‘అమ్మా! నీవు ఎందుకు వచ్చావో, నీ అవతారమేమిటో చెప్పమ్మా!’ అని చిదంబరరావు తాతగారు అమ్మను అడిగారు. “నాది అవతారమని ఎవరు చెప్పారు? నేనేదీ పెట్టుకు రాలేదు. నాకేమీ తెలియదు. ప్రత్యేకించి ఒక పని అంటూలేదు. సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతున్నదో…” అని హఠాత్తుగా అమ్మ ఆపేసింది.
తరింప జేసే తల్లి అమ్మ. అట్టి అమ్మ అవతార పరమ ప్రయోజనాన్ని వివరిస్తూ సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు, “అమ్మ కాల స్వరూపిణి- కాళి. జీవులను తనలో కలుపుకోవటానికి వచ్చింది” అన్నారు. అంటే – “అచ్చపు జీకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన”, అజ్ఞానాంధకారంలో అగాధ అధః పాతాళంలో కూరుకు పోయిన అశక్తులను దీనులను నిస్సహాయులను చూసి ఆకారణకారుణ్యంతో అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నది. తరతమ భేదం లేక సర్వుల కర్మ ఫలాన్ని నశింపజేసి పునరావృత్తిరహితమైన మోక్ష పదాన్ని అనుగ్రహించాలని, అంతేకాదు..
ఒక సందర్భంలో ‘అమ్మా! నీ కోరిక ఏమిటి.’ అని అడిగితే అమ్మ “నాన్నా! మీరంతా నాలా హాయిగా ఉండాలి” అంటూ తన లోకోత్తర మహనీయ తత్వాన్ని వ్యక్తం చేసింది. అమ్మవంటి మధుర మమకార స్రవంతి చరిత్రలో నిన్నటి వరకు లేదు, రేపు ఉండదు. సకల జీవుల్ని తన స్థాయికి తీసికొని వెళ్ళాలని అఖండానందాన్ని ప్రసాదించాలని సంకల్పించింది – తల్లి కనుక.
అమ్మవంటి అవతారమూర్తులు బ్రాహ్మీమయ మూర్తుల చెంత ఎలా నడచుకోవాలో గీతాచార్యులు నిర్దేశించారు.
తం విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః – అని.
అనునిత్యం ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అసంఖ్యాకంగా అమ్మని ఆశ్రయిస్తారు. వారి ఇష్ట కామ్యార్థ సిద్ధిని ప్రసాదించే ధర్మమూ తనదే.
‘నువ్వు రాజరాజేవ్వరివి అమ్మా’ అంటే “మీరు కానిది నేనేదీ కాదు; మీరు నా బిడ్డలేకాదు, నా అవయవాలు” అన్న అమ్మ ప్రవచనానికి అనుగుణంగా అవనీ స్థలిపై మన (మానవ) ప్రతినిధిగా హైమను దేవతగా ప్రతిష్ఠించింది. హైమాలయం అమ్మ అనంతశక్తికి ప్రత్యక్ష నిదర్వనం, అమ్మ అవతార లక్ష్యానికి ప్రతిరూపం.
ఒక సందర్భంలో హైమ ‘నన్నెందుకు కన్నావు?’ అని ప్రశ్నిస్తే, అమ్మ “అది నాయిష్టం. నాకు కావలసిన దానికి నేను కన్నాను” అన్నది. హైమవతీశ్వరి విగ్రహాన్ని అవలోకిస్తే వాస్తవం అవలీలగా అవగతమౌతుంది. వరద హస్తాల్లో చిన్ముద్ర – అద్వైతముద్ర స్పష్టంగా గోచరిస్తుంది. ఆ ముద్రని శ్రీదక్షిణామూర్తి, మహాయోగీంద్రులు వహిస్తారు. అంటే ‘మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వ’ రూపిణిగా అద్వైత సిద్ధి ప్రదాయినిగా హైమను అమ్మ ప్రతిష్ఠించింది.
