“గుర్తు చూపించేవాడు గురువు” అన్నది అమ్మ. దేనికి గుర్తుచూపించాలి ? సర్వవ్యాపి అయిన పరమాత్మను గుర్తించడానికి. వాడు సర్వవ్యాపకుడు కాబట్టి వాడి వునికిని గుర్తించటానికి ఈ గుర్తు చూపటం. వాడు చూచాడా ? ఏమో! చూచుంటే అడిగే వారికి చెప్పేవాడేకదా. బహుశ వాడూ చూడలేదేమో వినటం తప్ప, ఆ గుర్తు కూడ తానే కనుక. అట్లా అందరినీ అనలేను. గురువు అంటే ఎటువంటివాడు ? ఎట్లా వుంటాడు ? “గురుబ్రహ్మా గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః” అన్నారు. అంటే వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అనగా సృష్టి, స్థితి లయ కారుడు తానే అయినటువంటి వాడు. అటువంటి గురువులనే సద్గురువు అంటారు. అటువంటి వారికి భగవంతుని ఉనికి తెలుస్తుంది. వాడు గుర్తు చెప్ప కలిగిన సత్తా అయినవాడు అయి వుంటాడు. అటువంటి వారిని మనం గుర్తించి గుర్తు అడగాలి. అట్లా మనము గుర్తించి వారిని అడిగితే వారు వేసిన ప్రశ్న ఏవిటంటే ఇంతకీ నీవు ఎవరు ? అని. రమణమహర్షి నీవెవరో తెలుసుకో ? అని ‘అన్నట్లుగా. అప్పుడు వానికి ఇంతకూ నేనెవరు ? అనే జిజ్ఞాస బయలుదేరింది. ఆలోచించగా ఆలోచించగా దేహం నేను కాను అని స్ఫురించింది. నేను ఈ దేహమును కాను అని నిర్ణయించిన ఆ నేనెవరు ? అని అతనికి తనతో ఆత్మ విచారణ బయలుదేరినప్పుడు అనేక బిందెల నీళ్ళల్లో ఒక సూర్యుడు కనిపించినట్లుగా అనేక జీవులలో, జీవాత్మలలో నున్న నేను నిశ్చలమైన నేనుగా అందరు హృదయ కుహరాలలో ఆశించే చైతన్యమే ఆ పరమాత్మా, పరంజ్యోతి, పరాశక్తి, ఎంత వెదికినా బయట ఎక్కడో దొరకదు. అసలున్నది నీలోనే “నేను” గనే భాసించింది.
అమ్మ చూపించిన గుర్తు
K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : October
Issue Number : 3
Year : 2014
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.