సమాజ రక్షణ కోసం మానవుల మధ్య అప్పుడప్పుడు మహాత్ములు అవతరించి సమాజ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరించి తమ ప్రబోధాలతో సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తారు. అందుకోసం వారి జీవితాలని ఒక సాధనగా చేసుకుంటారు. ఈనాటి సమాజ పరిస్థితిని బట్టి లుప్తమై పోతున్న ప్రేమ తత్వాన్ని మానవత్వాన్ని పునరుద్ధరించడం కోసం, వివాహ వ్యవస్థలో కనుమరుగైపోతున్న విలువలను పరిరక్షించడం కోసం, వైవాహిక బంధంలో ఉన్న పరమార్ధాన్ని బోధించడం కోసం అమ్మ అవతరించింది. “సాధ్యమైనదే సాధన” అని చెప్పిన అమ్మ వివాహాన్ని ఒక సాధనగా తీసుకున్నదేమో అనిపిస్తుంది. తాను అసాధారణ స్థితిలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తుల వలెనే వివాహం చేసుకున్నది. ఇల్లాలుగా, కోడలుగా, తల్లిగా అనేక భూమికల్లో తన కర్తవ్యాన్ని సహనంతో నిర్వర్తించింది. అమ్మ దగ్గరకు ఎంతోమంది స్త్రీలు వస్తూ ఉండేవారు. అందరి అభిప్రాయం దాదాపు ఒకటిగానే ఉంటుంది. ఈ సంసారంలో చిక్కుకొని “ఏమీ సాధించలేకపోతున్నాం”తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పవలసినదని ప్రార్థించే వారు కానీ అమ్మ ఎవరికి ఏం చెప్పినా తన అనుభవం నుంచే చెప్పింది. భగవంతుడిని ఆరాధిద్దాం,ఏ భక్తి మార్గాన్ని అనుసరిద్దాం అని ఆలోచించక భర్తనే దైవంగా పూజించి ఆరాధించమని కనపడని దేవుని కొరకు ఏ అరణ్యాలలో ఘోర తపస్సు చేసి సాధించే శక్తిని పతిసేవే తనకు ముఖ్యమని నమ్మి ఒక స్త్రీ సాధించగలదు అంటూ ఉండేది.
నాస్తి స్త్రీణామ్ పృథగ్యజ్జో న వ్రతం నా ప్యు పోషణం |
భర్తృ శుశ్రూషయై వై తా లోకానిస్థాన్ ప్రజంతి హి ||
స్త్రీలు యజ్ఞయాగాదులు కానీ, వ్రతాలను కానీ, ఉపవాసాలను కానీ చేయాల్సిన అవసరం లేదు. భర్త శు శ్రూష యే వారికి వ్రతం. దాని వలన ఇష్టమైన లోకాలను పొందుతారని మార్కండేయ పురాణంలోని ప్రబోధం. భర్తను సేవించి ఎంతటి మహాకార్యాన్నైనా సాధించవచ్చని స్త్రీలందరికీ అమ్మ ఆచరణాత్మకమైన ప్రబోధాన్ని అందించింది. అమ్మ రోజూ తన మెడలోని మంగళ సూత్రాలను అభిషేకించి పూజించి ఆ తీర్థం తీసుకునేది ఆ తీర్థం తీసుకున్నందువలననే ఇతరులకు తీర్థం వేసే అర్హత తనకు వచ్చిందని చెప్పింది.
అమ్మ దృష్టిలో భర్త అంటే భగవంతుడే. అందుకే పెండ్లి అనే పదాన్ని “ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి” అని “పెన్నిధంటే దైవ సన్నిధి” అని నిర్వచించింది. ఒక సోదరి ‘భర్తేదైవం అంటారు కదమ్మా!’ అంటే “అనుకోవాల్సింది ఏమున్నదమ్మా! కాకపోతేగా? అనుకోవడం అంటే ఏదో తెచ్చి పెట్టుకున్నట్లుగానే ఉంటుంది” అన్నది అమ్మ. అమ్మ మాటలన్నీ అనుభవంలో నుంచి వచ్చినవే. ఏదో ఒక దేవుడిని పతిగా భావించి సేవించి తరించిన స్త్రీలు ఉన్నారు. కానీ పతినే దైవంగా భావించి త్రికరణ శుద్ధితో సేవించడం ప్రతివ్రతా ధర్మం. అది ఒక యోగ సాధన. “పాతివ్రత్యము కలిగిన నాతియనగ దైవమనగ జనస్తుత వేరే” అంటూ పతివ్రత సాక్షాత్తు దైవమే అని భీష్ముడు ధర్మరాజుతో అన్నమాట. పాతివ్రత్యపు మహిమతో భర్తప్రాణాలు దక్కించుకోవడం, అవసరమైతే సూర్యగమనాన్ని ఆపివేయడం మొదలైన కథలు గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. వాటిలో చదివిన విన్న పాతివ్రత్యం కలవారు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తే ప్రత్యక్ష నిదర్శనంగా అమ్మ కనిపిస్తుంది. పాతివ్రత్యపు పరాకాష్ఠ స్థితి అమ్మలో గమనించవచ్చు. “పతివ్రత అంటే పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించడం” అని నిర్వచించిన అమ్మ జీవితంలో పంచభూతాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు అనేకం కనిపిస్తాయి. ఈనాటి ఆధునిక సమాజంలో సనాతనంగా వస్తున్న కొన్ని ధర్మాలను సంప్రదాయాలను చాదస్తానికి ప్రతీకలుగా భావిస్తున్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా పాతివ్రత్యం ఒకటి. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తే అందులో ఔన్నత్యం అవగతం అవుతుంది. అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే నేటి మహిళా లోకానికి ప్యాం అంటే ఏమిటో ఆచరించి చూపడానికే అమ్మ వివాహం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. “నా జీవితమే సందేశం” అని చెప్పిన అమ్మ జీవితం ఆదర్శానికి ఆచరణకు మధ్య సమన్వయాన్ని అందిస్తూ మనకు దర్పణమై నిలుస్తోంది. “అద్వైతం సుఖదుఃఖయోః” అన్న దాంపత్య ధర్మం రక్షించబడాలన్నా, మన ఆర్ష సంప్రదాయం ఏం ఉద్దేశించిందో అటువంటి ఆదర్శ సమాజం ఏర్పడాలన్నా, అమ్మ జీవితమే ఆదర్శం.
(సశేషం)