ప్రప్రధమంగా హైమను దేవతగా విశ్వసించి, రుద్రాభిషేక పూర్వకంగా లలితా సహస్ర నామాదులతో పూజించిన ఘన నిష్టాగరిష్ఠులు శ్రీరాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారు.
‘అతి భక్తిన్ యజియించుచుండెద మహాయాగక్రమారాధ్యయై
పతితోద్ధారణ తత్పరత్వ మతియై భాస్వద్దయామూర్తియై
శృతి సంస్తోత్ర మహా ప్రభావనిధియై శోభల్లియున్ మానవా
కృతి కన్పట్టుచు దైవతంబయిన శ్రీగీర్వాణి హైమావతిన్ – అని కీర్తించారు.
హైమ మానవిగా పుట్టి మాధవిగా ఎదిగింది. అనిపిస్తుంది. అచ్చమైన హైమ తత్వాన్ని ప్రకటిస్తూ అమ్మ “మనకి హైమ మీదకంటే హైమకి మన మీద ప్రేమ ఎక్కువ. మన ప్రేమకూ హైమ ప్రేమకూ తేడా ఉంది. దానికీ మనకూ పోలిక ఏమిటీ?” అని అన్నది. అంటే నిరుపమానమైన ప్రతిఫలాపేక్ష రహితమైన ప్రేమైక రసస్వరూపిణి హైమ.
హైమలోని దివ్యత్వాన్ని అమ్మ ముందుగానే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాలను వివరిస్తాను.
- ఒకసారి హైమ జన్మదినోత్సవ సందర్భంగా అమ్మ తన నగలన్నీ హైమకు అలంకరించి, హైమను కిరీటధారిణిని చేసి, సింహాసనాసీన చేసి, అందరిచే నమస్కరింపచేసి, హైమచే ప్రసాద వితరణ కావించింది.
- ఒకసారి ఇంకొల్లు సోదరులు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను తమ గ్రామానికి తీసికొని వెళ్ళి పూజించుకుంటామని అభ్యర్థించారు. అపుడు హైమ పరుచూరులో శ్రీతంగిరాల సత్యనారాయణగారింట్లో ఉన్నది. అమ్మ తాను రాలేనని తన బదులు హైమను తీసుకెళ్ళమని చెప్పింది. అట్లే వారు హైమను తీసికొని వెళ్ళి అమ్మ స్థానంలో కూర్చుండబెట్టి ఎంతో సంతోషంగా అర్చించుకున్నారు.
- ‘ప్రేమార్ద హృదయా నిత్యం సర్వస్య ప్రియదర్శినీ,
సద్భావ సంపత్తియుతా సర్వభూత హితేరతా’ అన్నట్లు దయగల హృదయం దైవనిలయం అదే హైమ. కనుకనే హైమ ఎవరికైనా కాలిలో ముల్లు దిగితే తన కంట్లో దిగినట్లు విలవిలలాడేది. అమ్మను ఆశ్రయించి వాళ్ళ బాధలు తొలగించమని ప్రార్థించేది, పోట్లాడేది. ఒకనాడు “అమ్మా! వాళ్ళ (ఫలానా వారి బాధలు తీసెయ్యరాదూ!’ అని అర్థించింది. హైమక్కయ్యలోని ఈ లోకోత్తర త్యాగ గుణానికి ఆర్ద్రచిత్తానికి అమ్మ మురిసి పోయింది. “నాదాకా ఎందుకు, హైమా? నువ్వే తీసెయ్యొచ్చు కదా!” అన్నది. విశ్వశ్రేయస్సాధనకి హైమని పటుతరమైన సాధనంగా ఎంచుకున్నది.
