“నీ కన్నుల కదలికలో నిలచె మాదు బ్రతుకు తెల్ల
ఏ కదలిక కేమి ఫలమో ఎరుగరెవరు నీవుకాక” – అని
అమ్మను కీర్తించారు రాజుబావ. ఆ మాట ముమ్మాటికీ నిజం. శ్రీలలితా సహస్ర నామావళిలో ‘ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి’:- అనే నామం – జగజ్జనని కనులు తెరిస్తే జగత్తు ప్రభవిస్తున్నది, మూస్తే లయమవుతున్నది – అని జగన్మాతృ వైభవాన్ని విశదపరుస్తోంది.
కృపతో అమ్మ ఒక్కసారి మనవైపు చూస్తే చాలు; మన జీవితాలు పండి పోయినట్లే, ఇక కోరుకోవలసిన దేమీ ఉండదు, దుర్లభమైన పరమ పదాన్ని చేరుకున్నట్లే. అమ్మ పలుకు, చూపు, సంకల్పం, కదలిక ఎంతో మహిమాన్వితమైనవి; అగ్రాహ్యమైనవి. ఆ పవిత్ర సన్నిధిలో అష్టసిద్ధులు, ఆ పాదాల్లో అప్లైశ్వర్యాలూ, ఆ దివ్య శరీరంలో సకల విభూతులూ దీపిస్తూంటాయి.
ఒక స్వీయ అనుభవం. అనుభవం చిన్నదైనా అనుభావం గొప్పది. 1975 సం. ము, మార్చినెల. నేను N.G.R.I లో పనిచేస్తున్నాను. మా సంస్థ తరపున తమిళనాడులో ఎట్టయాపురం (తమిళ విప్లవ రచయిత శ్రీ సుబ్రహ్మణ్యభారతి జన్మస్థలి) వద్ద Magnetic Observatory స్థాపించారు. దానికి నన్ను Incharge గా నియోగించారు. మొదటిసారి వెళ్ళవలసి ఉన్నది. మద్రాసు Central Station లో సాయంకాలం Egmore – Tirunelveli Express లో బయలు దేరి మర్నాటి ఉదయం గం 6-30 లకి కోయల్పట్టీలో దిగి, బస్సులో గమ్యస్థానం చేరుకోవాలి.
అమ్మ మద్రాసులో హేమమాలినీ కళ్యాణ మండపంలో దర్శనం ఇస్తున్న సమయం. నేను అక్కడే ఉన్నాను. సాయంత్రం రైలు బయలదేరు సమయం ఆసన్నమైంది. అమ్మ దర్శనం ఇవ్వడం కోసం స్నానం చేస్తున్నది. తప్పని సరిగా వెళ్ళాలి. ఎలా? అమ్మకి చెప్పి వెళ్ళాలని నా తపన. చేసేదేమీ లేక వెలుపలినుంచే “అమ్మా! నేను వెడుతున్నాను” అని నివేదన చేసి బయలుదేరాను.
‘అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియః శివః’ (విష్ణువు అలంకారప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు) – అనేది ఆరోక్తి. మర్నాడు ఉదయం ఎట్టయాపురం దగ్గర Observatory కి చేరుకున్నాను. అక్కడ తెలుగు తెలిసిన Ramakrishna అనే మా కార్యాలయ ఉద్యోగి నాకు భోజన సౌకర్యం కలిగించారు. ఆరోజు విశ్రమించి మర్నాటి సాయంత్రం బస్సులో కోయల్పట్టీ వెళ్ళి అక్కడ దేవాలయాలు ఉన్నాయా అని వాకబు చేశాను. చంపకవల్లి (షంబగవళ్ళి) అమ్మవారి ఆలయం ఉన్నదన్నారు. ఆలయానికి వెళ్ళాను.
అమ్మవారు స్నానం చేస్తోంది కూర్చోండని చెప్పారు. అమ్మవారి స్నానం, అలంకారం ముగిసిన పిమ్మట దర్శనంచేసుకున్నాను. కాగా, ఈ సందర్భం నాకు మహా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. మద్రాసులో నేను బయలుదేరే సమయానికి అమ్మ స్నానం చేస్తూ ఉండటం, ఇక్కడ నేను చేరుకునే సమయానికి అమ్మ వారు స్నానం చేస్తూ ఉండటం ఒక మహాద్భుతమైన అనుభూతి, మహత్తర – సందేశం – అనిపించింది. అక్కడ ఆశ్రితకల్పవల్లి అమ్మ, ఇక్కడ చంపకవల్లీదేవి – ఆదిశక్తి రూపాలే.
మద్రాసులో నా అభ్యర్ధనను అమ్మ స్వీకరించి అనుమతినిచ్చానని ఇక్కడ చంపకవల్లీదేవి.. రూపంలో ఋజువు చేసింది. దీని సారాంశము ఏమంటే – అమ్మ మన మాట విననవసరంలేదు, బొట్టుపెట్టి ప్రసాదం చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. పరిమితులు మానవులకు; అపరిమితత్వానికి కాదు. అమ్మ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉన్నది, ఉంటున్నది, ఉంటుంది.
మనం జిల్లెళ్ళమూడికి దూర సుదూర ప్రాంతాల్లో ఉంటూన్నా – మన మాట అమ్మకి వినిపిస్తోంది, మన వేదనకి అమ్మ హృదయం ద్రవిస్తోంది, అడగకుండానే వరాల్ని వర్షిస్తోంది, ఆపత్కాలంలో చేయూత నందిస్తోంది, అనుక్షణం తన ఒడిలోనే లాలిస్తోంది- అన్నది వాస్తవం. ఆ స్మరణ, స్ఫురణ మన హృదయాంతరాళాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.