా అది అమ్మ కోసమే. అమ్మ కోసం అవధులు లేని పయనం. నా అనుభవం ఒకటి చెబుతాను. హైదరాబాద్వారు అమ్మ బిడ్డల వాట్సప్ గ్రూప్ నడుపుతున్నప్పుడు నేనూ, బసవరాజు అన్నయ్య అందులో సభ్యులం. నేను ఒకసారి ఒక మెసేజ్ పెట్టాను –
అమ్మలాంటి వ్యక్తిత్వం, జ్ఞానసిద్ధి అమ్మకే సాధ్యం అని ఆ సందేశ సారాంశం. అయితే బసవరాజు అన్నయ్య మరో పార్శ్యం చూశాడు. అమ్మను వ్యక్తులతో పోలుస్తావా? అని ఆగ్రహం వ్యక్త పరచాడు. వివాదాలతో విసిగి ఉన్న నేను ఎలాంటి వాగ్వివాదాలకు తావు ఉండకూడదని ఆ గ్రూపు నుండి వైదొలగాను.
ఆ తరువాత జిల్లెళ్ళమూడి వచ్చాను, ముందు నేను వచ్చాను అదే రోజు బసవరాజు అన్నయ్య కూడా జిల్లెళ్ళమూడి వస్తున్నాడని సమాచారం. అందరూ మా ఇరువురి స్వభావాలు ఎరిగిన వారు కావటంతో మేమిరువురం భౌతికంగా కలహించుకుంటామని భావించారు. అయితే బసవరాజు అన్నయ్య వాహనం దిగి లోపలకి వస్తూ ముందు నన్నే చూశాడు. చూసి చూడటంతోనే నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అందరూ విస్తుపోయి చూశారు. ఇదేమిటి యుద్ధం కోసం ఎదురుచూస్తుంటే ఆలింగనం దర్శన మిచ్చిందే అని. ఆలింగనానంతరం నన్ను ఉద్దేశించి “సుబ్బారావు! ఆ రోజు ఆ విశ్లేషణ చేసింది నీవని తెలియక నేను మరో కోణంలో చూశాను. అదే నీవని తెలిస్తే రామకృష్ణ అన్నయ్య వారసుడుగా నీ ఆలోచనల మీద నాకు అపరిమిత మైన గౌరవం ఉన్నది. తరువాత తెలిసి నీవు వ్రాసిన మెసేజ్ మరోసారి చదివాను. అప్పుడు నాకు అర్థం అయింది నీవు అమ్మను అందరితో పోల్చటం లేదని అందరిలో అమ్మ విశిష్టురాలని, అమ్మ విధానం న భూతో న భవిష్యతి అని చెప్పే క్రమంలో అది ఒక దశ అని, నా అవగాహన తప్పు అని అంగీకరిస్తున్నాను అని అన్నాడు. అదీ ఆయన ఔన్నత్యం. అమ్మను తగ్గిస్తున్నారంటే కత్తుల దూయగలడు, అది కాదనుకుంటే ఆలింగనం చేసుకోనూగలడు.
జిల్లెళ్ళమూడిలో ఉన్న కాలంలో అందరి యోగక్షేమాలు తనవిగా భావించే వాడు. అది తన బాధ్యతగా భావించే వాడు. ఒకసారి ఒక కళాశాల విద్యార్ధిని కళ్ళు తిరిగి పడిపోతే తన కారులో బాపట్ల వైద్యానికై తీసుకుని వెళ్ళాడు. అదీ ఆయన సహృదయత.
అందరింటి సోదరులెవరైనా వారింటికి స్వతంత్రంగా వెళ్ళగలిగిన వాడు బసవరాజు అన్నయ్య. వారిని గేటు దగ్గర నుంచే గట్టిగా పిలుస్తూ, గేటు వేసి ఉన్నందుకు వారికి క్లాసు తీసుకుంటూ లోపలికి వచ్చి కావలసింది అడిగి తినగల త్రాగగల నిర్మొహమాటం కలవాడు, ఆత్మీయత కలవాడు. అదీ ఆయన విశిష్ట వ్యక్తిత్వం, అందరింటి సభ్యుడుగా ఆయన నైజం.
దాదాపు ఆరుదశాబ్దాలు అమ్మను బంధుమిత్ర సమేతంగా పూజించాడు. అమ్మ విధానాలు అనుసరించాడు. ఆయన ప్రవర్తన అన్ని విధాలా సమంగా ఉంచుకోగల స్థిరచిత్తుడు. ఎవరితోనైనా అమ్మ సేవావిధానాలలో వైవిధ్యమే కానీ, ఎవరితోనూ విరోధం లేని నిష్కల్మష హృదయుడు బసవరాజు అన్నయ్య. బసవరాజు అన్నయ్య కుటుంబ సభ్యులకు అమ్మ స్థైర్యం ప్రసాదించుగాక !
—
శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్టు సభ్యులు శ్రీ వారణాని ధర్మసూరిగారు, అడ్వకేట్ శ్రీ తల్లావఝుల నరసింహంగారు ఢిల్లీలో చత్తీస్గడ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారిని కలుసుకున్నారు.
శ్రీ హరిచందన్ గారు సనాతన ధర్మంపట్ల, సంస్కృత భాషపట్ల, మన సంస్కృతి, సంప్రదాయాలపట్ల విశేషమైన అభిమానం కలవారు. వారిని కలుసుకొని “అమ్మతో సంభాషణలు” ఆంగ్లానువాద గ్రంథం (Conversations with AMMA- Vol.2) బహూకరించి, జిల్లెళ్ళమూడికి రావలసిందిగా ఆహ్వానించారు శ్రీ ధర్మసూరిగారు. గ్రంథాన్ని, ఆహ్వానాన్ని శ్రీ హరిచందన్ గారు ఆప్యాయంగా అందుకున్నారు.