భారతీయ ధార్మిక జీవనానికి పునాది వివాహ వ్యవస్థ. వైవాహికజీవితమనేది ఒక దీక్ష. ఒక యజ్ఞం. సమాజంలోని సర్వ ధర్మాలకు కేంద్ర బిందువు గారస్యం. పరమపవిత్రమైన గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి చేసే వైదిక సంస్కారమే వివాహం. భారతీయ వివాహ వ్యవస్థ ఇంత విశిష్టమైనది. కనుకనే విదేశీయులు సైతం ఈ వ్యవస్థపట్ల ఆకర్షితులయి అనుసరిస్తూ ఉన్నారు. ఇంత ఆదర్శవంతమైన ధార్మిక జీవనానికి మూలాధారమైన ఈ వివాహ వ్యవస్థ మూలాలలో ఈనాడు ఒక ప్రకంపనం కన్పిస్తోంది. తరతరాలుగా నడుస్తున్న వివాహ వ్యవస్థ ఆధునిక నాగరికత పేరుతో సమూలంగా విచ్ఛిన్నమైపోయింది. రకరకాల జీవిత సమస్యలకు ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న కారణాలకు కూడా దంపతులు విడిపోయే పరిస్థితికి నేటి సమాజం చేరుకుంది. తరతరాలుగా మనం నమ్మిన వ్యవస్థ మన కళ్ల ముందే పేకమేడలా కూలిపోతున్న ఈ తరుణంలో ఏ చట్టాలు ఏం చేయలేవు. సమాజంలో ఒక అవ్యవస్థ ఏర్పడినపుడు సామాన్యులు చక్కదిద్దలేరు. అసాధారణ వ్యక్తులకే అది సాధ్యం.
మరి ఈనాటి పరిస్థితినిబట్టి వివాహ వ్యవస్థలో కనుమరుగయిపోతున్న విలువలను పరిరక్షించడం కోసం వైవాహికబంధంలో ఉన్న పరమార్థాన్ని బోధించడంకోసం అమ్మ అవతరించిందేమో అనిపిస్తుంది.
‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కళ్యాణం’ అనీ, ‘ఒక పెన్నిధి. అండన చేరడమే పెండ్లి’ అని అమ్మ తన వివాహ సందర్భంగా లోకానికి అనేక నిర్వచనాలను ప్రసాదించింది.
అమ్మ ప్రత్యేకతను విశిష్టతను గుర్తించిన అమ్మ చినతాతగారైన చిదంబరరావుగారు ‘అమ్మతో’ నీకీ పెండ్లి ఎందుకమ్మా!’అని అడిగితే లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ భరిస్తూ సంసార జీవితం ఎలా సాగించాలో లోకానికి నేర్పడంకోసమేననీ పెళ్లిలో పెద్దపులి ఉందని భయపడే వారి భయం పోగొట్టడానికి తాను వివాహం చేసుకుంటున్నట్లుగా అమ్మ చెప్పింది. అనంతమైన శక్తి పరిమిత రూపంలో అవతరించడం లోక కళ్యాణం కోసమే. సమాజ రక్షణ కోసం అమ్మ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో గృహస్థాశ్రమ స్వీకారం ఒకటి. తన వివాహం ద్వారా గృహస్థాశ్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ “సంసారంలో ఉండి సాధన చేయటం కోటలో ఉండి యుద్ధం చేయడమని” ప్రబోధించింది. ‘ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి’ అని నిర్వచించిన అమ్మ దృష్టిలో పెన్నిధి అంటే గృహస్థాశ్రమం. సాధారణంగా పెన్నిధి అండన చేరడం అంటే స్త్రీ భర్త అండన చేరడం అని అర్థం చేసుకుంటాం. కానీ అమ్మ దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమప్రాధాన్యమే. పెన్నిధిని (గృహస్థాశ్రమాన్ని) ఆధారం చేసుకుని స్త్రీ పురుషులు ఇద్దరూ ధర్మాచరణ చేయాలని, గృహస్థాశ్రమమే కర్తవ్య నిర్వహణకు, సమాజ సేవకు ఆధారమని సందేశాన్ని అందిస్తున్నది అమ్మ.
ఆధ్యాత్మిక సాధనకు సంసారం బంధ కారణమని అభిప్రాయ పడే వారికి ‘చేసేదంతా భగవత్ సేవ అనుకుంటే సంసారం ఆధ్యాత్మిక సాధనకు అడ్డు కాదనీ, సంసారం పట్ల మనకున్న ఆలోచనా ధోరణి బంధానికి కారణమని, భావ బంధమే తప్ప భవ బంధం లేదన్న సత్యాన్ని ఆవిష్కరించింది అమ్మ. అమ్మకు లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదు. లౌకిక జీవితానికీ, ఆధ్యాత్మిక సాధనకు వారధి నిర్మించిన సమన్వయ సారథి అమ్మ. ఆధ్యాత్మిక సాధన అంటే వేరే ఏదో కాదు, మనం చేసే ప్రతి పనిని భగవంతుని సేవ అనుకోగలిగితే, భగవంతుని ఇచ్ఛగా అనుకొని చేయగలిగితే, ఈ సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కానే కాదు. “ఆధ్యాత్మిక జీవితం ప్రసాదించమ్మా” అని అడిగిన ఒక సోదరుడితో “ఆధ్యాత్మిక జీవనం ప్రత్యేకంగా ఉందని అనుకోవడం లేదు. నీవు చేసే ప్రతి పని దైవ కార్యమే. జగత్తే దైవ స్వరూపం అయితే నీవు చూసేది ఏది దైవం కాదు ? నీవు చేసేది ఏది ఆధ్యాత్మికం కాదూ ?” అని అమ్మ ప్రబోధించింది.
ఒక సోదరితో వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురైతే వాటిని సహనానికి శిక్షణగా భావించు. నీవు పసి బిడ్డలను సాకేటప్పుడు బాలకృష్ణుడని దృష్టితో చూడు. ఆ దృక్పథంతో పెంచు. వాళ్లకు స్నానం చేయించేటప్పుడు భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను అనుకో. ఆ విధంగా గృహస్థ జీవితమంతా అనితరమైన విశుద్ధమైన సాధనగా మారుతుంది అనీ, “సంకల్పమే సంసారం” అని వివాహాన్ని తరణోపాయంగా చూపింది అమ్మ. దినచర్యను దేవునికి అర్చనగా నిర్వహించడమే మానవ జీవితానికి పరమార్ధం అని అమ్మ ప్రభోధం.
(సశేషం)