ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ దర్శనార్థం అమ్మ గదిలో అడుగు పెట్టాను. అమ్మ దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నది. నేను నిశ్శబ్దంగా గోడకు ఆనుకుని కూర్చున్నాను.
దుప్పటిలోంచే అంతర్వాణిలా “నాన్నా! సుబ్రహ్మణ్యం! వెళ్ళి అన్నం తినిరా” అన్నది. అమ్మ సాన్నిధ్య భాగ్యాన్ని వదులుకోవటం ఇష్టంలేక ‘తిన్నా నమ్మా’ అని అబద్ధమాడాను. “నాన్నా! నాకు తెలుసు. నువ్వు అన్నం తినలేదు. వెళ్ళి అన్నం తినిరా”అన్నది ఆ ప్రేమమూర్తి.
ఇంటివద్ద ఉండే కన్నతల్లికి జిల్లెళ్ళమూడిలో ఉండే అసలైన అమ్మకు తేడా ఇక్కడ స్పష్టమౌతుంది. అమ్మ నన్ను కళ్ళతో చూడలేదు. సర్వజ్ఞత్వాన్ని తన మాతృధర్మం కోసం వినియోగిస్తుంది. “నాకు తెలుసు, నువ్వు అన్నం తినలేదు” ఈ మాట అనసూయమ్మ మాత్రమే అనగలదు.
బిడ్డలకు అన్నం పెట్టుకోవటం కోసం అమ్మకి ఎంత శ్రద్ధ? ఎంత తపన?
‘అన్నాత్ భూతాని జాయంతే’ అని భగవద్గీత; ‘అన్నం బహుకుర్వీత’, ‘అన్న బ్రహ్మేతి వ్యజానాత్’, ‘అన్నం న నింద్యాత్’, ‘అన్నాదేవ ఖల్విమానిభూతాని జాయంతే’, ‘అన్నాత్ పురుషః’ – అని వేదం ప్రబోధిస్తున్నాయి.
ఒకసారి అమ్మ చిదంబరరావుగారిని “అన్నం పుట్టినందుకు తింటారా? తినేందుకు పుడతారా?” అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. నాకు అందినంతవరకు ఆ ప్రశ్నకి కొన్ని సమాధానాలు:-
- జీవశాస్త్ర (Biology) రీత్యా మొక్కలు స్వతంత్రంగా ఆహారం తయారుచేసుకుంటాయి. ఆహారం అంటే శక్తి రూపాంతరం. జీవుల శరీరాల్లో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలౌతుంది. ఏతావాతా మానవు లంతా పరాన్న జీవులు. మనం ఆకలివేస్తే అన్న తింటాం; కానీ వాస్తవం ఏమంటే శక్తికోసం.
- అర్షవిజ్ఞాన రీత్యా అగ్నులు 8 రకాలు. అందులో వైశ్వానరాగ్ని (ఆకలి బాధ – మంట) ఒకటి. ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః’ అన్నారు కృష్ణపరమాత్మ. అన్నం ఎవరికైనా పెడితే దానిని ‘యాగం’ అంటారు; అన్నం తాను భుజిస్తే ‘అనుయాగం’ అంటారు. అన్నం అనేది వైశ్వానరాగ్నికి ‘అమ్మ’ సమర్పించే హవిస్సులు. ‘అన్నపూర్ణాలయం’అమ్మ యాగశాల, ప్రేమ ప్రయోగశాల.
- పారమార్ధిక సత్యం: ‘స్వాదన్నం న తు యాచ్యతాం, విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్’ – అని ప్రబోధించారు శంకరులు. రుచికరమైన ఆహారం కోసం ప్రాకులాడవద్దు; సమయానికి ఏది లభిస్తే దానిని స్వీకరించి తృప్తిచెందాలి – అని. పదార్ధం రుచి నాలికపై ఉన్నంతసేపే, గుటక వేశాక తీపి లేదు, చేదు లేదు. అలనాడు జిల్లెళ్ళమూడిలో చింతకాయ పచ్చడి, చారు, నీళ్ళ మజ్జిగ అంటే ఒక మహత్వపూర్ణ విందు భోజనమే, అది ఆధి వ్యాధులకు దివ్యౌషధం; రుచి వర్ణనాతీతం; రూపం ఆదరణ, ఆప్యాయత; శక్తి అలౌకికం.
