భారతీయ కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైనది భార్యాభర్తల బంధం. అది తల్లి వేరు లాంటిది. ఆ తల్లి వేరే లేకపోతే ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నా ఆ చెట్టుకు ఉనికి ఏముంది? అసలు వివాహమంటేనే ఇద్దరు వ్యక్తులు, భిన్న పరిస్థితులు, భిన్న అభిరుచులు అలవాట్లతో కలిసి జీవించాలి. దీనికి ఎంతో సహనం, సర్దుబాటు మనస్తత్వం కావాలి. భార్యాభర్తల మధ్య సమన్వయ ధోరణి కావాలి. సమన్వయం లేకపోతే సంఘర్షణ తప్పదు. నేటికాలంలో పాశ్చాత్య ధోరణుల వలన భార్యాభర్తలు ఒకరి అంతరంగాన్ని మరొకరు అర్థం చేసుకోలేక, అలాగే పరస్పరం బాధ్యతగా మెలగలేక వారి ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు చొటుచేసుకొని విపరీత పరిణామాలకు సైతం దారి తీస్తున్నాయి. తల్లిదండ్రుల విభేదం కారణంగా పిల్లలు ప్రేమకు కరువై సమాజానికి సమస్యగా మారుతున్నారు. అందుకే ‘భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య’ అనీ, ‘బాధ్యత తెలుసుకుని ప్రవర్తించేవాడు భర్త’ అని నిర్వచించింది అమ్మ.
సామాజికంగా గాని, వ్యక్తిగతంగా గాని సమాజంలో వివాహం అతికీలకమైంది. వివాహం కేవలం ఆ స్త్రీ పురుషుల జీవితాలకే పరిమితమై ఉండదు. తరతరాల సంప్రదాయాన్ని వంశ గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. వివాహం ద్వారా ఏర్పడిన అనుబంధం జీవితాంతం అవిచ్ఛిన్నంగా సాగిననాడే ఆ కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది. పురుషుడికయినా, స్త్రీకయినా నిబద్ధత కావాలి. భావనలోను, బాహ్యంలోను భర్తను వీడని భార్య, భార్యను వీడని భర్త వీరి ఐక్యత ఉత్తమ సమాజానికి పునాది అవుతుంది. సంసార రథానికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రాలు. అవి సక్రమంగాను, సమానంగాను ఉన్నప్పుడే సురక్షితంగా గమ్యం చేరుకుంటుంది ఆ రథం. భార్యాభర్తల సంబంధాన్ని గురించి అమ్మ ఒకసారి సంభాషణా పూర్వకంగా ‘తలవంచి తాళి కట్టించుకునేది భార్య, నడుం వంచి తాళి కట్టేవాడు భర్త’ అని చెప్పింది. ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉన్నదని సూచించింది. కనుక అమ్మ చెప్పినట్లుగా భార్యాభర్తలు ఒకరి భావాన్ని ఒకరు గుర్తెరిగి పరస్పరం బాధ్యతతో నడుచుకుంటే అది అనుకూల దాంపత్యం అవుతుంది. అటువంటి వివాహ వ్యవస్థ సర్వాంగీణంగా శోభిల్లుతుంది.
మరొక సందర్భంలో అమ్మ- భార్యకు భర్త దేవుడయితే భర్తకు భార్య దేవతే అని చెప్పింది. ఈ వాక్యం వినగానే ‘భర్త భార్యకు దేవుడు’ అని కదా ప్రసిద్ధంగా వినవచ్చే మాట మరి అమ్మ ఈ విధంగా చెప్పిందేమిటి? ఆలోచించి చూస్తే సంప్రదాయంలోని ఆంతర్యాన్ని గుర్తు చేస్తూ అమ్మ చెప్పినట్లు గుర్చించవచ్చు. నిదానించి ‘ఏష ఆత్మనః యత్పత్నీ తన్మిధునం’ అని పురుషార్థ సాధనలో భర్తలో సగం స్థానాన్ని భార్య పొందుతుందని ఈ మంత్రం మనకు ప్రబోధిస్తోంది.
కన్యాదాన సమయంలో కూడా ‘కన్యాం కనక సంపన్నాం’ అంటూ వరుడు నారాయణ స్వరూపుడయితే వధువును లక్ష్మీ స్వరూపిణిగా భావించి ఈ కన్యాదానం ఉత్తమలోక ప్రాప్తికి చేసే మహత్కార్యంగా భావించారు పెద్దలు. ప్రపంచ దేశాలన్నీ కొనియాడే ధర్మబద్ధమైన వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులిద్దరికీ సమ ప్రాధాన్యమే కనిపిస్తుంది. వారిలో భేదం కానీ, విభాగం కాని ఉండదు.
‘సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువమ్.
భార్య కారణంగా భర్త, భర్త కారణంగా భార్య ఏ ఇంటిలో అయితే సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో వారందరికీ శుభాలే కలుగుతాయని పెద్దలమాట. కనుకనే అమ్మ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ భార్యకు భర్త దేవుడయితే, భర్తకు భార్య దేవత అని సమన్వయాత్మకంగా సమానత్వాన్ని సంపూర్ణత్వాన్ని ప్రబోధించింది. చిన్నతనంలోనే అమ్మ తన ప్రబోధం ద్వారా ఎంతోమందిని సంస్కరించి వారి జీవితాలను చక్క బెట్టింది. నిత్య జీవిత నిర్వహణ సక్రమంగా సాగించడమే ఆధ్యాత్మిక సౌధానికి సోపానమని అమ్మ సందేశం.