“హైమకు నేనే దైవత్వ మిచ్చాను” అన్నది అమ్మ. ఆ సందర్భాన్ని తలచుకున్నప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస తన ప్రియ శిష్యుడు నరేన్కి శక్తిపాతం చేసి తన సర్వ శక్తులను ధారపోసిన చిరస్మరణీయ చారిత్రాత్మక సంఘటన జ్ఞప్తికి వస్తుంది. అది యదార్థం. అమ్మ తన బిడ్డలకు పెట్టుకునే సమయంలో ముందూ వెనుకా ఆలోచించదు. అమ్మకి దాపరికం లేదు; లౌక్యం తెలియదు. దివ్య మాతృధర్మానికి బంధానికి వివశురాలై తానేం చేస్తోందో తనకి తెలియదు. శ్రీరాధాకృష్ణశర్మగారు అమ్మను ‘ప్రేమోన్మాదిని’ అని స్తుతించారు. ఒకనాడు తన సన్నిధిలో వివాహం జరుగుతూంటే హఠాత్తుగా తను లేచి వెళ్ళి తన గళసీమలోని నల్లపూసల గొలుసు తీసి పెళ్ళి కూతురి మెడలో అలంకరించింది అమ్మ. జగత్కళ్యాణం కోసం కన్న బడ్డనే కర్పూరహారతి పట్టింది. తన మంగళ సూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది.
కాగా హైమకు దైవత్వాన్ని ప్రసాదించినంత మాత్రాన అమ్మకి తరుగేమీలేదు; వెలుగుతున్న దీపం అసంఖ్యాక దీపాలను వెలిగిస్తుంది.
‘పూర్ణమధః పూర్ణమిదం,
పూర్ణాత్ పూర్ణముదత్యతే,
పూర్ణస్య పూర్ణమాదాయ,
పూర్ణమేవావ శిష్యతే – అన్నట్లు.
పూర్ణత్వమే అమ్మ అనేది పరమ సత్యం, పరమార్థం.
ఇతః పూర్వం ఆవిష్కరించబడిన అనేకానేక సత్యాల నేపథ్యంలో నా అవగాహన ఏమిటంటే –
ఈశ్వరానుగ్రహాన్ని గోరు ముద్దలు చేసి అనవరతం అయాచితంగా మనకి అందించే హైమవతీదేవి Step – down- transformer వంటిది; ప్రాకృత జీవిని పరమాత్మగా రూప విక్రియ (Spiritual Metamorphosis) చేసే అమ్మ Step up-transformer వంటింది.
హైమను క్షిప్రప్రసాదినిగా తన ప్రతిబింబంగా ప్రతిష్ఠించి, తాను సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపే సగుణమూర్తిగా…. మూల ప్రకృతిగా… సువర్ణ జ్యోతిగా అమ్మ ప్రకాశిస్తోంది. హైమ కోసం అమ్మ వచ్చింది. అమ్మ కోసం హైమ నిల్చింది.
హైమాలయానికి వెళ్ళి, హైమ నుదుట తిలకం దిద్ది, పుష్పమాలాలంకృతను చేసి, పాదాలను పుష్పాలతో పూజించి, నివేదన నోటికి అందించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించింది: ఎలా హైమను ఆరాధించాలో ఆచరణాత్మకంగా ప్రబోధించింది: మార్గ దర్శనం చేసింది అమ్మ.
‘అనవరతంబు నీదు చరణాంబుజయుగ్మము సేవ జేయు న య్యనఘుని వాంఛితంబు నిమిషార్థములో నెరవేర్తువమ్మ నిన్ మనమున నమ్మిగొల్వ ననుమానము దీరు, వచింపనేల? యో యనిమిషముఖ్య వందిత పదాంచిత! హైమవతీ మహేశ్వరీ!’ అంటూ శ్రీ హైమవతీదేవి శ్రీ చరణాలకు శతాధిక వందనముల నర్పిస్తున్నాను.
ఉపయుక్త గ్రంధావళి (Select Bibliography)
- హైమవతీదేవి విగ్రహప్రతిష్ఠ సావనీర్- 2. హైమాలయం, 3. శ్రీవిశ్వజననీ చరితమ్, 4. శ్రీవి.ఎస్.ఆర్.మూర్తిగారి ప్రసంగం, 5. మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు, 6. శ్రీ హైమవతీశతము; శ్రీ హైమవతీవ్రతము.