ఒకనాడు శ్రీ బి. వాసుదేవాచారి గారు అన్నారు “అమ్మా! అంతా బాగానే ఉంది. (అభివృద్ధి) development లేదు”అని. అందుకు అమ్మ ‘నాన్నా! నీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే బిల్డింగ్స్ అనా? కానీ నా ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఇంకా వేలమంది భోజనం చేసి పోవటం. అది జరుగుతోంది”అన్నది.
అంటే జిల్లెళ్ళమూడి యాత్రికులు చేయవలసిన పనులు రెండు – అమ్మను దర్శించుకోవటం, అన్నప్రసాదం స్వీకరించటం.
తొలిరోజుల్లో వచ్చే సందర్శకులకు నాన్నగారి సౌజన్యంతో స్వయంగా అమ్మ అన్న వండి వడ్డించేది.
15-8-58లో అన్నపూర్ణాలయం స్థాపించింది. నాటినుండి లక్షలమంది అక్కడ అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. కాగా, అమ్మ సశరీరంగా ఉన్నప్పుడు వేలాదిమందికి స్వయంగా అన్నం కలిపి గోరుముద్దలు చేసి ప్రేమతో నోటికి అందించేది. అది అమ్మకి అమితానందాన్ని కలిగించేది.
“అన్ని బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ” అంటూ అమ్మ అన్నానికి, ఆకలికి ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. ‘అన్నం కాదు, జ్ఞానాన్నం’ అన్నారు శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు. ఆ రూపంగా అమ్మ జ్ఞాన భిక్ష పెడుతోందన్న మాట. “అది ఆకలి తీర్చే అన్నం మాత్రమే కాదు, మహా ప్రసాదం. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది’అని ఉద్బోధించారు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు.
ఒకనాడు అమ్మ నాకు గడ్డపెరుగు అన్నం తినిపిస్తోంది. తన నాలుగువేళ్ళు నోటిలో పెట్టి బొటనవేలుతో ముద్ద నెట్టుతున్నది. “నాన్నా! నాలుగు వేళ్ళూ లోపలికి పోవటం అంటే ఇదే” – అన్నది.
‘అన్నపూర్ణేశ్వరివి, నువ్వే స్వయంగా అన్నం పెడుతూంటే నాకు అన్నానికి లోటు ఏముంటుంది?’ అన్నాను. ఆప్రక్కనే ఉన్న శ్రీ రామకృష్ణ అన్నయ్య “నాలుగువేళ్ళూ లోపలికి పోవటం అంటే ఎవరికి వారు తమ బొజ్జ నింపుకోవటం కాదు. అమ్మ మనకి ఎంత ఆదరణగా పెడుతోందో, మనం కూడా అలా పెట్టుకోవాలని” అన్నాడు. ఎంత నిజం!!
15-8-2021 అన్నపూర్ణాలయ వార్షికోత్సవం. అన్నపూర్ణాలయ నిర్వహణలో భాగస్వాములవుదాం. తోడబుట్టిన వారికి ప్రేమతో అన్నప్రసాదం పంచుదాం. తద్వారా అమ్మ ఆశ్చర్యకర వాత్సల్యానికి, అనుగ్రహ వృష్టికి పాత్రులవుదాం.
అమ్మచేతి గోరు ముద్దలు వాత్సల్య ప్రపూర్ణాలు, ఐహికాముష్మిక ఫలప్రదాలు, మోక్ష ద్వారాలు.